ఉద్రిక్తతల మధ్య సిరిసిల్ల బంద్
-
మూడు ఆర్టీసీ బస్సుల అద్దాలు ధ్వంసం
-
మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం
-
నేడు కొనసాగనున్న బంద్
సిరిసిల్ల: సిరిసిల్ల జిల్లా సాధన ఉద్యమం ఉధతమైంది. 48గంటల బంద్‌లో భాగంగా మంగళవారం ఉద్రిక్తతల మధ్య బంద్ సంపూర్ణంగా సాగింది. జిల్లా సాధన జేఏసీ, అఖిలపక్షం పిలుపు మేరకు సిరిసిల్ల బంద్ జరిగింది. తెల్లవారుజామునే జేఏసీ నాయకులు బస్ డిపోముందు బైఠాయించి బస్సులు బయటికి రాకుండా అడ్డుకున్నారు. వన్‌పల్లికి వెళ్లిన నైట్‌హాల్ట్ బస్సు సిరిసిల్లకు రాగా.. ఆందోళనకారులు అద్దాలను ధ్వంసం చేశారు. తెరిచి ఉన్న పెట్రోల్ బంక్ డిస్‌ప్లేను, ఆఫీస్ అద్దాలను పగులగొట్టారు. బైపాస్ దారిలో వెళ్తున్న సిద్దిపేట, వేములవాడ డిపోల బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. రోడ్లపై టైర్లు వేసి మంటలు అంటించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద రాస్తారోకో చేసి నిరసన తెలిపారు. మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మలు దహనం చేశారు. కేటీఆర్ చొరవ చూపి సిరిసిల్ల జిల్లాను ఇవ్వాలని డిమాండ్‌చేశారు. కోర్టు ముందు న్యాయవాదులు దీక్షలు కొనసాగించారు. వస్త్రవ్యాపారులు దీక్షల్లో కూర్చున్నారు. రోడ్డుపైనే వంటావార్పు చేసి సామూహికంగా భోజనాలు చేశారు. పట్టణంలో దుకాణదారులు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నారు. సిరిసిల్లలో మరమగ్గాలను బంద్‌చేసి వస్త్రోత్పత్తిని నిలిపివేసిన నేతకార్మికులు జిల్లా సాధన ఉద్యమంలో పాల్గొన్నారు. డీఎస్పీ పి.సుధాకర్, సీఐలు జి.విజయ్‌కుమార్, సీహెచ్.శ్రీధర్, పది మంది ఎసై ్సలు బందోబస్తును పర్యవేక్షించారు. 48 గంటల బంద్‌లో భాగంగా బుధవారం బంద్ కొనసాగుతుంది.