sathabdhi
-
సనాతన ధర్మ పరిరక్షణే ధ్యేయం
వైఖానస దివ్య సిద్దాన్త వివర్ధనీ సభ శతాబ్ది ఉత్సవాల్లో వక్తలు మండపేట : గ్రామ స్థాయి నుంచి సనాతన ధర్మపరిరక్షణకు తిరుమల వైఖానస దివ్య సిద్ధాన్త వివర్ధనీ సభ కృషి చేస్తోందని వైఖానస పండితులు పేర్కొన్నారు. మండపేట వేదికగా వైఖానస నామకరణ శతాబ్ది ఉత్సవాలు ఆదివారం ఘనంగా జరిగాయి. స్థానిక శ్రీదేవి, భూదేవి సమేత జనార్దనస్వామి ఆలయం, సీతారామ కల్యాణ మండపంలో ఉదయం 8.30 నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు జరిగిన ఈ ఉత్సవాలకు రాష్ట్ర, రాష్ట్రేతర ప్రాంతాల నుంచి వైఖానస పండితులు తరలివచ్చారు. సీతారామ కల్యాణ మండపంలో వైఖానస వివర్థని సభ ప్రధాన కార్యదర్శి దివి శ్రీనివాసదీక్షితులు మాట్లాడుతూ పూర్వీకులు అందించిన వేద విద్యను భావితరాలకు అందించేందుకు తిరుమలలోని వైఖానస వివర్థని సభ పాటుపడుతోందన్నారు. వందేళ్ల క్రితం మండపేట వేదికగా వివర్థని సభకు నామకరణం జరిగిందని, ఇది జాతీయ స్థాయికి విస్తరించిందన్నారు. వైఖానస ఆగమం తదితర అంశాలపై ముఖ్య అతిథులుగా హాజరైన ఏఎస్ నారాయణదీక్షితులు, డాక్టర్ సీతారామ భార్గవ, వేదాంతం రామకృష్ణమాచార్యులు, ఎన్. వేణుగోపాల్ వివరించారు. ఆగమాన్ని డిజిటలైజేషన్ ప్రక్రియ ద్వారా యధాతధంగా భవిష్యత్తు తరాలకు అందించడం, ప్రాంతీయ వైఖానస సంఘాలు ఏర్పాటుచేసేందుకు శాఖీయులు ఐక్యతతో ముందుకు సాగాలని వారు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేలు వేగుళ్ల జోగేశ్వరరావు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవరప్రకాష్, టీడీపీ నాయకులు వి. సాయికుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారు మాట్లాడుతూ సనాతన సంప్రదాయాల పరిరక్షణలో వైఖానస దివ్య సిద్ధాన్త వివర్ధనీ సభ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. శతాబ్ది సమావేశం అనంతరం వైఖానస పండితులకు ధర్మ ప్రతిష్టాన్ పురస్కారాలను ప్రదానం చేశారు. ఆకట్టుకున్న శోభాయాత్ర వైఖానస దివ్య సిద్ధాన్త వివర్ధనీ సభ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా కపిలేశ్వరపురం వైఖానస సంఘం ఆధ్వర్యంలో జనార్దనస్వామి ఆలయంలో సుదర్శన మహాయాగాన్ని ఘనంగా నిర్వహించారు. వేదపండితులు బిక్కవోలు కేశవాచార్యులు ఆధ్వర్యంలో హోమం, మహాపూర్ణాహుతి నిర్వహించారు. తిరుచ్చి వాహనంపై విఖనస మహర్షిని ప్రతిష్ఠించి మంగళవాయిద్యాలు, కోలాటం, గరగనృత్యాలు, వేదమంత్రాలతో పట్టణంలో శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. సంఘ జిల్లా అధ్యక్షుడు కేవీఎస్ఆర్ఎన్ ఆచార్యులు, సంఘ నాయకులు ఖండవిల్లి రాధాకృష్ణమాచార్యులు, ఖండవిల్లి కిరణ్‌కుమార్, నారాయణ దీక్షితులు, పెద్దింటి రాంబాబు, ఎస్వీ రామశర్మ, అంగర సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు. -
చదువుకున్న బడి కన్నతల్లి
మాజీ కేంద్ర మంత్రి బోళ్ల బుల్లి రామయ్య ముగిసిన శతాబ్ది ఉత్సవాలు రాజోలు : చదువుకున్న బడి కన్నతల్లి వంటిదని కేంద్ర మాజీ మంత్రి బోళ్ల బుల్లిరామయ్య అన్నారు. స్థానిక బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న శతాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా ఆదివారం నిర్వహించి సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. పాఠశాలలో చదువుకున్న రోజులను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. కన్నతల్లిని, చదువుకున్న పాఠశాలను ఎవరూ మర్చిపోవద్దన్నారు. చదువుకున్న స్నేహితులను కలవడం సంతోషంగా ఉందన్నారు. ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో బుల్లిరామయ్యను సత్కరించారు. ఉత్సవాలకు వచ్చిన పూర్వ విద్యార్థులకు భోజన సదుపాయం కల్పించిన ఆయనకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే సూర్యారావు మాట్లాడుతూ ఈ ఉత్సవాలు నిర్వహించే అవకాశం రావడం ఆనందంగా ఉందన్నారు. వందేళ్ల చరిత్ర కలిగిన ఈ పాఠశాలకు హెచ్ఎంలుగా పనిచేసిన వారితోపాటు, రిటైర్డ్ ఉపాధ్యాయులు, ప్రస్తుత ఉపాధ్యాయులను సత్కరించారు. చదువుకున్న రోజులు తిరిగిరావు : దర్శకుడు సుకుమార్ చిన్నతనంలో ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో చదువుకున్న రోజులు తిరిగిరావని ప్రముఖ దర్శకుడు సుకుమార్ అన్నారు. నాటి జ్ఞాపకాలు తీపిగుర్తులుగా నిలిచిపోతాయన్నారు. పూర్వపు రోజులే మంచివని, ప్రస్తుతం బిజీ జీవితాలతో పిల్లలతో గడపలేకపోతున్నారన్నారు. ఉత్సవాలకు విచ్చేసిన స్నేహితులతో ఆయన గడిపారు. తనకు విద్య నేర్పిన మద్దుల రాధాకృష్ణ, సోమయాజులు మాస్టార్లను సుకుమార్ సత్కరించారు. అనంతరం సుకుమార్‌ను ఉత్సవ కమిటీ సత్కరించింది. రాజోలు అంటే అభిమానం : సినీ నటి హేమ పుట్టిన పెరిగిన రాజోలు అంటే అభిమానమని సినీ నటి హేమ అన్నారు. ఈఉత్సవాలకు ఆమె కుటుంబ సభ్యులతో సహ వచ్చారు. పిల్లలను బాగా చదివించాలని తల్లిదండ్రులకు సూచించారు. వారికి ఇబ్బందులు వస్తే అండగా నిలుస్తాన్నారు. ఉత్సవాలకు విచ్చేసిన హేమను ఉత్సవ కమిటీ సత్కరించింది. -
మంచి నడవడి అలవర్చండి
గురుశిష్యుల అనుబంధం పెరగాలి డిప్యూటీ సీఎం చినరాజప్ప వైభవంగా శతాబ్ది ఉత్సవాలు ప్రారంభం పూర్వ విద్యార్థులకు సత్కారం రాజోలు : విద్యార్థులకు మంచి నడవడి అలవర్చి వారిని మహోన్నతులుగా తీర్చిదిద్దాలని తద్వారా గురు శిష్యుల మధ్య అనుబంధం బలపడుతుందని డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. శనివారం రాజోలు బాలుర ఉన్నత పాఠశాల శతాబ్ది ఉత్సవాల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతన డిప్యూటీ సీఎం చినరాజప్ప, జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు జ్యోతిప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. తొలుత కూర్మా నరసింహారావు దంపతులు శంఖాన్ని పూరించి ఉత్సవాలకు స్వాగతం పలికారు. రాజప్ప మాట్లాడుతూ కార్పొరేట్ సంస్థల రాకతో విద్యా వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్న మైందన్నారు. తాము చదువుకునే రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలే కీలకంగా నిలిచాయన్నారు. 50 ఏళ్ల క్రితం ఉన్న గురుశిష్యుల అనుబంధం ఇప్పుడు కనిపించడం లేదన్నారు. గురు శిష్యుల మధ్య ప్రేమానురాగాలు పెంచాలన్నారు. గతంలో వార్షికోత్సవాలు నిర్వహించేవారని ప్రస్తుతం ఆ సంస్కృతి పూర్తిగా తగ్గిపోయిందన్నారు. ‘నేను’ అని స్వార్థం చూపకుండా ‘మన సమాజం’ అనే భావన అందరిలో కలిగినప్పుడే అభివృద్ధి జరుగుతుందన్నారు. జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు మాట్లాడుతూ ఎంతో మంది బాలుర ఉన్నత పాఠశాలలో చదివి ఉన్నత శిఖరాలకు చేరుకున్నారన్నారు. సుదూర ప్రాంతాల నుంచి పూర్వ విద్యార్థులు శతాబ్ది ఉత్సవాలకు రావడం సంతోషంగా ఉందన్నారు. సినీనటి హేమ మాట్లాడుతూ చదువును మధ్యలో ఆపకుండా ప్రతి ఒక్కరూ కనీసం డిగ్రీ వరకు చదువుకోవాలన్నారు. తొలుత ఎమ్మెల్యే సూర్యారావు జాతీయ, పాఠశాల పతాకాలను ఆవిష్కరించారు. పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన శతాబ్ది ఉత్సవ స్థూపం ఆవిష్కరించారు. రూ.32.50 లక్షలతో శతాబ్ది భవన విభాగం పనులకు శంకుస్థాపన చేశారు. ‘శతాబ్ది శార్వాణి’ ఆవిష్కరణ డిప్యూటీ సీఎం చినరాజప్ప, జెడ్పీ చైర్మన్ రాంబాబులు ‘శతాబ్ది శార్వాణి’ సంచికను ఆవిష్కరించారు. ఉత్సవాలను పురస్కరించుకుని జబర్దస్త్ టీం కామెడీ షో, వై.రామ్మోహనరావు మ్యాజిక్ షో, పాఠశాల విద్యార్థుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సీనియర్ పూర్వ విద్యార్థులు నున్న నాగేశ్వరరావు, హైకోర్టు న్యాయవాది వెంపరాల గోపాలకృష్ణ, కేశవరావు, మాధవరావు, కొండేపూడి వెంకట్రావు, కొమ్ముల సత్యనారాయణ స్వామి, ఆరుమిల్లి సుబ్బారావు, యర్రాప్రగడ రామకృష్ణ తదితరులను ఘనంగా సత్కరించారు. ఎంపీపీ అనచూరి సునీత, సర్పంచ్ మట్టా కృష్ణకుమారి, ఉత్సవ కమిటీ గౌరవ అధ్యక్షుడు పొన్నాడ హనుమంతరావు, అధ్యక్షుడు కోళ్ల వెంకన్న, ఆహ్వాన కమిటీ అధ్యక్షుడు ముదునూరి అక్కిరాజు, కన్వీనర్ పామర్తి రమణ, ప్రధాన కార్యదర్శి పొన్నాడ సూర్యారావు, కోశాధికారి కాసు శ్రీను, ఉత్సవాల ప్రచార కర్త దారపురెడ్డి బాబ్జి తదితరులు పాల్గొన్నారు.