Aswarao peta
-
రెండో ఫ్యాక్టరీ రెడీ
దమ్మపేట(అశ్వారావుపేట): దశాబ్దకాలంగా ఇక్కడ పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టాలనే ఈ ప్రాంత రైతాంగం డిమాండ్ ఎట్టకేలకు నెరవేరింది. దమ్మపేట మండలం అశ్వారావుపేటలో రూ.72 కోట్ల వ్యయంతో చేపట్టిన పామాయిల్ ఫ్యాక్టరీ ట్రయల్ రన్ విజయవంతమైంది. స్థానిక శాసనసభ్యుడు, ట్రైకార్ చైర్మన్ తాటి వెంకటేశ్వర్లు శనివారం ట్రయల్‌రన్ నిర్వహించారు. గత ఏడాది ఏప్రిల్‌లో అక్కడ ఫ్యాక్టరీ నిర్మాణ పనులను రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ట్రైకార్ చైర్మన్ తాటి వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఈ ఫ్యాక్టరీ రోజుకు 20 గంటలు పనిచేస్తుంది. నాలుగు గంటలు మెయింటెటెన్స్ నిమిత్తం నిలిపివేస్తారు. గంటకు 30 టన్నుల పామాయిల్ గెలల క్రషింగ్ సామర్థ్యంతో పనిచేసే ఈ ఫ్యాక్టరీలో రోజుకు 600 టన్నులను క్రషింగ్ చేస్తారు. ఏడాదికి 1.20 లక్షల టన్నులు.. ఫ్యాక్టరీలో ఏటా 1.20 లక్షల టన్నుల పామాయిల్ గెలలను క్రషింగ్ చేయాలని ఆయిల్‌ఫెడ్ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. తెలంగాణ ఆయిల్‌ఫెడ్ పరిధిలో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో 12,196 హెక్టార్లలో పామాయిల్ సాగు విస్తరించి ఉంది. వీటిలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే 23 వేల ఎకరాల్లో సాగులో ఉండగా, అందులో ఒక్క దమ్మపేట మండలంలోనే 13 వేల ఎకరాలు సాగులో ఉంది. ప్రస్తుత పంట దిగుబడి ఆధారంగా 80 వేల టన్నులు క్రషింగ్ చేయించేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట, అశ్వారావుపేట, ములకలపల్లి, పాల్వంచ, చండ్రుగొండ, జూలూరుపాడు, ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి, తల్లాడ, ఏన్కూరు మండలాలల్లో పామాయిల్ పంట సాగులో ఉంది. ఈ రెండు జిల్లాలతో పాటు, సూర్యాపేట జిల్లాలో కూడా ఈ ఏడాది 10 వేల హెక్టార్లలో పామాయిల్ సాగు విస్తీర్ణం పెంచాలని ఆయిల్‌ఫెడ్ లక్ష్యంగా పెట్టుకుంది. శుద్ధిచేసిన పామాయిల్ ఇక్కడే తయారీ శుద్దిచేసి కల్తీలేని పామాయిల్‌ను తెలంగాణ బ్రాండ్‌తో ఇక్కడ నుంచే విక్రయాలు జరిపేలా ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు అశ్వారావుపేట శాసనసభ్యుడు, రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ తాటి వెంకటేశ్వర్లు తెలిపారు. ఫ్యాక్టరీ ట్రయల్ రన్ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇక్కడే ఆయిల్ రిఫైనరీ ఏర్పాటు చేయించేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు అశ్వారావుపేటలో