క్రీడా కేంద్రంగా సింహపురి
-
మొగళ్లపాళెం వద్ద స్టేడియం నిర్మాణం
-
శాప్‌కు 150 ఎకరాలను కేటాయించిన ప్రభుత్వం
-
రీజినల్ స్పోర్ట్స్ అకాడమీ వైపుగా అడుగులు
-
క్రీడాకారుల్లో వ్యక్తమవుతున్న హర్షం
నెల్లూరు(బృందావనం) : సింహపురి క్రీడా కేంద్రంగా మారనుంది. నెల్లూరు సమీపంలోని మొగళ్లపాళెం వద్ద స్టేడియం నిర్మాణానికి 150 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ ప్రభుత్వం శుక్రవారం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో సింహపురి క్రీడా ముఖచిత్రం రెండు మూడేళ్లలో మారనుంది. నగరానికి సమీపంలోని మొగళ్లపాళెం వద్ద సర్వేనంబరు 55లో 150 ఎకరాల స్థలాన్ని ‘శాప్’కు ముందస్తుగా అప్పగించాలని కలెక్టర్‌కు రెవెన్యూ శాఖ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రాంతంలో అంతర్జాతీయ స్థాయి క్రీడామౌలిక సదుపాయాలతో స్పోర్ట్సు కాంప్లెక్స్ నిర్మించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఒక ఆలోచనకు వచ్చాయి. దీంతో దక్షిణ భారతదేశంలో రీజనల్ స్పోర్ట్సు అకాడమీ వైపు అడుగులు పడనున్నాయనే సంకేతాలు వెలువడుతున్నాయి. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు భారత క్రీడాప్రాధికార సంస్థ(శాయ్) నుంచి రాష్ట్రానికి సాయం అందించేందుకు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా స్టేడియం నిర్మాణానికి సంబంధించిన పనులను వేగవంతం చేయాలని సంబంధిత రాష్ట్ర, కేంద్ర అధికారులను పురమాయిస్తున్నారు. దీంతో రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థకు 150 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ రెవెన్యూ శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసినట్లుగా సమాచారం. ఇందుకు సంబం«ధించిన ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం తనవంతుగా వేగవంతం చేస్తున్నట్లు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం సైతం కలిసివచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని తన వంతుగా మొగళ్లపాలెం స్పోర్ట్సు కాంప్లెక్స్‌కు అవసరమైన రోడ్లు, భూమి చదనుకు మరో రూ.4కోట్లు మంజూరు చేయాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వం ఆమోదించినట్లు సమాచారం.
డీపీఆర్‌కు అధికారుల సన్నాహాలు
స్పోర్ట్సు కాంప్లెక్స్ నిర్మాణానికి సంబంధించి కేంద్ర అధ్యయన బృందం డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్(డీపీఆర్)ను తయారుచేయనుంది. మొగళ్లపాళెంలో నిర్మితం కానున్న స్పోర్ట్సుకాంప్లెక్స్ కోసం పొదలకూరు రోడ్డు నుంచి 100అడుగుల రహదారిని నిర్మించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను నిర్మించనున్న 150 ఎకరాలను ఈ ఏడాది ఫిబ్రవరి 18న రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసుల ముఖ్యకార్యదర్శి ఎల్‌వీ సుబ్రహ్మణ్యం పరిశీలించారు. జిల్లా, రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థకు చెందిన యంత్రాంగానికి సూచనలు చేశారు. స్టేడియం నిర్మాణానికి సేకరించనున్న భూములకు సంబంధించిన రైతులకు ఇప్పటికే ప్రభుత్వం రూ.6 కోట్లు పరిహారంగా అందించింది.
క్రీడా రంగానికి మహర్దశ: ఎం.రవీంద్రబాబు, శాప్ డైరెక్టర్
మొగళ్లపాళెంలో చేపట్టనున్న స్టేడియం నిర్మాణంతో రాష్ట్ర క్రీడారంగానికి మహర్దశ పట్టనుంది. హైదరాబాద్ కేంద్రంగా క్రీడాప్రగతి జరిగి రాష్ట్ర విభజనతో ఎంతో నష్టపోయాం. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడి చొరవతో రాష్ట్ర ప్రభుత్వం స్టేడియం నిర్మాణాకిని 150 ఎకరాలను కేటాయించడం సంతోషకరం. భవిష్యత్తులో నెల్లూరు జాతీయ క్రీడలకు వేదిక కావడం ఖాయం.