పెండింగ్‌లో ఎస్సైల బదిలీలు ?
Published Fri, Aug 19 2016 11:30 PM | Last Updated on Sun, Sep 2 2018 3:51 PM
నిజామాబాద్ క్రైం: జిల్లాలో ఎస్సైల బదిలీలు నిలిచిపోయినట్లు సమాచారం. ఎస్సై బదిలీలు జరిగిన 24 గంటలోపు దీనికి సంబంధించి ఉత్తర్వులు పెండింగ్‌లో పెట్టినట్లు తెలిసింది. ఈ ఉత్తర్వుల అమలు పెండింగ్‌లో ఉంచటం వెనుక జిల్లాకు చెందిన కొంతమంది నేతల జోక్యం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. గురువారం జరిగిన బదిలీలలో 11 మంది ఎస్‌హెచ్‌ఓలను మరో చోటుకు బదిలీ చేయకుండా వీఆర్‌లోకి పంపటమే ఈ బదిలీ ఉత్తర్వులు నిలిచిపోవటానికి కారణమని తెలుస్తోంది. దానికి తోడు నేతలు తమకు తెలియకుండా బదిలీలు చేయటంపై అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది. తమకు మాట వరుసకైన చెప్పకుండా ఎస్‌హెచ్‌ఓ, ఎస్సైల బదిలీలు ఎలా చేస్తారని రేంజ్ కార్యాలయం అధికారులను ప్రశ్నించినట్లు తెలిసింది. దాంతో బదిలీల ఉత్తర్వులు పెండింగ్‌లో పెట్టించిన నేతలు మరోసారి తమ పంతాన్ని నెగ్గించుకున్నారు. జిల్లా ఎస్పీ విశ్వప్రసాద్ శుక్రవారం హైదరాబాద్‌కు వెళ్లటంతో బదిలీల ఉత్తర్వులు నిలిచిపోవటంపై స్పష్టత రాలేదు. గురువారం రాత్రి జరిగిన బదిలీలలో కొంతమంది ఎస్‌హెచ్‌ఓలు జిల్లాలో ముఖ్య ప్రజాప్రతినిధుల కనుసన్నుల పనిచేస్తున్నరనే విషయాన్ని ఎస్పీ గుర్తించారు. వారి పనితీరుపై నివేదికలు తెప్పించుకుని వారికి బదిలీలలో మరోక స్టేషన్ అప్పగించకుండా వీఆర్‌లోకి పంపారు. బదిలీ అయిన కొంతమంది ఎస్‌హెచ్‌ఓలపై పలు అవినీతి ఆరోపణలు రావటంతో ఎస్పీ తీవ్రంగా పరిగణించారు. ఎస్పీ తాను జిల్లాకు వచ్చిన మొదటి రోజే ఎస్సైలు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు. ఎటువంటి విషయాలలో జోక్యం చేసుకోరాదు, శాఖకు మచ్చ తీసుకువస్తే సహించేది లేదని స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. అయిన నేతల ప్రసన్నం ఉన్న వారు తమను నేతలను కాపాడుతారని వారి పంధాను కొనసాగిస్తూ వచ్చారు. అటువంటి వారిపై ఎస్పీ మరింత దృష్టి సారించారు. దాంతో కొంతమంది ఎస్‌హెచ్‌ఓలు రాత్రికి రాత్రే ప్రజాప్రతినిధులను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. దీనికి స్పందించిన నేతలు బదిలీల ఉత్తర్వులు అమలు జరుగకుండా పెండింగ్‌లో పెట్టించినట్లు తెలిసింది. గతంలో 2014లో సాధరణ ఎన్నికల అనంతరం అప్పటి ఎస్పీ తరుణ్ జోషీ జిల్లాలో భారీ ఎత్తున ఎస్సైలను బదిలీలు చేశారు. ప్రజాప్రతినిధులు తాము సూచించిన ఎస్సైలను కాకుండా ఎస్పీ తన ఇష్టం వచ్చినట్లు బదిలీలు చేయటంపై ప్రముకుమ్మడిగా సీఎం వద్దకు వెళ్లి 24 గంటల లోపే బదిలీలు రద్దు చేయించి తమ పంతాన్ని నెగ్గించుకున్నారు. ఇప్పుడు కూడ బదిలీల ఉత్తర్వులు నిలిపివేయించి మరోసారి తమ పంతాన్ని నెగ్గించుకున్నట్లు అయ్యింది. జిల్లాలో మంచి ఆదాయం గల పోలీస్‌స్టేషన్లుగా పేరున్న స్టేషన్ల ఎస్సైలు ఉన్న ఫలంగా తమను వీఆర్‌లోకి పంపటంపై తాము డబ్బులు పెట్టి కొరుకున్న స్టేషన్ల నుంచి పెట్టిన డబ్బులు తిరిగి సంపాదించక ముందే బదిలీలు కావటంతో నేతలను ఆశ్రయించినట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. నిలిచిపోయిన ఉత్తర్వులు అమలు అవుతాయా లేదా, వీఆర్‌లోకి వెళ్లిన వారికి మరోక పోలీస్‌స్టేషన్లు అప్పగిస్తారా వేచి చూడాలి. S
Advertisement