సనాతన ధర్మ పరిరక్షణే ధ్యేయం
సనాతన ధర్మ పరిరక్షణే ధ్యేయం
Published Sun, May 14 2017 11:09 PM | Last Updated on Tue, Sep 5 2017 11:09 AM
వైఖానస దివ్య సిద్దాన్త వివర్ధనీ సభ శతాబ్ది ఉత్సవాల్లో వక్తలు
మండపేట : గ్రామ స్థాయి నుంచి సనాతన ధర్మపరిరక్షణకు తిరుమల వైఖానస దివ్య సిద్ధాన్త వివర్ధనీ సభ కృషి చేస్తోందని వైఖానస పండితులు పేర్కొన్నారు. మండపేట వేదికగా వైఖానస నామకరణ శతాబ్ది ఉత్సవాలు ఆదివారం ఘనంగా జరిగాయి. స్థానిక శ్రీదేవి, భూదేవి సమేత జనార్దనస్వామి ఆలయం, సీతారామ కల్యాణ మండపంలో ఉదయం 8.30 నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు జరిగిన ఈ ఉత్సవాలకు రాష్ట్ర, రాష్ట్రేతర ప్రాంతాల నుంచి వైఖానస పండితులు తరలివచ్చారు. సీతారామ కల్యాణ మండపంలో వైఖానస వివర్థని సభ ప్రధాన కార్యదర్శి దివి శ్రీనివాసదీక్షితులు మాట్లాడుతూ పూర్వీకులు అందించిన వేద విద్యను భావితరాలకు అందించేందుకు తిరుమలలోని వైఖానస వివర్థని సభ పాటుపడుతోందన్నారు. వందేళ్ల క్రితం మండపేట వేదికగా వివర్థని సభకు నామకరణం జరిగిందని, ఇది జాతీయ స్థాయికి విస్తరించిందన్నారు. వైఖానస ఆగమం తదితర అంశాలపై ముఖ్య అతిథులుగా హాజరైన ఏఎస్ నారాయణదీక్షితులు, డాక్టర్ సీతారామ భార్గవ, వేదాంతం రామకృష్ణమాచార్యులు, ఎన్. వేణుగోపాల్ వివరించారు. ఆగమాన్ని డిజిటలైజేషన్ ప్రక్రియ ద్వారా యధాతధంగా భవిష్యత్తు తరాలకు అందించడం, ప్రాంతీయ వైఖానస సంఘాలు ఏర్పాటుచేసేందుకు శాఖీయులు ఐక్యతతో ముందుకు సాగాలని వారు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేలు వేగుళ్ల జోగేశ్వరరావు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవరప్రకాష్, టీడీపీ నాయకులు వి. సాయికుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారు మాట్లాడుతూ సనాతన సంప్రదాయాల పరిరక్షణలో వైఖానస దివ్య సిద్ధాన్త వివర్ధనీ సభ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. శతాబ్ది సమావేశం అనంతరం వైఖానస పండితులకు ధర్మ ప్రతిష్టాన్ పురస్కారాలను ప్రదానం చేశారు.
ఆకట్టుకున్న శోభాయాత్ర
వైఖానస దివ్య సిద్ధాన్త వివర్ధనీ సభ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా కపిలేశ్వరపురం వైఖానస సంఘం ఆధ్వర్యంలో జనార్దనస్వామి ఆలయంలో సుదర్శన మహాయాగాన్ని ఘనంగా నిర్వహించారు. వేదపండితులు బిక్కవోలు కేశవాచార్యులు ఆధ్వర్యంలో హోమం, మహాపూర్ణాహుతి నిర్వహించారు. తిరుచ్చి వాహనంపై విఖనస మహర్షిని ప్రతిష్ఠించి మంగళవాయిద్యాలు, కోలాటం, గరగనృత్యాలు, వేదమంత్రాలతో పట్టణంలో శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. సంఘ జిల్లా అధ్యక్షుడు కేవీఎస్‌ఆర్‌ఎన్ ఆచార్యులు, సంఘ నాయకులు ఖండవిల్లి రాధాకృష్ణమాచార్యులు, ఖండవిల్లి కిరణ్‌కుమార్, నారాయణ దీక్షితులు, పెద్దింటి రాంబాబు, ఎస్‌వీ రామశర్మ, అంగర సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement