అశ్వారావుపేట రూరల్ : అశ్వారావుపేట పట్టణంలోని పామాయిల్ ఫ్యాక్టరీలో క్రూడాయిల్(ముడి పామాయిల్)ను తెట్టు(స్లడ్జ్) పేరుతో తక్కువ ధరకు విక్రయించి రవాణా చేస్తున్న ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. బుధవారం రాత్రి పామాయిల్ అక్రమంగా రవాణా చేస్తుండగా రైతులు అడ్డుకున్న విషయం విదితమే. ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించడంతో హైదరాబాద్ నుంచి సీనియర్ మేనేజర్ రంగారెడ్డి, ప్లాంట్స్ మేనేజర్ ఎండీ బాషా, ఫైనాన్స్ మేనేజర్ తిరుపతిరెడ్డి, డిప్యూటీ ఫైనాన్స్ మేనేజర్ సీతారాములుతో కూడిన బృందం విచారణ నిమిత్తం గురువారం ఫ్యాక్టరీకి వచ్చింది. తొలుత వారు ఫ్యాక్టరీలోని క్రూడ్ ఆయిల్‌ను పరిశీలించారు.
ట్యాంక్‌ల ద్వారా ఈటీపీ ప్లాంట్‌ను పరిశీలించారు. అనంతరం ఈటీపీ ప్లాంట్ వెనుక భాగంలోగల స్లడ్జ్ చెరువును కూడా పరిశీలించి దాంట్లో క్రూడ్ ఆయిల్ కొంతమేర కలుస్తున్నట్లు ప్రాథమికంగా తేల్చారు. స్లడ్జ్‌లో క్రూడ్ ఆయిల్ కలవడం జరుగుతుంటుందని, ప్రస్తుతం 0.1 శాతం కలిసిందని బృందం గుర్తించారు. అధికారుల నిర్లక్ష్యంతోపాటు, సామర్థ్యానికి మించి గెలల క్రషింగ్ వల్ల, పైపులైను ద్వారా లీకై స్లడ్జ్‌లో క్రూడాయిల్ కలుస్తుందని వారు అభిప్రాయపడ్డారు.
విచారణ బృందాన్ని నిలదీసిన రైతులు
విచారణ బృందం వస్తుందన్న సమాచారం తెలుసుకున్న పలు రైతు సంఘాలు, రైతులు అక్కడికి చేరుకున్నారు. ఫ్యాక్టరీలో వరుసగా జరుగుతున్న అవినీతి, అక్రమాలపై నిలదీశారు. గెలల క్రషింగ్‌లో జాప్యం జరుగుతోందని, ఆయిల్ రికవరీ కూడా దారుణంగా తగ్గిపోతుందని మాజీ జడ్పీటీసీ జేకేవీ రమణరావు, జడ్పీటీసీ అంకత మల్లికార్జునరావుతో పాటు పలువురు రైతులు విచారణ బృందం దృష్టికి తీసుకెళ్లారు.
క్రషింగ్ జాప్యం కావడంతో గెలలు కుళ్లిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఫ్యాక్టరీకి మంచి రోజులు వస్తాయని వారు సర్థిచెప్పేందుకు యత్నించగా, మంచి రోజులేమీ రావడం లేదని, నిత్యం అవినీతి అక్రమాలే రాజ్యమేలుతున్నాయని, ఫ్యాక్టరీ మూతపడే స్థితికి చేరుకుంటుందని అన్నారు.
క్రూడాయిల్ అక్రమ రవాణాపై విచారణ
Published Fri, Sep 12 2014 1:32 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM
Advertisement
Advertisement