జిల్లాలో ఎస్‌జీఎఫ్‌ సంబరాలు | sgf games celebrations | Sakshi
Sakshi News home page

జిల్లాలో ఎస్‌జీఎఫ్‌ సంబరాలు

Published Tue, Aug 30 2016 11:37 PM | Last Updated on Mon, Oct 8 2018 5:07 PM

జాతీయస్థాయి వాలీబాల్‌ టోర్నీలో ఆడుతున్న క్రీడాకారులు - Sakshi

జాతీయస్థాయి వాలీబాల్‌ టోర్నీలో ఆడుతున్న క్రీడాకారులు

  •  62వ స్కూల్‌గేమ్స్‌ జిల్లాస్థాయి సెలక్షన్స్‌ ప్రారంభం 
  •  ఈసారి జిల్లాకు రెండు రాష్ట్రస్థాయి టోర్నీల కేటాయింపు 
  •  అక్టోబర్‌లో జాతీయస్థాయి నెట్‌బాల్‌ టోర్నీకి వేదికకానున్న పాలమూరు 
  • మహబూబ్‌నగర్‌ క్రీడలు: జిల్లాలో 62వ స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ సంబరాలు ప్రారంభమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం పాఠశాలస్థాయిలో క్రీడాభివృద్ధికి 62ఏళ్ల నుంచి స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ పథకాన్ని అమలు  చేస్తోంది. ఈ పథకం కింద తాలూకా, జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి వరకు  క్రీడాకారులను ప్రోత్సహిస్తుంది. అందులో భాగంగా జిల్లాస్థాయి ఎంపికలు ప్రారంభమయ్యాయి. సోమవారం జిల్లాస్థాయి నెట్‌బాల్‌ సెలక్షన్స్‌ నిర్వహించారు. ప్రతి క్రీడాంశానికి సంబంధించి జిల్లాస్థాయిలో సెలక్షన్స్‌ నిర్వహించి అందులో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులతో జిల్లా జట్టుకు ఎంపిక చేస్తారు. జిల్లా జట్లు వచ్చేనెల నుంచి నుంచి జనవరి వరకు తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో జరిగే అంతర్‌జిలాల్ల ఎస్‌జీఎఫ్‌ టోర్నీల్లో పాల్గొంటాయి. అనంతరం జాతీయస్థాయి టోర్నీల్లో రాష్ట్ర జట్లు పాల్గొంటాయి. ఈ ఏడాది జిల్లాకు అండర్‌–14 నెట్‌బాల్, అండర్‌–17 వాలీబాల్‌ రాష్ట్రస్థాయి టోర్నీలను కేటాయించారు. అక్టోబర్‌ మొదటివారంలో జిల్లా కేంద్రం అండర్‌–14 జాతీయస్థాయి నెట్‌బాల్‌ టోర్నీకి వేదిక కానుంది. జిల్లాకేంద్రంలో ఈ ఏడాది జనవరిలో అండర్‌–14 ఎస్‌జీఎఫ్‌ జాతీయస్థాయి వాలీబాల్‌ టోర్నీని విజయవంతంగా నిర్వహించారు.
     
    2 నుంచి ఎంపికలు 
    స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో సెప్టెంబర్‌ 2 నుంచి జిల్లాస్థాయి క్రీడా ఎంపికలు నిర్వహిస్తున్నట్లు ఎస్‌జీఎఫ్‌ కార్యనిర్వాహక కార్యదర్శి సురేశ్‌కుమార్‌ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. అండర్‌–14 బాల, బాలికల ఫుట్‌బాల్‌ ఎంపికలు 2న బాదేపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌లో, అండర్‌–17 ఖోఖో ఎంపికలు 3న జిల్లా స్టేడియం (మహబూబ్‌నగర్‌), అండర్‌–14, అండర్‌–17 తైక్వాండో 4న గద్వాల, అండర్‌–14, అండర్‌–17 చెస్‌ లిటిల్‌స్కాలర్స్‌ (మహబూబ్‌నగర్‌) నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎంపికలకు ప్రతి పాఠశాల నుంచి ముగ్గురు విద్యార్థులు మాత్రమే హాజరుకావాలని ఆయన కోరారు. 
     
    గతేడాది మంచి ఫలితాలు
    2015లో రాష్ట్రస్థాయి ఎస్‌జీఎఫ్‌ టోర్నీల్లో జిల్లా జట్టు మెరుగైన ఫలితాలు సాధించాయి. అండర్‌–14 రాష్ట్రస్థాయి హాకీలో జిల్లా బాల, బాలికల జట్లు విజేతగా నిలిచాయి. రాష్ట్రస్థాయి యోగాలో జిల్లా క్రీడాకారులు ఓవరాల్‌ చాంపియన్‌షిప్‌ సాధించాయి. అండర్‌–17 క్రికెట్‌ జిల్లా జట్టు ద్వితీయ స్థానంలో నిలిచింది.
     
    ఎస్‌జీఎఫ్‌లో నిర్వహించే క్రీడలు..
    అండర్‌–17, 14 (బాలురు, బాలికలు) అథ్లెటిక్స్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, ఫుట్‌బాల్, హ్యాండ్‌బాల్, బాస్కెట్‌బాల్, క్రికెట్, త్రోబాల్, చెస్, బ్యాడ్మింటన్, బాక్సింగ్, తైక్వాండ్, సాఫ్ట్‌బాల్, ఆర్చరీ, స్విమ్మింగ్, టెన్నిస్, యోగా, నెట్‌బాల్, టేబుల్‌ టెన్నిస్, జూడో, రెజ్లింగ్, ఫెన్సింగ్‌ 
     
    ఎస్‌జీఎఫ్‌ కోసం అన్ని ఏర్పాట్లు
    ఎస్‌జీఎఫ్‌ క్రీడల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశాం. జిల్లాస్థాయి సెలక్షన్స్‌ నిర్వహించి ప్రతిభ క్రీడాకారులను రాష్ట్ర టోర్నీలకు పంపుతాం. మూడోసారి జిల్లాకు జాతీయస్థాయి ఎస్‌జీఎఫ్‌ టోర్నీ కేటాయించడం సంతోషంగా ఉంది. నెట్‌బాల్‌ జాతీయ టోర్నీని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తాం. 
    –సురేశ్‌కుమార్, ఎస్‌జీఎఫ్‌ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి
     
     
     
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement