
కుక్కలను కుప్పం పంపండి...: విష్ణుకుమార్‌రాజు
సీతమ్మధార (విశాఖపట్నం): ‘రాష్ట్ర వ్యాప్తంగా 3.47 లక్షల కుక్కలుంటే ఒక్క విశాఖపట్నంలోనే 1.39 లక్షల కుక్కలున్నాయి. నా ఇంటిచుట్టూ వందల కుక్కలు నిత్యం తిరుగుతుంటాయి. కుక్కల బారినపడి వందలాది మంది రోజూ గాయపడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సొంతూరు కుప్పం, మంత్రి నారాయణ సొంతూరు నెల్లూరుకు ఇక్కడి కుక్కలను పంపిస్తే వారికి ఈ బాధ ఎలా ఉంటుందో తెలుస్తుంది’ అని బీజేపీ శాసనసభాపక్ష నేత, విశాఖ నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు వ్యాఖ్యానించారు. శనివారం ఆయన తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ... స్మార్ట్‌సిటీగా ఎంపికైన విశాఖలో కుక్కల సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించినప్పటికీ ప్రభుత్వంలో చలనం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కుక్కల బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య విశాఖలోనే ఎక్కువగా ఉందన్నారు. ఈ బాధ చంద్రబాబుకు తెలియాలంటే ఇక్కడి కుక్కలను కుప్పం పంపాలన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కుక్కలను చంపడానికి వీల్లేదంటున్న వారే రోజూ లక్షలాది ఆవులు, మేకలు, గొర్రెలు, కోళ్లను చంపి తింటున్నారని, ఇవి మూగ జీవాలు కావా? వీటికో న్యాయం.. కుక్కలకో న్యాయమా? అని ప్రశ్నించారు. కుక్కలను చంపరాదన్న సుప్రీం తీర్పుపై ప్రభుత్వం అప్పీల్‌కు వెళ్లాలని సూచించారు.