
ప్రజలకు సత్వర న్యాయం అందాలి
సాక్షి, హైదరాబాద్: ప్రజలందరికీ కూడూ, గూడూ, గుడ్డతోపాటు సత్వర న్యాయం అందినప్పుడే భారత రాజ్యాంగ లక్ష్యం నెరవేరుతుందని ఉమ్మడి రాష్ట్రాల లోకాయుక్త జస్టిస్ బి.సుభాషణ్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా లోకాయుక్త కార్యాలయం ఆవరణలో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం ఆయన ప్రసంగించారు. జనాభాకు తగ్గట్టుగా న్యాయస్థానాల్లో న్యాయమూర్తులు లేకపోవడంతో ప్రజలకు సత్వర న్యాయం అందడం లేదన్నారు. లోకాయుక్తగా తాను బాధ్యతలు చేపట్టిన తర్వాత కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. ఈ నాలుగేళ్ల కాలంలో దాదాపు 20 వేల కేసులు దాఖలయ్యాయని, ఇందులో మెజారిటీ కేసులను పరిష్కరించామని అన్నారు. ప్రజలకు ఉపశమనం లభిస్తుండడంతోనే ఎక్కువ సంఖ్యలో న్యాయం కోసం లోకాయుక్తను ఆశ్రయిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపలోకాయుక్త టి.గంగిరెడ్డి, రిజిస్ట్రార్ జగన్నాథరెడ్డి, డైరెక్టర్ (దర్యాప్తు) నరసింహారెడ్డి, డైరెక్టర్ (లీగల్) నవమోహనరావు, అధికారులు శేఖర్‌రెడ్డి, అమరేందర్‌రెడ్డి, తాజుద్దీన్, సోమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆరోగ్యశ్రీ గొప్ప పథకం
ఆరోగ్యశ్రీ పథకం పేద ప్రజలకు గొప్ప వరమని, కార్పొరేట్ ఆసుపత్రులవైపు కన్నెత్తిæకూడా చూడలేని నిరుపేదలు ఆ ఆసుపత్రుల్లో దర్జాగా వైద్యం పొందుతున్నారని జస్టిస్ సుభాషణ్‌రెడ్డి పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ లాంటి ఎన్నో సంక్షేమ పథకాలు పేదలకు మేలు చేస్తున్నాయని అన్నారు. భూసేకరణ కోసం కేంద్ర ప్రభుత్వం 2013లో తెచ్చిన చట్టం అమలులో ఉన్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం భూసేకరణ కోసం ఇటీవల మరో చట్టం తెచ్చిందని, ఉమ్మడి జాబితాలోని అంశాల్లో రాష్ట్రాలు కూడా చట్టాలు చేసుకునే వెసులుబాటు రాజ్యాంగం కల్పించిందని, అయితే రాష్ట్రాలు చేసిన చట్టాలకు రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరని తెలిపారు.