ఆయిల్‌ఫెడ్ ఆధ్వర్యంలో నడుస్తున్న పామాయిల్ కర్మాగారంలో వచ్చిన ఆయిల్ శాతమే రెండు రాష్ట్రాల్లోని పామాయిల్ ధరను నిర్ణయిస్తోందని తెలిపారు. తెలంగాణ పామాయిల్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆలపాటి రామచంద్రప్రసాద్ మాట్లాడుతూ పామాయిల్ ధరల్లో తెలంగాణాదే పై చేయి అని అన్నారు. తొలుత తాటి వెంకటేశ్వర్లు ట్రాక్టర్‌ను నడిపి పామాయిల్ గెలలను హైడ్రాలిక్ షెట్టర్ల వద్ద దిగుమతి చేశారు.ఆయిల్‌ఫెడ్ సీనియర్ మేనేజర్ సుధాకర్‌రెడ్డి, డీఎం ఉదయ్ధీర్రెడ్డి, ఫ్యాక్టరీ మేనేజర్ శ్రీకాంత్‌రెడ్డి, డీఈ రామారావు, ఎంపీపీ అల్లం వెంకమ్మ, జేడ్పీటీసీ దొడ్డాకుల సరోజనీ రాజేశ్వరరావు, మాజీ సొసైటీ అధ్యక్షుడు పైడి వెంకటేశ్వరరావు, సర్పంచ్ బుద్దా రాజు, ఎంపీటీసీ గంటా వెంకటేశ్వరరావు, రావు గంగాధరరావు, ఏఎంసీ చైర్మన్ తానం లక్ష్మీ, వైస్ చైర్మన్ కొయ్యల అచ్యుతరావు, ఆత్మ కమిటీ చైర్మన్ కేవీ సత్యన్నారాయణ, టీఆర్ఎస్ నాయకులు పానుగంటి సత్యం, పోతినేని శ్రీరామవెంకటరావు, దారా యుగంధర్, తదితరులు పాల్గొన్నారు. -
క్రూడాయిల్ అక్రమ రవాణాపై విచారణ
అశ్వారావుపేట రూరల్ : అశ్వారావుపేట పట్టణంలోని పామాయిల్ ఫ్యాక్టరీలో క్రూడాయిల్(ముడి పామాయిల్)ను తెట్టు(స్లడ్జ్) పేరుతో తక్కువ ధరకు విక్రయించి రవాణా చేస్తున్న ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. బుధవారం రాత్రి పామాయిల్ అక్రమంగా రవాణా చేస్తుండగా రైతులు అడ్డుకున్న విషయం విదితమే. ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించడంతో హైదరాబాద్ నుంచి సీనియర్ మేనేజర్ రంగారెడ్డి, ప్లాంట్స్ మేనేజర్ ఎండీ బాషా, ఫైనాన్స్ మేనేజర్ తిరుపతిరెడ్డి, డిప్యూటీ ఫైనాన్స్ మేనేజర్ సీతారాములుతో కూడిన బృందం విచారణ నిమిత్తం గురువారం ఫ్యాక్టరీకి వచ్చింది. తొలుత వారు ఫ్యాక్టరీలోని క్రూడ్ ఆయిల్‌ను పరిశీలించారు. ట్యాంక్‌ల ద్వారా ఈటీపీ ప్లాంట్‌ను పరిశీలించారు. అనంతరం ఈటీపీ ప్లాంట్ వెనుక భాగంలోగల స్లడ్జ్ చెరువును కూడా పరిశీలించి దాంట్లో క్రూడ్ ఆయిల్ కొంతమేర కలుస్తున్నట్లు ప్రాథమికంగా తేల్చారు. స్లడ్జ్లో క్రూడ్ ఆయిల్ కలవడం జరుగుతుంటుందని, ప్రస్తుతం 0.1 శాతం కలిసిందని బృందం గుర్తించారు. అధికారుల నిర్లక్ష్యంతోపాటు, సామర్థ్యానికి మించి గెలల క్రషింగ్ వల్ల, పైపులైను ద్వారా లీకై స్లడ్జ్లో క్రూడాయిల్ కలుస్తుందని వారు అభిప్రాయపడ్డారు. విచారణ బృందాన్ని నిలదీసిన రైతులు విచారణ బృందం వస్తుందన్న సమాచారం తెలుసుకున్న పలు రైతు సంఘాలు, రైతులు అక్కడికి చేరుకున్నారు. ఫ్యాక్టరీలో వరుసగా