24 జిల్లాలకు ఓకే | Okay to 24 new districts in Telangana state | Sakshi
Sakshi News home page

24 జిల్లాలకు ఓకే

Published Tue, Jun 21 2016 3:04 AM | Last Updated on Tue, Nov 6 2018 4:04 PM

24 జిల్లాలకు ఓకే - Sakshi

24 జిల్లాలకు ఓకే

- సూచనప్రాయంగా ఆమోదం తెలిపిన ప్రభుత్వం
- జాబితాలో కొత్తగా సిరిసిల్ల జిల్లా  సీఎం నిర్ణయం మేరకు తుది సంఖ్య
- కొత్త జిల్లాలు, ఉద్యోగులు, ఆఫీసుల ఏర్పాటుపై కలెక్టర్లతో సీఎస్ భేటీ
-  కొత్త మండలాల ప్రతిపాదనలకు కట్టడి
-  తగిన కారణాలుంటేనే ఏర్పాటు చేయాలని సూచన
-  50-60కి పరిమితం కానున్న కొత్త మండలాలు
-  ఒక్కో జిల్లాకు రూ. 80 కోట్లు అవసరం
-  జిల్లాకు సగటున 1,100 మంది ఉద్యోగులు
-  ఇప్పటికిప్పుడు కొత్త ఉద్యోగులను ఇవ్వలేం
-   ఉన్న సిబ్బందితోనే సర్దుబాటు చేయాలన్న సీఎస్

 
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 14 కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం సూచనప్రాయంగా ఆమోదం తెలిపింది. ఇప్పటికే సిద్ధం చేసిన ముసాయిదా జాబితాలోని 23 జిల్లాలకు అదనంగా సిరిసిల్లను కొత్త జిల్లాగా ఏర్పాటు చేసే ప్రతిపాదనను జోడించింది. మొత్తంగా 24 జిల్లాలతో తుది ముసాయిదాను రూపొందించింది. వీటన్నింటా పాలనాపరమైన సన్నాహాలు ముమ్మరం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. దసరా నాటికి కొత్త జిల్లా కేంద్రాల నుంచి పరిపాలన ప్రారంభించేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. సోమవారం సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
 
 రాష్ట్ర భూపరిపాలన విభాగం ప్రధాన కమిషనర్ రేమండ్ పీటర్, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి బి.ఆర్.మీనా, సీఎంవో అధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు. కొత్త జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్లు, తాత్కాలికంగా ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు, అవసరమైన మౌలిక వసతులు, ఉద్యోగుల కేటాయింపు అంశాలపైనే ఇందులో ప్రధానంగా చర్చించారు. కొత్త జిల్లాలు, కొత్త డివిజన్లు, కొత్త మండలాలపై తమ ప్రతిపాదనలు, నివేదికలను ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్లు సీఎస్‌కు సమర్పించారు. కొత్త జిల్లాల్లో మండలాలు, వాటి భౌగోళిక స్వరూపంతో నమూనా మ్యాప్‌లను ప్రదర్శించారు. వీటితో పాటు ప్రతిపాదిత జిల్లా కేంద్రాల్లో అందుబాటులో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ ఉద్యోగుల అవసరాలపై సీసీఎల్‌ఏ కోరిన నివేదికను అందజేశారు.
 
 కొత్త మండలాలు ఎక్కువగా వద్దు
పునర్‌వ్యవస్థీకరణ ప్రక్రియలో ఎక్కువగా కొత్త మండలాల ఏర్పాటు అవసరం లేదని, తప్పనిసరిగా అవసరమనుకున్న చోటనే కొత్తవి ప్రతిపాదించాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా 50 నుంచి 60 మండలాల ఏర్పాటు చేయాల్సి వస్తుందని అంచనా వేశారు. హైదరాబాద్‌లో 3 లక్షల జనాభాకు ఒక మండలం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనపై చర్చించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నట్లుగా రోజువారీ రెవెన్యూ కార్యకలాపాలు ఇక్కడ లేనందున.. నగరంలో అంతకు మించి కొత్త మండలాల ప్రతిపాదనలు అక్కర్లేదని నిర్ణయించారు. జిల్లాల్లోనూ కొత్త మండలాలను ప్రతిపాదించేటప్పుడు.. అందుకు తగిన కారణాలను తప్పనిసరిగా విశ్లేషించాలని సీఎస్ కలెక్టర్లకు సూచించారు. పెరిగిన జనాభా కారణమా? పరిధి ఎక్కువగా ఉందా? ప్రజలకు అందుబాటులో లేదా? ప్రజా ప్రతినిధులు, ప్రజల నుంచి డిమాండ్ ఉందా? అనే కోణంలో తగిన కారణం చూపించాలన్నారు. దీంతో ముసాయిదాలో ఉన్న 74 కొత్త మండలాల సంఖ్య 50-60కి  పరిమితమయ్యే అవకాశముంది.
 
