చదువుకున్న బడి కన్నతల్లి
చదువుకున్న బడి కన్నతల్లి
Published Sun, Feb 12 2017 10:23 PM | Last Updated on Sat, Sep 15 2018 4:12 PM
మాజీ కేంద్ర మంత్రి బోళ్ల బుల్లి రామయ్య
ముగిసిన శతాబ్ది ఉత్సవాలు
రాజోలు : చదువుకున్న బడి కన్నతల్లి వంటిదని కేంద్ర మాజీ మంత్రి బోళ్ల బుల్లిరామయ్య అన్నారు. స్థానిక బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న శతాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా ఆదివారం నిర్వహించి సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. పాఠశాలలో చదువుకున్న రోజులను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. కన్నతల్లిని, చదువుకున్న పాఠశాలను ఎవరూ మర్చిపోవద్దన్నారు. చదువుకున్న స్నేహితులను కలవడం సంతోషంగా ఉందన్నారు. ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో బుల్లిరామయ్యను సత్కరించారు. ఉత్సవాలకు వచ్చిన పూర్వ విద్యార్థులకు భోజన సదుపాయం కల్పించిన ఆయనకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే సూర్యారావు మాట్లాడుతూ ఈ ఉత్సవాలు నిర్వహించే అవకాశం రావడం ఆనందంగా ఉందన్నారు. వందేళ్ల చరిత్ర కలిగిన ఈ పాఠశాలకు హెచ్‌ఎంలుగా పనిచేసిన వారితోపాటు, రిటైర్డ్ ఉపాధ్యాయులు, ప్రస్తుత ఉపాధ్యాయులను సత్కరించారు.
చదువుకున్న రోజులు తిరిగిరావు : దర్శకుడు సుకుమార్
చిన్నతనంలో ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో చదువుకున్న రోజులు తిరిగిరావని ప్రముఖ దర్శకుడు సుకుమార్ అన్నారు. నాటి జ్ఞాపకాలు తీపిగుర్తులుగా నిలిచిపోతాయన్నారు. పూర్వపు రోజులే మంచివని, ప్రస్తుతం బిజీ జీవితాలతో పిల్లలతో గడపలేకపోతున్నారన్నారు. ఉత్సవాలకు విచ్చేసిన స్నేహితులతో ఆయన గడిపారు. తనకు విద్య నేర్పిన మద్దుల రాధాకృష్ణ, సోమయాజులు మాస్టార్లను సుకుమార్ సత్కరించారు. అనంతరం సుకుమార్‌ను ఉత్సవ కమిటీ సత్కరించింది.
రాజోలు అంటే అభిమానం : సినీ నటి హేమ
పుట్టిన పెరిగిన రాజోలు అంటే అభిమానమని సినీ నటి హేమ అన్నారు. ఈఉత్సవాలకు ఆమె కుటుంబ సభ్యులతో సహ వచ్చారు. పిల్లలను బాగా చదివించాలని తల్లిదండ్రులకు సూచించారు. వారికి ఇబ్బందులు వస్తే అండగా నిలుస్తాన్నారు. ఉత్సవాలకు విచ్చేసిన హేమను ఉత్సవ కమిటీ సత్కరించింది.
Advertisement
Advertisement