- జిల్లాలో రేషన్ కార్డుల తొలగింపు
- సిక్స్‌స్టెప్స్ వ్యాల్యుడేషన్ అమలు
- రద్దయిన కార్డులు: 87, 302
- ప్రభుత్వ తీరుపై కార్డుదారుల ఆగ్రహం
-
కర్నూలుకు చెందిన తొగర్చేడు బషీర్‌బాషాకు షాపు నంబరు 122లో రేషన్ కార్డు వచ్చింది. ఐడీ ఆర్‌సీ నంబర్ 5521512237031. ఇతను ఒక్క నెల కూడా సరుకులు తీసుకోలేదు. ఆధార్ కార్డు ఫోర్ వీలర్‌కు లింక్ అయిందనే కారణంతో కార్డు తొలగించారు.
-
కర్నూలుకు చెందిన పి.పార్వతమ్మ దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నారు. రేషన్ కార్డు కోసం ఎన్నో తిప్పలు పడగా.. జన్మభూమిలో ఎట్టకేలకు వచ్చింది. షాపు నంబర్ 21లో ఈమె కార్డు ఉంది. ఐడీ ఆర్‌సీ నంబరు 5521512243544. అయితే.. ఈమె ఆస్తి పన్ను కడుతున్నారనే ఉద్దేశంతో కార్డుపై వేటు వేశారు.
వీరిద్దరే కాదు.. జిల్లాలో ఏకంగా 87,302 మంది రేషన్‌కార్డులను ప్రభుత్వం రద్దు చేసింది.
కర్నూలు (అగ్రికల్చర్): జన్మభూమి కార్యక్రమంలో పంపిణీ చేసిన రేషన్ కార్డులపై ప్రభుత్వం గుట్టుచప్పుడు కాకుండా అనర్హత వేటు వేస్తోంది. ఒక చేత్తో కొత్త కార్డులు మంజూరు చేసి..మరో చేత్తో రద్దు చేయడం విమర్శలకు తావిస్తోంది. ఈ ఏడాది జనవరిలో జిల్లాకు 87,302 కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసింది. కార్డులు వచ్చిన కుటుంబాలు ఎంతో సంతోషించాయి. అయితే.. ఆ ఆనందం కొన్ని రోజులకే పరిమితమైంది. ప్రజా సాధికార సర్వే ఆధారంగా సిక్స్ స్టెప్స్ వ్యాల్యుడేషన్ పేరుతో ఏకంగా 17,756 కార్డులకు మంగళం పలికింది.
ఒక్క నెల కూడా రేషన్ తీసుకోని కార్డులపై అనర్హత వేటు వేసింది. మొదట్లో 3,842 కార్డులను రద్దు చేయగా.. తాజాగా ఆ సంఖ్య 17,756కు పెరిగింది. వేలాది కార్డులను రద్దు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జనవరి నుంచే ప్రభుత్వం ప్రజాసాధికార సర్వేను అమల్లోకి తీసుకొచ్చింది. నేడు అన్నింటికీ ఆధార్‌ను అనుసంధానం చేస్తున్నారు. సర్వే వివరాలు, ఆధార్ అనుసంధానం అనంతరం రేషన్ కార్డుల కోతను కొనసాగిస్తోంది. ఒక్క కర్నూలు నగరంలోనే 875 కార్డులను తొలగించింది.
సిక్స్ స్టెప్స్ వ్యాల్యుడేషన్ అంటే ..
రేషన్ కార్డులను అడ్డగోలుగా కోత కోసేందుకు ప్రభుత్వం ప్రజాసాధికార సర్వేలోని ఆరు నిబంధనలను అమలులోకి తీసుకొచ్చింది. వీటినే సిక్స్ స్టెప్స్ వ్యాల్యుడేషన్ అంటారు.
– 5ఎకరాల మెట్ట, 2.50 ఎకరాల తరి భూమి ఉన్న రైతులు రేషన్ కార్డులకు దూరం కావాల్సిందే.
– 350 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇల్లు ఉండి, ఆస్తి పన్ను చెల్లించే వారు రేషన్ కార్డులకు అనర్హులు.
– ఆధార్ నంబరుతో కార్లు, ఇతర నాలుగు చక్రాల వాహనాలకు అనుసంధానం అయ్యి ఉంటే కార్డు కోల్పోవాల్సిందే.
– విద్యుత్ బిల్లులు ప్రతి నెలా రూ.150 కంటే ఎక్కువ చెల్లిస్తున్న వారు అనర్హులు.
– అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులతో సహా ప్రభుత్వ ఉద్యోగులు రేషన్ కార్డులకు అర్హులు కాదు.
– అర్బన్ ప్రాంతాల్లో రూ.75 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.60 వేలు వార్షికాదాయం కలిగిన వారికి రేషన్ కార్డు దక్కదు.
రుజువులు చూపిస్తే పునరుద్ధరణ: సుబ్రమణ్యం, జిల్లా పౌరసరఫరాల అధికారి (డీఎస్‌ఓ)
సిక్స్ స్టెప్స్ వ్యాల్యుడేషన్ కింద ప్రభుత్వం రేషన్ కార్డులపై అనర్హత వేటు వేస్తోంది. వీరు దారిద్ర్య రేఖకు పైన ఉన్నవారుగా భావిస్తోంది. అనర్హతకు గురైన కార్డుదారులు తాము దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నట్లు నిరూపించుకోవాలి. ఉదాహరణకు.. ఫోర్‌వీలర్ ఉందనే కారణంతో కార్డుపై అనర్హత వేటు పడి ఉంటే.. అలాంటి వారు కారు లేదని నిరూపించుకోవాలి. ఇలా తగిన రుజువులు సమర్పిస్తే కార్డులను ప్రభుత్వం పునరుద్ధరిస్తోంది. సిక్స్ స్టెప్స్ వ్యాల్యుడేషన్ ద్వారా అనర్హత వేటు వేసే కార్యక్రమంతో జిల్లా యంత్రాంగానికి సంబంధం లేదు.