అశ్వారావుపేట, న్యూస్‌లైన్: కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ జిల్లాలలో ‘ఇందిరమ్మ విజయ యాత్ర ’ సాగిస్తున్న రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు(వీహెచ్)కు అడుగడుగునా నిరాదరణే ఎదురవుతోంది. ఆయన యాత్ర (రోడ్ షో) ఆదివారం ‘ఫ్లాప్ షో’గా మారింది. ఆయన యాత్రను అశ్వారావుపేటలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు.
అడ్డుకుంటారన్న భయంతోరూట్ మార్పు..
‘యాత్ర మా వద్దకు వస్తే అడ్డుకుంటా’మని పోలవరం ముంపు ప్రాంతాల్లోని కాంగ్రెస్ నాయకులే హెచ్చరించడంతో వీహెచ్ యాత్ర రూటు మారింది. భద్రాచలంలో యాత్ర ముగించుకున్న వీహెచ్.. ఆదివారం బూర్గంపాడు, కుక్కునూరు, వేలేరుపాడు మండలాలు పర్యటించి అశ్వారావుపేట మండలానికి చేరుకోవాల్సుంది. తెలంగాణ రాష్ట్ర ప్రకటన వెలువడినప్పటి నుంచి.. ముంపు గ్రామాలను తరలించొద్దన్న డిమాండుతో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో కుక్కునూరులో రిలే నిరాహార దీక్షలు సాగుతున్నాయి.
వీహెచ్ యాత్రకు సహకరించాలన్న స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే విజ్ఞప్తి చేయగా.. కుక్కునూరు మండల కాంగ్రెస్ నాయకులు నిరాకరించారు. అంతేకాదు.. ‘వీహెచ్ యాత్ర ఇక్కడకు వస్తే అడ్డుకుంటాం’ అని తెగేసి చెప్పేశారు. ఈ పరిస్థితిలో, కుక్కునూరు మండలంలోకి యాత్ర వెళితే అభాసుపాలవుతామనే భయంతో వీహెచ్ యాత్రను అటుగా వెళ్లనీయలేదు. బూర్గంపాడు మండలం ఇబ్రహీంపేట దాటిన తర్వాత కుక్కునూరు మండలం బంజరగూడెం మీదుగా అశ్వారావుపేట నియోజకవర్గంలోకి యాత్ర ప్రవేశించాల్సుంది. యాత్రను స్వపక్షీయులే అడ్డుకుంటే పరువు పోతుందన్న భయంతో కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యే కలిసి రాత్రికి రాత్రే రూటు మార్చేశారు.
స్పందన కరువు...
వీహెచ్ రోడ్ షో(విజయ యాత్ర)కు జనం కరువుయ్యారు. శనివారం రాత్రి పాల్వంచలో బస చేసిన వీహెచ్.. ఆదివారం ముల్కలపల్లి మండలం పూసుగూడెం చేరుకున్నారు. అక్కడ ఆయన యాత్రకు జనం రాకపోవడంతో వాహనం ఆగలేదు. ముల్కలపల్లిలో గాంధీ, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలకు ఆయన పూలమమాలలు వేశారు. ఇక్కడ కూడా జనం లేకపోవడంతో ప్రసంగించకుండా వెళ్లిపోయారు. జగన్నాధపురం మీదుగా దమ్మపేట మండలంలోకి ఆయన యాత్ర ప్రవేశించింది. దమ్మపేట మండలంలోనూ కార్యకర్తలు, ప్రజలు పట్టుమని పదిమంది కూడా లేకపోవడంతో ఆయన మొహం చిన్నబోయింది. అక్కడి నుంచి అశ్వారావుపేటకు యాత్ర చేరుకుంది.
వెలవెలబోయిన సభ..
వీహెచ్ యాత్రకు అశ్వారావుపేటలో ఏమాత్రం స్పందన కనిపించలేదు. నియోజకవర్గ కేంద్రమైన అశ్వారావుపేటలో ఆయన సభకు కనీసంగా 50మంది కూడా రాలేదు. ఇక్కడ జరిగిన సభలో కాంగ్రెస్ కార్యకర్తలు 30 మంది; మొత్తం పోలీసధికారులు, సిబ్బంది కలిసి 60మంది; 10 మంది మీడియా ప్రతినిధులు మాత్రమే ఉన్నారు.
వాహనాన్ని అడ్డుకున్న కాంగ్రెస్ నాయకులు
సభ అనంతరం, ముందుకు కదులుతున్న వీహెచ్ వాహనాన్ని, కాన్వాయ్‌ని స్థాని క కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. ‘పోలవరం ముంపు గ్రామాల తరలింపునకు వ్యతిరేకంగా ఏ ఒక్కరూ మాట్లాడ లేదు’ అని, వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోల వ రం ముంపు గ్రామాలను తెలంగాణలోనే ఉంచాలని డిమాండ్ చేశారు. ముంపు గ్రామాల ప్రజలకు న్యాయం చేయాలని సోనియాను కోరతానని వీహెచ్ చెప్పడంతో కాంగ్రెస్ వారు పక్కకు తప్పుకున్నారు.
ఫ్లాప్ షో..!
Published Mon, Mar 3 2014 3:06 AM | Last Updated on Sat, Sep 2 2017 4:16 AM
Advertisement
Advertisement