అడిగేవారు లేరని..
►బస్టాండ్‌లో ప్రయాణికుల దోపిడీ
► వస్తువులను అధిక ధరలకు అమ్ముతున్న షాపుల యజమానులు
►అటకెక్కించిన ఎంఆర్‌పీ విక్రయ నిబంధన
► చూసీచూడనట్లు వెళ్తున్న ఆర్టీసీ అధికారులు
► రాత పూర్వకంగా ఫిర్యాదు చేస్తేనే చర్యలు
► నిద్రిస్తున్న తూనికలు, కొలత శాఖ అధికారులు
కర్నూలు(రాజ్‌విహార్): జిల్లాలో 12డిపోల్లో 430 షాపులుండగా కర్నూలు బస్‌స్టేషన్‌లో 80, ఆరుబయట మరో 130 షాపులున్నాయి. ఐదేళ్లకోసారి తిరిగి టెండర్లు పిలుస్తారు. ఒకసారి టెండరు ఖరారు అయితే మూడేళ్ల వరకు ఒక అద్దె ఉంటుంది. నాలుగో సంవత్సరం 10శాతం పెంచుతారు. చివరి సంవత్సరం నాలుగో ఏడు చెల్లించిన నెలవారి అద్దెపై 15శాతం అదనంగా వసూలు చేస్తారు. జిల్లాలోని షాపుల నుంచి నెలకు రూ.50 లక్షల వరకు ఆదాయం వస్తోంది.
దోపిడీ ఇలా..
బస్టాండ్లలోని షాపుల్లో వస్తువులు, తినుబండరాలను నిబంధనల ప్రకారం ఎంఆర్‌పీ (మాగ్జిమమ్ రిటైల్ ప్రైస్)కే అమ్మాలి. షాపులు దక్కించుకున్న యజమానులకు ఇచ్చే అగ్రిమెంట్లలో ఈవిషయాన్ని ప్రస్తావిస్తారు. అయితే, ఈ నిబంధన అమలు కావడం లేదు. రూ.10 ఎంఆర్‌పీ ఉన్న వస్తువును రూ.15కి అమ్ముతున్నారు. తినుబండరాలు, కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్ సైతం ఇదే తరహాలో విక్రయిస్తున్నారు. రూ.20 ఉన్న నీళ్ల బాటిల్‌ను రూ.25కి అమ్ముతున్నారని నంద్యాలకు చెందిన ప్రయాణికులు శ్రీకాంత్ వాపోయాడు. దీనిపై ప్రశ్నిస్తే ‘ఇది బస్టాండ్, మాకు బాడుగ ఎక్కువగా ఉంటుంది. ఎలా అమ్ముకోవాలి’ అంటు సమాధానం చెబుతున్నారని తెలిపారు.
ప్రదర్శనల వరకే ధరల పట్టిక:
షాపుల్లో అమ్మే వస్తువుల పేర్లు, వాటి ఎంఆర్‌పీ పట్టికను ప్రయాణికులకు కనిపించేలా పెట్టాలి. అందులో చూపిన ధరలనే అమ్మాలి. కానీ ఒకటి రెండు షాపుల వద్ద తప్ప ధరల పట్టిక ఎక్కడా కన్పించదు. పట్టిక ప్రదర్శనకు పెట్టిన వాళ్లు సైతం దీనిని అమలు చేయకపోవడం గమనార్హం.
చర్యలు ఇలా..
ఎంఆర్‌పీ విస్మరిస్తే మూడంచెల తరహాలో చర్యలు తీసుకుంటారు. మొదటి సారి రూ.500, రెండో సారి రూ.1000 జరిమాన విధిస్తారు. మూడో సారి కూడా ఆదే షాపుపై కేసు నమోద అయితే షోకాజ్ నోటీసు ఇచ్చి షాపు టెంటరు లైసెన్స్ రద్దు చేస్తారు. ఇప్పటి వరకు కేవలం పాతికలోపే కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
శ్రీబాలాజీలో రాత్రిపూట అధిక ధరలు
కొత్త బస్టాండ్‌లోని శ్రీ బాలాజీ క్యాంటీన్ చీకటి వ్యాపారానికి తెర లేపిందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. రాత్రయితే చాలు ధరలు మరిపోతున్నాయని, పగలు ఉన్న ధరలను పెంచి రాత్రి వేళల్లో అధిక రేట్ల తినుబండరాలు, టీ, కాఫీ, కూల్ డ్రింక్స్ తదితర పానియాలను అమ్మి సొమ్ము చేసుకుంటున్నట్లు పేర్కొంటున్నారు. వీటిపై గతంలో ఆర్టీసీ అధికారులకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేనట్లు తెలుస్తోంది. ఈ విషయంలో వారిపై విమర్శలు వినిపిస్తున్నాయి.
పట్టించుకోని తూనికలు, కొలతల శాఖ
బస్టాండ్లలో ప్రయాణికులు దోపిడీకి గురవుతుంటే తూనికలు, కొలతల శాఖ అధికారులు నిద్ర మత్తులో ఉన్నారు. ఎప్పుడో ఓసారి దాడులు నిర్వహించి వదిలేస్తున్నారు. కర్నూలు బస్‌స్టేషన్ నుంచి ప్రతీరోజు దాదాపు 50వేల మందికి పైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. వీరి నుంచి రూ.లక్షల దోచుకుంటున్నా పట్టించుకునే నాథుడు కరువయ్యారు.
ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు
కొత్త బస్టాండ్‌లోని బాలాజీ క్యాంటీన్‌లో వస్తువులను ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు. పగలు ఒక రేటు, రాత్రి వేళల్లో ఒక రేటు పెట్టి తినిబండరాలు విక్రయిస్తున్నారు. రాత్రి వేళల్లో ఎంఆర్‌పీ కంటే రూ.2 నుంచి రూ.5వరకు అధికంగా అమ్ముతున్నారని ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. - ఎం. గోవిందు, పాతబస్తీ
ఫిర్యాదు చేస్తే చర్యలు:
బస్టాండ్లలో అధిక ధరలకు వస్తువులు అమ్మరాదు. ఎమ్మార్పీకే విక్రయించాలి. ఎక్కువ ధరలకు విక్రయిస్తే ప్రయాణికులు కంట్రోలర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చు. రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. -శ్రీనివాసులు, డీసీటీఎం