జరుగుతున్న అవినీతి, అక్రమాలపై నిలదీశారు. గెలల క్రషింగ్‌లో జాప్యం జరుగుతోందని, ఆయిల్ రికవరీ కూడా దారుణంగా తగ్గిపోతుందని మాజీ జడ్పీటీసీ జేకేవీ రమణరావు, జడ్పీటీసీ అంకత మల్లికార్జునరావుతో పాటు పలువురు రైతులు విచారణ బృందం దృష్టికి తీసుకెళ్లారు. క్రషింగ్ జాప్యం కావడంతో గెలలు కుళ్లిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఫ్యాక్టరీకి మంచి రోజులు వస్తాయని వారు సర్థిచెప్పేందుకు యత్నించగా, మంచి రోజులేమీ రావడం లేదని, నిత్యం అవినీతి అక్రమాలే రాజ్యమేలుతున్నాయని, ఫ్యాక్టరీ మూతపడే స్థితికి చేరుకుంటుందని అన్నారు. -
కదంతొక్కిన ‘పామాయిల్’ కార్మికులు
అశ్వారావుపేట, న్యూస్‌లైన్: ఆయిల్‌ఫెడ్ ప్రభుత్వరంగ సంస్థకు చెందిన అశ్వారావుపేట పామాయిల్ పరిశ్రమలో జరిగిన అవకతవకలపై కార్మికులు కదంతొక్కారు. ఫ్యాక్టరీ ఎదుట మంగళవారం ఆందోళన నిర్వహించారు. వారికి వైఎస్ఆర్సీపీ తెలంగాణ రాష్ట్ర శాసనసభ పక్షనేత తాటి వెంకటేశ్వర్లు అండగా నిలిచారు. కాంట్రాక్టు కార్మికుల రెక్కల కష్టాన్ని దోచుకున్న వారి నుంచి తిన్నదంతా క క్కిస్తానని కార్మికులకు మద్దతుగా ఫ్యాక్టరీ ఎదుట బైఠాయించారు. కార్మికులకు న్యాయం జరిగే వరకు పోరాడుతానన్నారు. అశ్వారావుపేటలో సమస్య పరిష్కారం కాకపోతే హైదరాబాదులోని ఆయిల్‌ఫెడ్ ప్రధాన కార్యాలయానికి కార్మికులకు తన సొంత ఖర్చులతో తీసుకెళ్లి ఆయిల్‌ఫెడ్ ఎండీతో మాట్లాడిస్తానన్నారు. కార్మికుల కష్టార్జితం నుంచి మినహాయించుకున్న ప్రావిడెంట్‌ఫండ్(పీఎఫ్) సొమ్మును అణా పైసతో సహా తిరిగి ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. ఫ్యాక్టరీలో పనిచేస్తున్న తమ పీఎఫ్ సొమ్మును కాంట్రాక్టర్లు దోచుకున్నారని ఫ్యాక్టరీ మేనేజర్ చంద్రశేఖరరెడ్డికి కార్మికులు వారం రోజుల క్రితం ఫిర్యాదు చేశారు. తమకు ఫీఎఫ్ డబ్బు ఒక్కపైస కూడా అందలేని ఆరోపించారు. ఇదే విషయాన్ని కార్మికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. పీఎఫ్ కార్యాలయం నుంచి కార్మికులు సాధించిన కొన్ని కీలకపత్రాలను మేనేజర్ చంద్రశేఖరరెడ్డికి తాటి అందజేశారు. పీఎఫ్ సొమ్ము ఇప్పించాలని కోరారు. ఫోర్మన్ విల్సన్రాజుపై దాడి చేసిన పాతకాంట్రాక్టర్ కుమారుడు మధుపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఏడేళ్ల పీఎఫ్ చెల్లించాలి.. 2007లో అశ్వారావుపేటలో పామాయిల్ ఫ్యాక్టరీ ప్రారంభించినప్పటి నుంచి పనిచేసిన కార్మికులకు పీఎఫ్ సొమ్ము చెల్లించాలని కార్మికులు డిమాండ్ చేశారు. ఫోర్మన్ దాడిచేసిన దుండగులను అరెస్ట్ చేయాలని, విల్సన్రాజుపై బనాయించిన కేసును ఎత్తివేయాలని ని నాదాలు చేశారు. ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులను కాంట్రాక్టర్లు ఇచ్చినంత తీసుకుంటే ఉంచుతున్నారని, హక్కులపై ప్రశ్నిస్తే పనిలోనుంచి తీసేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాత కాంట్రాక్టర్ కుమారుడు మధుకు అనుకూలంగా ఉన్నవారే ఫ్యాక్టరీలో ఉద్యోగం చే యాలని, అతని మాట వినకున్నా, చెప్పిన ట్టు చేయకపోయినా, అధికారులను బదిలీ చేయిస్తాడని కార్మికులు ఆరోపిస్తున్నారు. ఇందులో భాగంగానే విల్సన్ రాజును రౌడీలతో కొట్టించాడని అన్నారు. కార్మికుల ప్రశ్నలకు ఏమీ సమాధానం చెప్పాలో తెలియక మేనేజర్ చంద్రశేఖర్‌రెడ్డి మౌనంగా ఉండిపోయారు. తిన్నదంతా కక్కిస్తా: ఎమ్మెల్యే తాటి కార్మికులు, విల్సన్‌రాజు సమస్యలను విన్న ఎమ్మెల్యే ఫ్యాక్టరీ మేనేజర్ చంద్రశేఖర్‌రెడ్డి, డివిజనల్ అధికారి రమేష్కుమార్రెడ్డిలపై ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రోజుకూలీ చేసుకునే వారిని మీ ఇష్టం వచ్చినట్లు దోచుకుంటూ పోతే ఊరుకునేదిలేదు. ఇంతకుముందు ఇక్కడ ఎవరున్నారో నాకు అనవసరం. ఈ ప్రజలు నన్ను నమ్మారు. నా ప్రజలను ఎవరు అన్యాయం చేసినా ఊరుకోను. కార్మికుల సొమ్ములు ఎవరెంత తిన్నారో అణాపైసాలతో సహా కక్కిస్తా.. కాంట్రాక్టర్లకు సహకరించిన అధికారులను వదిలిపెట్టేది లేదు. మీరు (మేనేజర్‌ను ఉద్దేశించి) ఎన్నిసార్లు సస్పెండ్ అయినా మళ్లీ అశ్వారావుపేటకే ఎందుకు వస్తున్నారు..? ఆయిల్‌ఫెడ్‌లో మీకు ఎక్కడా ఉద్యోగం లేదా..? దేశంలో ఎన్నో ప్రభుత్వ ఫ్యాక్టరీలు ఉండగా.. ఎప్పుడూ అశ్వారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీనే ఎందుకు వార్తల్లోకెక్కుతుంది..? మీరు ఇక్కడ ఎందుకోసం ఉంటున్నారో నాకు తెలుసు.. అంతా కక్కిస్తా.. మీ వైఖరి మార్చుకోకుంటే చాలా ఇబ్బంది పడతారు. ప్రతి నెల కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించేటపుడు పీఎఫ్ చెల్లింపును ఎందుకు పరిశీలిచడంలేదు. కార్మికులకు పీఎఫ్ సొమ్ము తిరిగి ఇప్పించేంత వరకు ఇక్కడే కూ ర్చుంటాను’ అంటూ తాటి ఫ్యాక్టరీ గేటు ఎదుట బైఠాయించారు. ఫ్యాక్టరీలో ఆయిల్ రికవరీని త క్కువగా చూపుతూ ప్రైవేటు కంపెనీలతో కు మ్మక్కై రైతులకు అన్యాయం చేస్తున్న సంగతి తన దృష్టికి వచ్చిందన్నారు. దీనిపై పూర్తిగా అధ్యయనం చేసి బాధ్యులపై చర్యలకు ప్రభుత్వాన్ని కోరతానన్నారు. రైతులు పండించే పామాయిల్ కు పూర్తి మద్దతు ధర సాధించడం తన లక్ష్యమన్నారు. హైదరాబాదులోని ప్రధాన కార్యాలయం నుంచి ఏ కార్మికునికి ఎంత పీఎఫ్ సొమ్ము అం దాలో లెక్కలతో సహా నెల రోజులలోపు వివరం గా