‘డబుల్‌’ ట్రబుల్‌పై సీఎం సీరియస్‌ ! | Serious delay in construction of houses | Sakshi
Sakshi News home page

‘డబుల్‌’ ట్రబుల్‌పై సీఎం సీరియస్‌ !

Published Tue, Jun 6 2017 10:37 PM | Last Updated on Sat, Sep 29 2018 4:44 PM

‘డబుల్‌’ ట్రబుల్‌పై సీఎం సీరియస్‌ ! - Sakshi

‘డబుల్‌’ ట్రబుల్‌పై సీఎం సీరియస్‌ !

► మంత్రులు, ఎమ్మెల్యేలకు బాధ్యత..
► సమీక్షలు దాటని ప్రగతి
► రెండు విడతల్లో 22,447 ఇళ్లు మంజూరు
► ఉమ్మడి జిల్లాలో పూర్తయినవి 229.. 
► చిన్న ముల్కనూరు మినహా ఎక్కడా ప్రగతి లేదు
► 3,365 ఇళ్ల నిర్మాణానికి టెండర్లు ఖరారు
► 6,445కు టెండర్లు పిలిచిన అధికారులు
► డిసెంబర్‌ నాటికి పూర్తి కావాలని సీఎం ఆదేశం


రెండు పడక గదుల (డబుల్‌ బెడ్‌రూమ్‌) ఇళ్ల నిర్మాణంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా రెండేళ్లుగా దసరా, సంక్రాంతి పండుగలకు మంత్రులు, ఎమ్మెల్యేలు భూమి పూజ చేసినా.. లబ్ధి దారులు, స్థలాల ఎంపిక ఇప్పటికీ నోచుకోలేదు. పలుమార్లు టెం డర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో ఈ పథకం ముందుకు సాగడం లేదు. ప్రభుత్వం ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని 13 నియోజకవర్గాలకు రెండు విడతల్లో 22,447 ఇళ్లను మంజూ రు చేయగా.. ఇందుకోసం సుమారు రూ.1,367 కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉంది.

అయితే.. క్షేత్రస్థాయిలో సమస్యలతో ఈ పథకం అనుకున్నంత వేగంగా సాగడం లేదు. దీంతో ఇటీవల సమీక్ష సమావేశం నిర్వహించిన సీఎం కేసీఆర్‌ ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని సూచించారు. ఇందులో భా గంగానే జిల్లాల వారీగా రెండు పడక గదుల ఇళ్లపై ఆ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇటీవల ఆయన ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా ప్రజాప్రతి   నిధులతో కరీంనగర్‌ కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు.

సాక్షి, కరీంనగర్‌: రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం కోసం అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ప్రభుత్వం మంజూరు ఇచ్చింది. 2015 సెప్టెంబర్‌ 26న 2015–16 సంవత్సరానికి గాను 60,000, 2016–17కు గాను గతేడాది ఏప్రిల్‌ 26న రెండు లక్షల ఇళ్లకు మంజూరు ఇచ్చారు. జీహెచ్‌ఎంసీ మినహా 95 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక్కో నియోజకవర్గానికి 1,400 చొప్పున కేటాయించారు. సిరిసిల్ల చేనేత కార్మికులు, సీఎం దత్తత గ్రామాలకు ప్రత్యేకంగా ఇచ్చిన ఇళ్ల కోటా కూడా ఇందులో ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు, కనీస వసతులకు కలిపి ఒక్కో దానికి రూ.6.29 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.6.05 లక్షలు, జీహెచ్‌ఎంసీలో జీప్లస్‌త్రీకి రూ.7.75 లక్షలు, సీప్లస్‌ఎస్‌ప్లస్‌నైన్‌కి రూ.8.65 లక్షల చొప్పున కేటాయించారు.

కాగా.. అధికారులు వెల్లడించిన గణాంకాల ప్రకారం మే 25 నాటికి మొత్తం ఉమ్మడి జిల్లాలో మంజూరైన ఇళ్లు (రెండు విడతలు) 22,447 కాగా, 6,445 ఇళ్లకు టెండర్లు పిలిచారు. 3,365కి టెండర్లు ఖరారు కాగా, 2,445 నిర్మాణం పనులు మొదలయ్యాయి. అయితే.. సీఎం కేసీఆర్‌ దత్తత గ్రామం చిన్న ముల్కనూరులో 229 ఇళ్లు మాత్రమే పూర్తి కాగా, మరెక్కడా పురోగతి లేదు. ఇప్పటికే పూర్తయిన 229 రెండు పడకల ఇళ్లకు రూ.14.40 కోట్లు ఖర్చు కాగా, త్వరితగతిన మిగతా వాటిని పూర్తిచేయాలని సీఎం తాజాగా ఆదేశించడం అధికార నేతల్లో చర్చనీయాంశమైంది.

మంత్రులు, ఎమ్మెల్యేలపైనే బాధ్యత.. కాంట్రాక్టర్లను చూసే బాధ్యత వారికే..
హైదరాబాద్‌తోపాటు సిద్దిపేట జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ దత్తత గ్రామం ఎర్రపల్లి తదితర గ్రామాల్లో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలు సకాలంలో పూర్తయ్యాయి. నాలుగైదు మాసాల క్రితం మేళతాళాలతో అట్టహాసంగా సీఎం కేసీఆర్, మంత్రుల సారథ్యంలో సామూహిక గృహ ప్రవేశాలు కూడా జరిగాయి. కరీంనగర్‌ జిల్లాలో కూడా సీఎం దత్తత గ్రామమైన చిగురుమామిడి మండలం చిన్న ముల్కనూరు మినహా ఎక్కడా పునాదిరాయి పడలేదు. కొన్నిచోట్ల శంకుస్థాపన చేసినా.. నిర్మాణాలు మొదలవ్వ లేదు. చిన్న ముల్కనూరులోనూ 247 ఇళ్లు మంజూరు కాగా, 229 పూర్తయ్యాయి.

సీఎం దత్తత గ్రామాల్లో సాగుతున్న నిర్మాణాలను స్ఫూర్తిగా తీసుకుని మంత్రులు, ఎమ్మెల్యేలు కాంట్రాక్టర్లను చూసి నిర్మాణం చేపట్టాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించినట్లు సమాచారం. వ్యవసాయ సీజన్‌లో ఎరువులు, విత్తనాల దుకాణాల నిర్వాహకులు రైతులకు ‘ఫలానా కంపెనీకి ఎరువులు కొంటేనే విత్తనాలు ఇస్తాం.. ఫలాన కంపెనీ క్రిమి సంహారక మందు కొంటేనే మీరు కోరిన ఎరువులు,     విత్తనాలు ఇస్తాం’ అని లింకులు పెట్టినట్లు.. ప్రభుత్వం కూడా ఆయా జిల్లాల్లో ఎక్కువ మొత్తంలో పనులు చేస్తున్న కాంట్రాక్టర్లకు     ‘డబుల్‌ బెడ్‌రూమ్‌’ నిర్మాణాలు తప్పనిసరి అని పెడితేనే అంతటా పేదోడి సొంతింటి కల నెరవేరుతుందన్న చర్చ కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే డబుల్‌ బెడ్‌రూమ్‌ కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం ఆదేశం అనివార్యంగా మారింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement