దుర్గమ్మ వెండి పళ్లెం, తీర్థపు గిన్నె సమర్పణ
నగరంలోని మొగల్రాజపురానికి చెందిన ఎం.సత్యనారాయణ, రంగమణి దంపతులు మంగళవారం దుర్గమ్మకు వెండి పళ్లెం, తీర్థపు గిన్నె సమర్పించారు.
విజయవాడ (ఇంద్రకీలాద్రి) : నగరంలోని మొగల్రాజపురానికి చెందిన ఎం.సత్యనారాయణ, రంగమణి దంపతులు మంగళవారం దుర్గమ్మకు వెండి పళ్లెం, తీర్థపు గిన్నె సమర్పించారు. 1.100 కిలోల వెండితో ఈ వస్తువులను తయారు చేయించినట్లు దాత పేర్కొన్నారు.
కుంకుమార్చనలో 2,131 ఉభయదాతలు
దసరా ఉత్సవాల్లో అమ్మవారికి జరిగిన విశేష కుంకుమార్చనలో 2,131 మంది ఉభయదాతలు పాల్గొన్నారు. మూలానక్షత్రం, మహాలక్ష్మీ దేవి అలంకారం రోజుల మినహా మిగిలిన రోజుల్లో ఉభయదాతల సంఖ్య అంతంత మాత్రంగానే ఉంది. 210 మంది ఉభయదాతలు విశేష చండీయాగంలో పాల్గొన్నారు.
డోన్‌లతో చిత్రీకరణ
గంగా పార్వతీ సమేత మల్లేశ్వరస్వామి వార్లకు జరిగిన తెప్పోత్సవాన్ని చిత్రీకరించేందుకు డోన్‌లను భారీగా ఏర్పాటుచేశారు. దేవస్థానం, పోలీసు శాఖ ఏర్పాటు చేసిన డోన్‌లతో పాటు మొత్తం నాలుగు డోన్‌లతో ఈ ఉత్సవాన్ని చిత్రీకరించారు. దసరా ఉత్సవాల్లో 11వ రోజైన మంగళవారం రాజరాజేశ్వరిగా దర్శనమిచ్చిన దుర్గమ్మను ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు.