మతాతీత సమాజంతో మానవత్వ వికాసం
మతాతీత సమాజంతో మానవత్వ వికాసం సాధ్యమవుతుందని సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షుడు జంధ్యాల రఘుబాబు అన్నారు. స్థానిక పింగళి సూరన తెలుగు తోట ప్రాంగణంలో మత కౌగిలి పుస్తకావిష్కరణ సభలో ఆయన మాట్లాడారు.
– జంధ్యాల రఘుబాబు
కర్నూలు (కల్చరల్): మతాతీత సమాజంతో మానవత్వ వికాసం సాధ్యమవుతుందని సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షుడు జంధ్యాల రఘుబాబు అన్నారు. స్థానిక పింగళి సూరన తెలుగు తోట ప్రాంగణంలో మత కౌగిలి పుస్తకావిష్కరణ సభలో ఆయన మాట్లాడారు. కర్నూలు జిల్లా వేంపెంట వాస్తవ్యులైన రచయిత నెమలి చంద్రశేఖర్.. మతాల వెనుక దాగి ఉన్న మతలబులను తెలియజేస్తూ చక్కని కవితా సంకలనాన్ని తీసుకొచ్చారన్నారు. సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో హేతువాద సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ..రాబోవు తరాల్లో హేతువాద శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చవలసిన ఆవశ్యకత ఉందన్నారు. మత కౌగిలి పుస్తకాన్ని ప్రముఖ రచయిత ఉద్దండం చంద్రశేఖర్ సమీక్షించారు. మతం రాజకీయాలకు అతీతంగా ఉండాల్సిన అవసరం ఉందని విరసం రచయిత పాణి అన్నారు. పాలకులు..మతాన్ని రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకుంటున్నారని ప్రముఖ కథా రచయిత ఇనాయతుల్లా ఆరోపించారు. పుస్తక రచయిత నెమలి చంద్రశేఖర్, ప్రముఖ కథారయిత వెంకటకృష్ణ, అభ్యుదయ రచయితల సంఘం జిల్లా నాయకులు డాక్టర్ మండ్ల జయరామ్, సాహితీ స్రవంతి జిల్లా కార్యదర్శి కెంగార మోహన్, గాయకుడు, ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షుడు బసవరాజు తదితరులు పాల్గొన్నారు.