 ఉద్యోగుల పంపిణీపై హైపవర్ కమిటీ
 కొత్త జిల్లాలకు అవసరమైన ఉద్యోగుల పంపిణీపై దృష్టి సారించాలని సీఎస్ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగుల పంపిణీపై మార్గదర్శకాలను ఖరారు చేసేందుకు ఉన్నతాధికారులతో హైపవర్ కమిటీ వేయాలని నిర్ణయం తీసుకున్నారు. శాఖల వారీగా జిల్లా యూనిట్లపై చర్చించేందుకు అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, హెచ్‌వోడీలతో వారం రోజుల్లోగా సమావేశం ఏర్పాటు చేయనున్నారు.
 
 కొత్త ఉద్యోగులు సాధ్యం కాదు
 కొత్త జిల్లాలకు అవసరమయ్యే ఉద్యోగులను ఇప్పటికిప్పుడు అదనంగా ఇవ్వడం సాధ్యం కాదని ప్రభుత్వం కలెక్టర్లకు తేల్చి చెప్పింది. వీలైనంత మేరకు ఉన్న ఉద్యోగులనే సర్దుబాటు చేసుకోవాలని సూచించింది. ఇప్పుడున్న జిల్లా రెండు జిల్లాలుగా విభజిస్తే అక్కడికక్కడే ఉద్యోగులను కేటాయించుకొని.. సర్దుబాటు చేయాలని ఆదేశించింది. మూడు జిల్లాలుగా విభజించిన చోట అవసరమైతే అదనంగా కొత్త ఉద్యోగులను కేటాయిస్తామని తెలిపింది. మెప్మా, ఐకేపీ, డ్వామా, డీఆర్‌డీఏ పరిధిలో అక్కర లేకున్నా పని చేస్తున్న ఉద్యోగులను సర్దుబాటు చేయాల్సి ఉంటుందని సూచించింది. వివిధ శాఖలతో పాటు ఆర్టీసీ తదితర విభాగాల విభజనపైనా చర్చ జరిగింది.
 
 ఒక్కో జిల్లాకు రూ.80 కోట్లు
 కలెక్టర్లు ఇచ్చిన నివేదికల ప్రకారం కొత్త జిల్లాల ఏర్పాటుకు సగటున ఒక్కో జిల్లాకు రూ.80 కోట్ల నుంచి రూ.100 కోట్లు అవసరం. ఒక్కో జిల్లాకు సగటున 1,100 మంది నుంచి 1,300 మంది ఉద్యోగులు అవసరమవుతారని లెక్కలేశారు. వీలైనంత మేరకు అందుబాటులో ఉన్న డివిజన్ స్థాయి కార్యాలయాలు, ప్రభుత్వ బంగ్లాలనే జిల్లా కార్యాలయాలుగా మార్చుకోవాలని, అవి సరిపోని పక్షంలోనే అద్దె భవనాలు ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. కొత్త కలెక్టరేట్ల నిర్మాణానికి అవసరమైన స్థలాలతో పాటు నమూనాలపై సమావేశంలో చర్చ జరిగింది. జిల్లాల పునర్విభజన సందర్భంగా అన్ని శాఖలు రికార్డులు భద్రపరచటంలో జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్లకు సీఎస్, సీసీఎల్‌ఏ సూచించారు. రికార్డుల తరలింపు, భద్రపరచడం కీలకంగా గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాల పునర్విభజనకు సంబంధించిన చట్టం, నోటిఫికేషన్ జారీ చేసిన మార్గదర్శకాలున్న ప్రతులను ఈ సందర్భంగా అన్ని జిల్లాల కలెక్టర్లకు అందించారు. న్యాయపరమైన చిక్కులేమీ లేకుండా చట్టాన్ని అధ్యయనం చేసి విధివిధానాలను పాటించాలని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
 
 అనంతగిరిలో రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్!

 హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పునర్విభజనపై తుది కసరత్తు పూర్తి కాలేదని అధికారులు చెబుతున్నప్పటికీ.. ఇప్పటికే ప్రభుత్వం తయారు చేసిన ముసాయిదాలో హైదరాబాద్, సికింద్రాబాద్, వికారాబాద్ కేంద్రంగా రంగారెడ్డి జిల్లాలను ఏర్పాటు చేసే ప్రతిపాదనలున్నాయి. అదే కోణంలో ఏర్పాట్లు వేగం పుంజుకున్నాయి. వికారాబాద్ సమీపంలోని అనంతగిరిలోని టీబీ శానిటోరియంలో తాత్కాలికంగా రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. సీఎం తీసుకునే తుది నిర్ణయం మేరకే జిల్లాల సంఖ్య ఆధారపడి ఉంటుందని సీఎస్ రాజీవ్‌శర్మ అభిప్రాయపడ్డారు.
 
 మారిన మండలాలు
 పాత ముసాయిదాతో పోలిస్తే కొత్త జిల్లాల్లో చేర్చే మండలాలు కొన్ని అటుదిటుగా మారిపోయాయి. ప్రధానంగా కరీంనగర్ జిల్లాలో గతంలో ఉన్న జగిత్యాల, కరీంనగర్ జిల్లాలకు అదనంగా సిరిసిల్లను జిల్లాగా ప్రతిపాదించటంతో మండలాలు మారిపోయాయి. ఉదాహరణకు గతంలో సిద్దిపేట జిల్లాలో ప్రతిపాదించిన ఇల్లంతకుంట మండలాన్ని ఇప్పుడు సిరిసిల్లలో చేర్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement