'జిల్లా కన్నా రెట్టింపు అభివృద్ధి చేస్తా'
'జిల్లా కన్నా రెట్టింపు అభివృద్ధి చేస్తా'
Published Thu, Sep 8 2016 6:02 PM | Last Updated on Fri, Aug 30 2019 8:24 PM
హైదరాబాద్ : సిరిసిల్ల జిల్లా అయితే జరిగే అభివృద్ధి కన్నా రెట్టింపు అభివృద్ధి చేస్తానని మంత్రి కేటీఆర్ తెలిపారు. సిరిసిల్ల జిల్లా కోరుతూ పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో కేటీఆర్ నియోజకవర్గ ప్రజలకు గురువారం బహిరంగ లేఖ చేశారు.
రాజకీయంగా తనకు జన్మనిచ్చిన సిరిసిల్ల ప్రజలకు తాను గానీ, టీఆర్ఎస్ పార్టీ గాని జిల్లా ఏర్పాటు చేస్తామని ఎలాంటి వాగ్థానం చేయలేదని మంత్రి కేటీఆర్ అన్నారు. అయినప్పటికీ సిరిసిల్ల జిల్లా కేంద్రాన్ని చేయాలని ఎంపీ వినోద్, ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్తో కలిసి సీఎం కేసీఆర్ను కోరామన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన కొత్త జిల్లాల ముసాయిదాలో సిరిసిల్ల జిల్లా లేకపోవడం ప్రజలను నిరుత్సాహానికి గురి చేసిన మాట వాస్తవమేనని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు. కానీ, ప్రభుత్వం వాస్తవిక అంశాలను పరిగణలోకి తీసుకున్న నిర్ణయం వల్ల సిరిసిల్ల జిల్లా ఏర్పాటు కుదరలేదని దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని నియోజకవర్గ శాసనసభ్యునిగా కోరుతున్నానన్నారు.
సిరిసిల్ల నియోజకవర్గానికి తాను చేస్తున్న అభివృద్ధిని అడ్డుకునేందుకు కొంతమంది కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలతో తనకున్న అనుబంధాన్ని దెబ్బతీయలేరన్నారు. కొత్త జిల్లాల ప్రతిపాదనలు తెచ్చినపుడు కొడుక్కో జిల్లా, బిడ్డకో జిల్లా, అల్లుడికో జిల్లా అంటూ చేసిన విమర్శలను ప్రజలు గుర్తించాలన్నారు. సిరిసిల్లలో ప్రస్తుతమున్న అన్ని కార్యాలయాలు కొనసాగుతాయని...మరిన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేస్తామని కేటీఆర్ తెలిపారు. రాజకీయాల్లో ఉన్నంత కాలం సిరిసిల్లలోనే కొనసాగుతానని, పట్టణ రుణాన్ని అభివృద్ధి ద్వారా తీర్చుకుంటానన్నారు. రెండేళ్లలో సోదరుడిగా చేసిన అభివృద్ధిని మీరంతా చూశారని...రాబోయే మూడేళ్లలో అగ్రశ్రేణి నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కలిసి నడుద్దామని కేటీఆర్ లేఖలో కోరారు.
Advertisement
Advertisement