
‘ఓటుకు నోటు కేసులో బాబుకు జైలు తప్పదు’
సోమందేపల్లి : తెలంగాణ రాష్ట్రంలో గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు రూ.ఐదు కోట్లు ఎరచూపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యక్షంగా దొరికిపోయాడని, భవిష్యత్తులో జైలుకెళ్లడం ఖాయమని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ పేర్కొన్నారు. సోమందేపల్లిలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజా సమస్యల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో రాజీలేని పోరాటం చేస్తున్న జగన్‌మోహన్‌రెడ్డిపై బురద జల్లేలా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న బాబు విమర్శించడం తగదన్నారు.
ఓటుకునోటు కేసులో బయట పడటానికి ప్రధాని నరేంద్రమోడీ, వెంకయ్యనాయుడు కాళ్లు పట్టుకుని ప్రత్యేకహోదాను తాకట్టుపెట్టారన్నారు. అలాగే కేసీఆర్‌తో ఒప్పందాలు కుదుర్చుకుని రాజధానిపేరుతో విజయవాడ, అమరావతికు పారిపోయి వచ్చిన విషయం రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు. 18 కేసుల్లో స్టే తెచ్చుకున్న ఆయన జగన్‌మోహన్‌రెడ్డి జైలుకు వెళతారని తన మంత్రులు ఎమ్మెల్యేలతో ఉదరగొట్టడం గురువిందసామెతను గుర్తుకు తెస్తోందన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ వెంకటరత్నం, తుంగోడు సర్పంచ్ నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.