పాడుతున్న జయచంద్ర (ఫైల్)
గాయకుడు జయచంద్ర హఠాన్మరణం
వినుకొండ రూరల్ : ప్రముఖ గాయకులు ఎనుబరి జయచంద్ర (65) హఠాన్మరణం చెందారు. శనివారం ఉదయం తీవ్ర గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు గుంటూరు తరలిస్తుండగా మర్గమధ్యలో మృతి చెందారు. ఈపూరు మండలం అంగలూరుకు చెందిన సునందమ్మ, చినజార్జిలకు ఆయన రెండో సంతానం. వినుకొండ కోర్టులో ఎల్‌డీసీగా పనిచేసి నాలుగేళ్ళ క్రితం పదవీ విరమణ చేశారు. చిన్నప్పటి నుండి ఘంటసాల పాటలపై మక్కువ ఎక్కువ. నిర్విరామంగా 40 ఘంటసాల పాటలను అనర్గళంగా పాడడం ఆయన ప్రత్యేకత. దీంతో ఘంటసాల జయచంద్రగా వినుకొండ పుర ప్రజల గుర్తింపు పొందారు. మక్కెన మల్లికార్జునరావు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో స్థానిక మున్సిపల్ కార్యాలయంలో జయచంద్ర కళను మెచ్చి గండపెండేరం తొడిగారు.
ఇప్పటి వరకు వేలాది పాట కచేరీలు నిర్వహించి వందల పాటలను తన మధుర కంఠంతో ఆలపించి ఘంటసాల జయచంద్రగా ప్రఖ్యాతి పొందారు. గత 15 ఏళ్ళగా ప్రముఖ తెలుగు గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో కలిసి ఘంటసాల పాటలను పాడిన గొప్ప కళాకారుడిగా కీర్తిగడించారు. ఆయన హఠాన్మరణంతో బంధువులు, కళాకారులు దిగ్భ్రాంతి చెందారు. సమాచారం తెలుసుకున్న డీసీసీ అధ్యక్షుడు మక్కెన మల్లికార్జునరావు, సీపీఐ సీనియర్ నాయకులు సండ్రపాటి సైదాతో పాటు పలువురు ప్రముఖులు వినుకొండలోని ఆయన మృతదేహాన్ని సందర్శించి ఘనంగా నివాళులర్పించారు. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు.