
ముంబైలో మెరిసిన సిద్దిపేట
♦ మున్సిపల్ పనితీరుపై పవర్ ప్రజెంటేషన్
♦ ఉత్తమ మున్సిపల్‌గా తుది జాబితాలో చోటు
♦ త్వరలో డిల్లీలో అవార్డు ప్రదానం
సిద్దిపేట జోన్: ముంబైలో సిద్దిపేట మురిసింది.. మున్సిపాలిటీలో అమలవుతున్న ఉత్తమ సేవలపై జరిగిన పవర్ ప్రజెంటేషన్‌లో ఇక్కడి అధికారులు వివరించారు. వినూత్న పథకాలతో దేశానికే ఆదర్శంగా నిలిచిన మున్సిపాలిటీలకు అవార్డులను ప్రదానం చేసేందుకు సుమిత్ అంతర్జాతీయ సంస్థ సర్వే ద్వారా రూపొందించిన షార్ట్ లిస్ట్‌లో సిద్దిపేటకు అవకాశం దక్కింది. గురువారం ముంబైలో సంస్థ నిర్వహించిన పవర్ ప్రజెంటేషన్‌లో దేశవ్యాప్తంగా 60 మున్సిపాలిటీల కమిషనర్లు హాజరయ్యారు. వారిలో సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ రమణాచారి కూడా పాల్గొని స్పెషల్ గ్రేడ్ మున్సిపల్‌లో చేపట్టిన వినూత్న ప్రక్రియలు, స్వచ్ఛ సిద్దిపేట కింద పారిశుద్ధ్య చర్యలు చేపట్టిన విధానం, వాటి సత్ఫలితాలను కమిషనర్ వివరించారు.
దేశవ్యాప్తంగా మున్సిపాలిటీల్లో వినూత్న ప్రయోగాలను క్రోడీకరిస్తూ స్కాచ్ సంస్థ సర్వే నిర్వహించింది. దేశవ్యాప్తంగా ఆయా మున్సిపాలిటీల్లో వచ్చిన దరఖాస్తులను పరిశీలనలోకి తీసుకుని తుది జాబితాను రూపొందించింది. అందులో తెలంగాణ నుంచి సిద్దిపేట, కోదాడ, షాద్‌నగర్ మున్సిపాలిటీలకు అవకాశం దక్కింది. గురువారం జరిగిన 44వ కాన్ఫరెన్స్‌లో సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ రమణాచారి పట్టణంలో బహిరంగ మల విసర్జన రహిత పథకం, సాలిడ్ వేస్ట్‌మేనేజ్‌మెంట్ చర్యలు, వాటి ద్వారా లభిస్తున్న సత్ఫలితాలను పవర్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. సిద్దిపేట అధికారుల వివరణతో సంతృప్తి చెందిన సంస్థ ప్రతినిధులు స్వచ్చ భారత్ కింద ఆదర్శంగా నిలవడంపై కితాబ్ ఇచ్చినట్లు సమాచారం, మరోవైపు తుది జాబితాలో స్థానం దక్కించుకున్న మున్సిపాలిటీలకు సెప్టెంబర్‌లో డిల్లీలో జరిగే కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కాన్పరెన్స్‌లో ఉత్తమ మున్సిపల్‌గా అవార్డును ప్రదానం చేయనున్నారు.