అశ్వారావుపేట, న్యూస్‌లైన్: అశ్వారావుపేటలోని పామాయిల్ ఫ్యాక్టరీలో కుంభకోణాలు ఒకటొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇక్కడ మంగళవారం ఓ ఆయిల్ ట్యాంకర్‌ను నిబంధనలకు విరుద్ధంగా తరలించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. దీనిపై ‘న్యూస్‌లైన్’ ఆరా తీయగా.. ఆ ట్యాంకర్ యజమాని, ఫ్యాక్టరీ మేనేజర్ నీళ్లు నమిలారు. ఈ ఫ్యాక్టరీ అవినీతి ఊటగా, కుంభకోణాలమయంగా మారిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రభుత్వరంగానికి చెందిన ఈ ఫ్యాక్టరీలో జరుగుతున్న అవినీతి అక్రమాలతో పామాయిల్ రైతులు నష్టపోతుండగా.. అధికారులు బాగుపడుతున్నారు. పామాయిల్ గెలల కుంభకోణం.. ముడి చమురు కుంభకోణం.. గింజల కుంభకోణం.. కార్మికుల వేతనాలు, ఈపీఎఫ్ చెల్లింపుల్లో అక్రమాలు... ఇలా చెప్పుకుంటే పెద్ద జాబితానే అవుతుంది.
ఇందులోని కొన్నింటి చిట్టా ఇది...
2011లో: ప్రవేటు కంపెనీల ఒత్తిడికి ఫ్యాక్టరీ అధికారులు తలొగ్గి, ఇక్కడ ఆయిల్ రివకరీని తక్కువగా చూపించేందుకు ప్రయత్నిం చారు. ఇందుకోసం, సుమారు 20వేల టన్నుల పామాయిల్ గెలలను కుళ్లబెట్టారు. ఫలితంగా, పరిశ్రమకు ప్రత్యక్షంగా 10కోట్ల రూపాయల నష్టం వచ్చింది. పరోక్షంగా రైతులకు ఇంతకంటే ఎక్కువ నష్టమే జరిగిం ది. దీనిపై ఎలాంటి విచారణ జరగనేలేదు.
2011 డిసెంబర్‌లో: రెండు లారీల (34 టన్నుల) ముడి చమురు చోరీ జరిగినట్టుగా అశ్వారావుపేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇప్పటివరకు ఈ కేసు అతీగతీ లేదు. ఆయిల్‌ఫెడ్ ఉన్నతాధికారులు కూడా ఎలాంటి విచారణ చేపట్టలేదు.
2011 డిసెంబర్‌లో: 98 టన్నుల ముడి చమురు అధికంగా వచ్చినట్టుగా అధికారులు రికార్డుల్లో చూపించారు. అది ఎక్కడి నుంచి వచ్చిందో మాత్రం చూపలేకపోయారు.
2012లో: బ్రేక్ డౌన్ పేరుతో ఈ ఫ్యాక్టరీని అధికారులు పలుమార్లు మూసేసి, పామాయిల్ గెలలను ఇతర పరిశ్రమలకు తరలించారు. ఇలా ఈ ఒక్క సంవత్సరంలోనే ఫ్యాక్టరీకి రెండుకోట్ల రూపాయల వరకు నష్టపోయింది. ఓ కాంట్రాక్టర్‌కు లాభం చేకూర్చేందుకు అధికారులు కావాలనే ఇలా చేశారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి.
2013లో: నూనె రికవరీ ఒక శాతం తగ్గింది. దీని ఫలితంగా సంస్థకు ప్రత్యక్షంగా ఏడాదికి రూ.2కోట్లు నష్టం. కేవలం అశ్వారావుపేట ఫ్యాక్టరీలోనే 2-3శాతం రివకరీ పడిపోయింది. ఇదే విషయాన్ని ఆయిల్‌ఫెడ్ ఉన్నతోద్యోగుల బందం దవీకరించింది. అయి నా అధికార యంత్రాంగం మేల్కొనలేదు.
2013లో: పరిశ్రమలో సుమారు 250 టన్నుల నూనె గింజలు మాయమైనట్టుగా ఇక్కడి అధికారులు గుర్తించి, ఉన్నతాధికారులకు నివేదించారు. ఈ వ్యవహారంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న అధికారులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేసి, ఆ తరువాత ఎత్తివేశారు.
ఫ్యాక్టరీ సామర్థ్యం పెంచినప్పటికీ విద్యుత్ సరఫరాపై దృష్టి పెట్టకపోవడంతో డీజిల్ వినియోగం పెరిగింది. ఈ కారణంగా సంస్థపై సుమారు 50లక్షల రూపాయల భారం పడింది. కేవలం కమీషన్ల కోసమే విద్యుత్ సరఫరాను తగ్గించి, డీజిల్ వినియోగం పెరిగేలా ఇక్కడి అధికారులు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఉన్నతాధికారులు స్పందించలేదు.
1.5కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈటీపీ ప్లాంటును ఏడాదిన్నర తరువాత వినియోగంలోకి తెచ్చారు. ఆ తర్వాత కూడా ఇది కొంతకాలం మాత్రమే పనిచేసింది. ఫలితంగా, దీని కోసం వెచ్చించిన 1.5కోట్ల రూపాయలు దాదాపు వృధా అయినట్టే. దీనికి బాధ్యులైన వారిపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.
గడిచిన నాలుగేళ్లలో ఈ ఫ్యాక్టరీలో సుమారు 20కోట్ల రూపాయల అవినీతి, అక్రమాలు జరిగి ఉంటాయని అంచనా. ప్రైవేటు కంపెనీల కనుసన్నల్లో అశ్వారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీ అధికారులు పనిచేస్తున్నారని, అక్రమాలకు పాల్పడుతున్నారని, అందినంత దండుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వీటిపై ఉన్నతాధికారులు స్పందించకపోవడంపై ఇక్కడి పామాయిల్ రైతుల్లో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి.
పామాయిల్ ఫ్యాక్టరీలో అవినీతి ఊట..!
Published Thu, May 22 2014 2:06 AM | Last Updated on Sat, Sep 15 2018 3:51 PM
Advertisement
Advertisement