తెలియజేస్తామని మేనేజర్ లిఖితపూర్వకంగా హామీ ఇవ్వడంతో ఎమ్మెల్యే ఆందోళన విరమించారు. ఈ ఆందోళనకు వైఎస్ఆర్సీపీ, టీడీపీ, టీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ కూడా అక్కడి వచ్చి కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. నారాయణ వెంట ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి సింగు నర్సింహరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి బాగం హేమంతరావు ఉన్నారు. సంఘీభావం తెలిపిన వారిలో జెడ్పీటీసీ అంకత మల్లికార్జునరావు, ఆయిల్‌ఫాం రైతు సంఘం రాష్ట్ర నాయకులు మలిరెడ్డి పూర్ణచంద్రారెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు జూపల్లి రమేష్‌బాబు, జూపల్లి ప్రమోద్, నండ్రు రమేష్‌బాబు, టీడీపీ నాయకులు ఆలపాటి రామ్మోహనరావు, బండి పుల్లారావు, సీపీఎం నాయకులు బుడితి చిరంజీవి నాయుడు, టీఆర్ఎస్ నాయకులు కోటగిరి సీతారామస్వామి, జూపల్లి కోదండ వెంకటరమణారావు, చంటిబాబు ఉన్నారు. -
పామాయిల్ ఫ్యాక్టరీలో అవినీతి ఊట..!
అశ్వారావుపేట, న్యూస్‌లైన్: అశ్వారావుపేటలోని పామాయిల్ ఫ్యాక్టరీలో కుంభకోణాలు ఒకటొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇక్కడ మంగళవారం ఓ ఆయిల్ ట్యాంకర్‌ను నిబంధనలకు విరుద్ధంగా తరలించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. దీనిపై ‘న్యూస్‌లైన్’ ఆరా తీయగా.. ఆ ట్యాంకర్ యజమాని, ఫ్యాక్టరీ మేనేజర్ నీళ్లు నమిలారు. ఈ ఫ్యాక్టరీ అవినీతి ఊటగా, కుంభకోణాలమయంగా మారిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వరంగానికి చెందిన ఈ ఫ్యాక్టరీలో జరుగుతున్న అవినీతి అక్రమాలతో పామాయిల్ రైతులు నష్టపోతుండగా.. అధికారులు బాగుపడుతున్నారు. పామాయిల్ గెలల కుంభకోణం.. ముడి చమురు కుంభకోణం.. గింజల కుంభకోణం.. కార్మికుల వేతనాలు, ఈపీఎఫ్ చెల్లింపుల్లో అక్రమాలు... ఇలా చెప్పుకుంటే పెద్ద జాబితానే అవుతుంది. ఇందులోని కొన్నింటి చిట్టా ఇది... 2011లో: ప్రవేటు కంపెనీల ఒత్తిడికి ఫ్యాక్టరీ అధికారులు తలొగ్గి, ఇక్కడ ఆయిల్ రివకరీని తక్కువగా చూపించేందుకు ప్రయత్నిం చారు. ఇందుకోసం, సుమారు 20వేల టన్నుల పామాయిల్ గెలలను కుళ్లబెట్టారు. ఫలితంగా, పరిశ్రమకు ప్రత్యక్షంగా 10కోట్ల రూపాయల నష్టం వచ్చింది. పరోక్షంగా రైతులకు ఇంతకంటే ఎక్కువ నష్టమే జరిగిం ది. దీనిపై ఎలాంటి విచారణ జరగనేలేదు. 2011 డిసెంబర్లో: రెండు లారీల (34 టన్నుల) ముడి చమురు చోరీ జరిగినట్టుగా అశ్వారావుపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇప్పటివరకు ఈ కేసు అతీగతీ లేదు. ఆయిల్‌ఫెడ్ ఉన్నతాధికారులు కూడా ఎలాంటి విచారణ చేపట్టలేదు. 2011 డిసెంబర్లో: 98 టన్నుల ముడి చమురు అధికంగా వచ్చినట్టుగా అధికారులు రికార్డుల్లో చూపించారు. అది ఎక్కడి నుంచి వచ్చిందో మాత్రం చూపలేకపోయారు. 2012లో: బ్రేక్ డౌన్ పేరుతో ఈ ఫ్యాక్టరీని అధికారులు పలుమార్లు మూసేసి, పామాయిల్ గెలలను ఇతర పరిశ్రమలకు తరలించారు. ఇలా ఈ ఒక్క సంవత్సరంలోనే ఫ్యాక్టరీకి రెండుకోట్ల రూపాయల వరకు నష్టపోయింది. ఓ కాంట్రాక్టర్‌కు లాభం చేకూర్చేందుకు అధికారులు కావాలనే ఇలా చేశారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. 2013లో: నూనె రికవరీ ఒక శాతం తగ్గింది. దీని ఫలితంగా సంస్థకు ప్రత్యక్షంగా ఏడాదికి రూ.2కోట్లు నష్టం. కేవలం అశ్వారావుపేట ఫ్యాక్టరీలోనే 2-3శాతం రివకరీ పడిపోయింది. ఇదే విషయాన్ని ఆయిల్‌ఫెడ్ ఉన్నతోద్యోగుల బందం దవీకరించింది. అయి నా అధికార యంత్రాంగం మేల్కొనలేదు. 2013లో: పరిశ్రమలో సుమారు 250 టన్నుల నూనె గింజలు మాయమైనట్టుగా ఇక్కడి అధికారులు గుర్తించి, ఉన్నతాధికారులకు నివేదించారు. ఈ వ్యవహారంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న అధికారులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేసి, ఆ తరువాత ఎత్తివేశారు. ఫ్యాక్టరీ సామర్థ్యం పెంచినప్పటికీ విద్యుత్ సరఫరాపై దృష్టి పెట్టకపోవడంతో డీజిల్ వినియోగం పెరిగింది. ఈ కారణంగా సంస్థపై సుమారు 50లక్షల రూపాయల భారం పడింది. కేవలం కమీషన్ల కోసమే విద్యుత్ సరఫరాను తగ్గించి, డీజిల్ వినియోగం పెరిగేలా ఇక్కడి అధికారులు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఉన్నతాధికారులు స్పందించలేదు. 1.5కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈటీపీ ప్లాంటును ఏడాదిన్నర తరువాత వినియోగంలోకి తెచ్చారు. ఆ తర్వాత కూడా ఇది కొంతకాలం మాత్రమే పనిచేసింది. ఫలితంగా, దీని కోసం వెచ్చించిన 1.5కోట్ల రూపాయలు దాదాపు వృధా అయినట్టే. దీనికి బాధ్యులైన వారిపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. గడిచిన నాలుగేళ్లలో ఈ ఫ్యాక్టరీలో సుమారు 20కోట్ల రూపాయల అవినీతి, అక్రమాలు జరిగి ఉంటాయని అంచనా. ప్రైవేటు కంపెనీల కనుసన్నల్లో అశ్వారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీ అధికారులు పనిచేస్తున్నారని, అక్రమాలకు పాల్పడుతున్నారని, అందినంత దండుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వీటిపై ఉన్నతాధికారులు స్పందించకపోవడంపై ఇక్కడి పామాయిల్ రైతుల్లో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. -
ఫ్లాప్ షో..!
