తెలంగాణ తీర్మానం ఓడిపోతుంది:వీ.హెచ్
ఢిల్లీ: అసెంబ్లీకి తెలంగాణ విభజన తీర్మానం వస్తే ఓడిపోతుందని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు అభిప్రాయపడ్డారు. కాగా, పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందుతుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో పరిధిలో మెజారిటీ ఎమ్మెల్యేలు సీమాంధ్ర ప్రాంతంలోనే ఉన్నారని తెలిపారు. తెలంగాణాలో 119 మంది ఎమ్మెల్యేలు ఉంటే, సీమాంధ్రలో 170 మందికి పైగా ఎమ్మెల్యేలున్నారన్నారు. ఒకవేళ తీర్మానం అసెంబ్లీకి వస్తే ఓడిపోవడం ఖాయమని తనదైన శైలిలో తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ , బీజేపీలు అనుకూలంగా ఉన్నందున పార్లమెంట్ టీ.బిల్లు తప్పక ఆమోదం పొందుతుందన్నారు.
సీమాంధ్ర ప్రజా ప్రతినిధులకు టీ.తీర్మానాన్ని ఓడించడం అసెంబ్లీలో సాధ్యపడే అంశమేనన్నారు. కాగా, రాష్ట్ర ఏర్పాటు అనేది అసెంబ్లీ ప్రాతిపదికన జరుగుతుందని తాను అనుకోవడం లేదని వీ.హెచ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం అనేది కాంగ్రెస్ వల్లే సాధ్యమైందన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలని టీఆర్ఎస్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ 15 ఎంపీ సీట్లను గెలుచుకుంటుందని వీ.హెచ్ ధీమా వ్యక్తం చేశారు.