రోడ్డెక్కిన ‘పండుటాకులు’
రోడ్డెక్కిన ‘పండుటాకులు’
Published Mon, Dec 5 2016 11:33 PM | Last Updated on Mon, Sep 4 2017 9:59 PM
- గూడూరులో 3 గంటల పాటు రాస్తారోకో
- బ్యాంక్‌లో నగదు లేకపోవడంతో వృద్ధుల ఆందోళన
గూడూరు: పింఛన్ డబ్బుల కోసం వృద్ధులు.. సోమవారం గూడూరులో రోడ్డెక్కారు. తమకు వెంటనే పింఛన్ అందించాలంటూ మూడు గంటలపాటు రాస్తారోకో చేశారు. సామాజిక భద్రత (ఎన్టీఆర్ భరోసా ) పింఛన్లు..ఈ నెల 1 నుంచి బ్యాంక్‌లలో తీసుకునేలా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే బ్యాంక్‌లలో తగినంత డబ్బులు లేకపోవడంతో రెండు, మూడు రోజుల నుంచి వృద్ధులు, వికలాంగులు, వితంతువులు పడిగాపులు కాస్తున్నారు. సోమవారం వందలాది మంది పింఛన్‌దారులు స్థానిక ఎస్‌బీఐకి రావడంతో గందరగోళం ఏర్పడింది. పోలీసులకు అదుపు చేయడం కష్టంగా మారింది. ఇటువంటి పరిస్థితులలో విధులు నిర్వర్తించలేమంటూ సిబ్బంది బ్యాంక్‌ను మూసేసారు. దాదాపు గంట సేపు వేచి చూసినా బ్యాంక్‌ను తెరవకపోవడంతో పింఛన్‌దారులు, ఖాతాదారులు ప్ర«ధాన రహదారిపై బైఠాయించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. బ్యాంక్ సిబ్బందికి, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విషయం తెలిసి.. ఎస్‌ఐ పీరయ్య సంఘటనా ప్రాంతానికి చేరుకొని ఆందోళనకారులకు నచ్చజెప్పినా వినలేదు. దీంతో బ్రాంచి మేనేజర్ ప్రదీప్‌కుమార్‌తో ఎస్‌ఐ చర్చలు జరిపి..నగదు ఇచ్చేందుకు ఒప్పించడంతో ఆందోళనను విరమించారు. అయితే రెగ్యులర్ ఖాతాదారులు తమ ఆందోళనను మరోగంట సేపు కొనసాగించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. పోలీసులు సర్దిచెప్నపగా.. ఆందోళన విరమించారు.
Advertisement
Advertisement