అశ్వారావుపేట, న్యూస్‌లైన్: కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ జిల్లాలలో ‘ఇందిరమ్మ విజయ యాత్ర ’ సాగిస్తున్న రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు(వీహెచ్)కు అడుగడుగునా నిరాదరణే ఎదురవుతోంది. ఆయన యాత్ర (రోడ్ షో) ఆదివారం ‘ఫ్లాప్ షో’గా మారింది. ఆయన యాత్రను అశ్వారావుపేటలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. అడ్డుకుంటారన్న భయంతోరూట్ మార్పు.. ‘యాత్ర మా వద్దకు వస్తే అడ్డుకుంటా’మని పోలవరం ముంపు ప్రాంతాల్లోని కాంగ్రెస్ నాయకులే హెచ్చరించడంతో వీహెచ్ యాత్ర రూటు మారింది. భద్రాచలంలో యాత్ర ముగించుకున్న వీహెచ్.. ఆదివారం బూర్గంపాడు, కుక్కునూరు, వేలేరుపాడు మండలాలు పర్యటించి అశ్వారావుపేట మండలానికి చేరుకోవాల్సుంది. తెలంగాణ రాష్ట్ర ప్రకటన వెలువడినప్పటి నుంచి.. ముంపు గ్రామాలను తరలించొద్దన్న డిమాండుతో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో కుక్కునూరులో రిలే నిరాహార దీక్షలు సాగుతున్నాయి. వీహెచ్ యాత్రకు సహకరించాలన్న స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే విజ్ఞప్తి చేయగా.. కుక్కునూరు మండల కాంగ్రెస్ నాయకులు నిరాకరించారు. అంతేకాదు.. ‘వీహెచ్ యాత్ర ఇక్కడకు వస్తే అడ్డుకుంటాం’ అని తెగేసి చెప్పేశారు. ఈ పరిస్థితిలో, కుక్కునూరు మండలంలోకి యాత్ర వెళితే అభాసుపాలవుతామనే భయంతో వీహెచ్ యాత్రను అటుగా వెళ్లనీయలేదు. బూర్గంపాడు మండలం ఇబ్రహీంపేట దాటిన తర్వాత కుక్కునూరు మండలం బంజరగూడెం మీదుగా అశ్వారావుపేట నియోజకవర్గంలోకి యాత్ర ప్రవేశించాల్సుంది. యాత్రను స్వపక్షీయులే అడ్డుకుంటే పరువు పోతుందన్న భయంతో కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యే కలిసి రాత్రికి రాత్రే రూటు మార్చేశారు. స్పందన కరువు... వీహెచ్ రోడ్ షో(విజయ యాత్ర)కు జనం కరువుయ్యారు. శనివారం రాత్రి పాల్వంచలో బస చేసిన వీహెచ్.. ఆదివారం ముల్కలపల్లి మండలం పూసుగూడెం చేరుకున్నారు. అక్కడ ఆయన యాత్రకు జనం రాకపోవడంతో వాహనం ఆగలేదు. ముల్కలపల్లిలో గాంధీ, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలకు ఆయన పూలమమాలలు వేశారు. ఇక్కడ కూడా జనం లేకపోవడంతో ప్రసంగించకుండా వెళ్లిపోయారు. జగన్నాధపురం మీదుగా దమ్మపేట మండలంలోకి ఆయన యాత్ర ప్రవేశించింది. దమ్మపేట మండలంలోనూ కార్యకర్తలు, ప్రజలు పట్టుమని పదిమంది కూడా లేకపోవడంతో ఆయన మొహం చిన్నబోయింది. అక్కడి నుంచి అశ్వారావుపేటకు యాత్ర చేరుకుంది. వెలవెలబోయిన సభ.. వీహెచ్ యాత్రకు అశ్వారావుపేటలో ఏమాత్రం స్పందన కనిపించలేదు. నియోజకవర్గ కేంద్రమైన అశ్వారావుపేటలో ఆయన సభకు కనీసంగా 50మంది కూడా రాలేదు. ఇక్కడ జరిగిన సభలో కాంగ్రెస్ కార్యకర్తలు 30 మంది; మొత్తం పోలీసధికారులు, సిబ్బంది కలిసి 60మంది; 10 మంది మీడియా ప్రతినిధులు మాత్రమే ఉన్నారు. వాహనాన్ని అడ్డుకున్న కాంగ్రెస్ నాయకులు సభ అనంతరం, ముందుకు కదులుతున్న వీహెచ్ వాహనాన్ని, కాన్వాయ్‌ని స్థాని క కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. ‘పోలవరం ముంపు గ్రామాల తరలింపునకు వ్యతిరేకంగా ఏ ఒక్కరూ మాట్లాడ లేదు’ అని, వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోల వ రం ముంపు గ్రామాలను తెలంగాణలోనే ఉంచాలని డిమాండ్ చేశారు. ముంపు గ్రామాల ప్రజలకు న్యాయం చేయాలని సోనియాను కోరతానని వీహెచ్ చెప్పడంతో కాంగ్రెస్ వారు పక్కకు తప్పుకున్నారు.