ఉసురు తీసిన అవమానభారం
ఉసురు తీసిన అవమానభారం
Published Mon, May 8 2017 10:56 PM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM
ఇద్దరు పిల్లల గొంతు నులిమి తండ్రి ఆత్మహత్య
- భార్య మరో వ్యక్తితో వెళ్లిపోవడమే కారణం
– కర్నూలు మండలం శివరామపురంలో ఘటన
కర్నూలు సీక్యాంప్: భార్య వివాహేతర సంబంధం ముగ్గురి ఉసురు తీసింది. పల్లెటూరు కావడంతో తలా ఒక మాట అనడాన్ని అవమానంగా భావించిన ఓ వ్యక్తి తన ఇద్దరు పిల్లల గొంతు నులిమి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జిల్లా కేంద్రం కర్నూలుకు శివారులోని శివరామపురం గ్రామంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. తాలూకా సీఐ మహేశ్వరరెడ్డి, బంధువులు తెలిపిన వివరాలివీ.. గ్రామానికి చెందిన వికలాంగుడు చాకలి మహేష్(32) స్థానికంగా కులవృత్తి చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి భార్య లక్ష్మి(26), కుమార్తె హారిక(5), కుమారుడు ఆకాష్(4) సంతానం. మహేష్ తండ్రి నడిపెన్న(60), తల్లి పాపమ్మ(52) ఇతని వద్దే ఉంటున్నారు. ఎనిమిది నెలల క్రితం లక్ష్మి అదే గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుని వెళ్లిపోయింది.
ఇద్దరు పిల్లలు ఉన్నారనే ఆలోచన లేకుండా భార్య వెళ్లిపోవడం.. స్థానికుల సూటిపోటి మాటలతో మహేష్ ఇంటికే పరిమితమయ్యాడు. చివరకు చావే శరణ్యంగా భావించాడు. అయితే తను చనిపోతే పిల్లలను ఎవరు చూసుకుంటారనే భావనతో ముందుగా ఇద్దరు పిల్లలను గొంతు నులిమి చంపేవాడు. ఆ తర్వాత ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాలూకా సీఐ మహేశ్వరరెడ్డి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకున్నారు.
Advertisement