మంచి నడవడి అలవర్చండి
మంచి నడవడి అలవర్చండి
Published Sat, Feb 11 2017 11:34 PM | Last Updated on Sat, Sep 15 2018 4:12 PM
గురుశిష్యుల అనుబంధం పెరగాలి
డిప్యూటీ సీఎం చినరాజప్ప
వైభవంగా శతాబ్ది ఉత్సవాలు ప్రారంభం
పూర్వ విద్యార్థులకు సత్కారం
రాజోలు : విద్యార్థులకు మంచి నడవడి అలవర్చి వారిని మహోన్నతులుగా తీర్చిదిద్దాలని తద్వారా గురు శిష్యుల మధ్య అనుబంధం బలపడుతుందని డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. శనివారం రాజోలు బాలుర ఉన్నత పాఠశాల శతాబ్ది ఉత్సవాల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతన డిప్యూటీ సీఎం చినరాజప్ప, జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు జ్యోతిప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. తొలుత కూర్మా నరసింహారావు దంపతులు శంఖాన్ని పూరించి ఉత్సవాలకు స్వాగతం పలికారు. రాజప్ప మాట్లాడుతూ కార్పొరేట్ సంస్థల రాకతో విద్యా వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్న మైందన్నారు. తాము చదువుకునే రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలే కీలకంగా నిలిచాయన్నారు. 50 ఏళ్ల క్రితం ఉన్న గురుశిష్యుల అనుబంధం ఇప్పుడు కనిపించడం లేదన్నారు. గురు శిష్యుల మధ్య ప్రేమానురాగాలు పెంచాలన్నారు. గతంలో వార్షికోత్సవాలు నిర్వహించేవారని ప్రస్తుతం ఆ సంస్కృతి పూర్తిగా తగ్గిపోయిందన్నారు. ‘నేను’ అని స్వార్థం చూపకుండా ‘మన సమాజం’ అనే భావన అందరిలో కలిగినప్పుడే అభివృద్ధి జరుగుతుందన్నారు. జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు మాట్లాడుతూ ఎంతో మంది బాలుర ఉన్నత పాఠశాలలో చదివి ఉన్నత శిఖరాలకు చేరుకున్నారన్నారు. సుదూర ప్రాంతాల నుంచి పూర్వ విద్యార్థులు శతాబ్ది ఉత్సవాలకు రావడం సంతోషంగా ఉందన్నారు. సినీనటి హేమ మాట్లాడుతూ చదువును మధ్యలో ఆపకుండా ప్రతి ఒక్కరూ కనీసం డిగ్రీ వరకు చదువుకోవాలన్నారు. తొలుత ఎమ్మెల్యే సూర్యారావు జాతీయ, పాఠశాల పతాకాలను ఆవిష్కరించారు. పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన శతాబ్ది ఉత్సవ స్థూపం ఆవిష్కరించారు. రూ.32.50 లక్షలతో శతాబ్ది భవన విభాగం పనులకు శంకుస్థాపన చేశారు.
‘శతాబ్ది శార్వాణి’ ఆవిష్కరణ
డిప్యూటీ సీఎం చినరాజప్ప, జెడ్పీ చైర్మన్ రాంబాబులు ‘శతాబ్ది శార్వాణి’ సంచికను ఆవిష్కరించారు. ఉత్సవాలను పురస్కరించుకుని జబర్దస్త్ టీం కామెడీ షో, వై.రామ్మోహనరావు మ్యాజిక్ షో, పాఠశాల విద్యార్థుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సీనియర్ పూర్వ విద్యార్థులు నున్న నాగేశ్వరరావు, హైకోర్టు న్యాయవాది వెంపరాల గోపాలకృష్ణ, కేశవరావు, మాధవరావు, కొండేపూడి వెంకట్రావు, కొమ్ముల సత్యనారాయణ స్వామి, ఆరుమిల్లి సుబ్బారావు, యర్రాప్రగడ రామకృష్ణ తదితరులను ఘనంగా సత్కరించారు. ఎంపీపీ అనచూరి సునీత, సర్పంచ్ మట్టా కృష్ణకుమారి, ఉత్సవ కమిటీ గౌరవ అధ్యక్షుడు పొన్నాడ హనుమంతరావు, అధ్యక్షుడు కోళ్ల వెంకన్న, ఆహ్వాన కమిటీ అధ్యక్షుడు ముదునూరి అక్కిరాజు, కన్వీనర్ పామర్తి రమణ, ప్రధాన కార్యదర్శి పొన్నాడ సూర్యారావు, కోశాధికారి కాసు శ్రీను, ఉత్సవాల ప్రచార కర్త దారపురెడ్డి బాబ్జి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement