Invalid
-
ఆ మంత్రికి హైకోర్టు షాక్..
అహ్మదాబాద్ : గుజరాత్లో పాలక బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొంది మంత్రిగా బాధ్యతలు చేపట్టిన బీజేపీ ఎమ్మెల్యే భూపేంద్రసింగ్ చుడాసమా ఎన్నిక చెల్లదని గుజరాత్ హైకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికల ఓట్ల లెక్కింపులో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఆయన ఎన్నిక చట్టవిరుద్ధమని, అది చెల్లదని హైకోర్టు పేర్కొంది. 429 పోస్టల్ బ్యాలెట్ ఓట్లను అక్రమంగా రద్దు చేశారని ఆయన ప్రత్యర్ధి అశ్విన్ రాథోడ్ వాదనను సమర్ధిస్తూ హైకోర్టు జడ్జి జస్టిస్ పరేష్ ఉపాథ్యాయ్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. అహ్మదాబాద్ జిల్లాలోని డోక్లా నియోజకవర్గం నుంచి భూపేందర్ సింగ్ చుడాసమ 327 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో గెలుపొందారు. చదవండి : శ్రామిక్ రైలులో ఆగిన గుండె -
పాస్‌పోర్టులు.. ఇక అందుకు పనికిరావు
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ పాస్‌పోర్టుల జారీ విషయంలో కొత్త నిర్ణయం తీసుకుంది. ఇకపై పాస్‌పోర్టు చివరి పేజీలో చిరునామా వివరాలను పొందుపరచకుండా ఖాళీగా వదిలేయాలని నిర్ణయించింది. అది అమలులోకి వస్తే గనుక పాస్‌పోర్టులు ఇక అడ్రస్ ప్రూఫ్‌లుగా పనికి రావు. ఈ మేరకు విదేశాంగ శాఖ అధికారికంగా స్పందించకపోయినా.. సంబంధిత శాఖ అధికారుల నుంచి స్పష్టమైన సంకేతాలు అందుతున్నాయి. త్వరలో ఈ నిర్ణయం అమలు చేయబోతున్నట్లు ఎంఏఈ అధికారి సురేంద్ర కుమార్(న్యాయ విభాగం) ఓ జాతీయ మీడియా ఛానెల్ తో చెప్పారు. వచ్చే దఫా నుంచి జారీ చేయబోయే పాస్‌పోర్టుల నుంచే ఈ నిర్ణయం అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. పాతవి గడువు ముగిసేవరకు వినియోగించుకోవచ్చని.. రెన్యువల్ సమయంలో వాటికి ఈ మార్పులు వర్తిస్తాయని ఆయన వెల్లడించారు. ఇక పాస్‌పోర్టు విధానంలో మార్పులు రాబోతున్నాయన్న విషయాన్ని పుణే ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి జేడీ వైశంపయన్ కూడా దృవీకరించారు. ప్రస్తుతం పాస్‌పోర్టు మొదటి పేజీలో ఫోటోతో కూడిన వివరాలు.. చివరి పేజీలో చిరునామా వివరాలు పేర్కొంటున్న విషయం తెలిసిందే. ఇక పాస్‌పోర్టు రంగును కూడా మార్చే ఉద్దేశంలో కూడా ఎంఈఏ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వాధికారులు, అధికారిక పనుల మీద విదేశాలకు వెళ్లేవారికి తెలుపు రంగు, దౌత్యవేత్తలకు ఎరుపు, మిగతా వారికి నీలి రంగు పాస్‌పోర్టులు జారీ చేయనున్నారని సమాచారం. -
‘ఆరు’విధాల కోత
- జిల్లాలో రేషన్ కార్డుల తొలగింపు - సిక్స్స్టెప్స్ వ్యాల్యుడేషన్ అమలు - రద్దయిన కార్డులు: 87, 302 - ప్రభుత్వ తీరుపై కార్డుదారుల ఆగ్రహం కర్నూలుకు చెందిన తొగర్చేడు బషీర్బాషాకు షాపు నంబరు 122లో రేషన్ కార్డు వచ్చింది. ఐడీ ఆర్సీ నంబర్ 5521512237031. ఇతను ఒక్క నెల కూడా సరుకులు తీసుకోలేదు. ఆధార్ కార్డు ఫోర్ వీలర్‌కు లింక్ అయిందనే కారణంతో కార్డు తొలగించారు. కర్నూలుకు చెందిన పి.పార్వతమ్మ దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నారు. రేషన్ కార్డు కోసం ఎన్నో తిప్పలు పడగా.. జన్మభూమిలో ఎట్టకేలకు వచ్చింది. షాపు నంబర్ 21లో ఈమె కార్డు ఉంది. ఐడీ ఆర్సీ నంబరు 5521512243544. అయితే.. ఈమె ఆస్తి పన్ను కడుతున్నారనే ఉద్దేశంతో కార్డుపై వేటు వేశారు. వీరిద్దరే కాదు.. జిల్లాలో ఏకంగా 87,302 మంది రేషన్‌కార్డులను ప్రభుత్వం రద్దు చేసింది. కర్నూలు (అగ్రికల్చర్): జన్మభూమి కార్యక్రమంలో పంపిణీ చేసిన రేషన్ కార్డులపై ప్రభుత్వం గుట్టుచప్పుడు కాకుండా అనర్హత వేటు వేస్తోంది. ఒక చేత్తో కొత్త కార్డులు మంజూరు చేసి..మరో చేత్తో రద్దు చేయడం విమర్శలకు తావిస్తోంది. ఈ ఏడాది జనవరిలో జిల్లాకు 87,302 కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసింది. కార్డులు వచ్చిన కుటుంబాలు ఎంతో సంతోషించాయి. అయితే.. ఆ ఆనందం కొన్ని రోజులకే పరిమితమైంది. ప్రజా సాధికార సర్వే ఆధారంగా సిక్స్ స్టెప్స్ వ్యాల్యుడేషన్ పేరుతో ఏకంగా 17,756 కార్డులకు మంగళం పలికింది. ఒక్క నెల కూడా రేషన్ తీసుకోని కార్డులపై అనర్హత వేటు వేసింది. మొదట్లో 3,842 కార్డులను రద్దు చేయగా.. తాజాగా ఆ సంఖ్య 17,756కు పెరిగింది. వేలాది కార్డులను రద్దు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జనవరి నుంచే ప్రభుత్వం ప్రజాసాధికార సర్వేను అమల్లోకి తీసుకొచ్చింది. నేడు అన్నింటికీ ఆధార్‌ను అనుసంధానం చేస్తున్నారు. సర్వే వివరాలు, ఆధార్ అనుసంధానం అనంతరం రేషన్ కార్డుల కోతను కొనసాగిస్తోంది. ఒక్క కర్నూలు నగరంలోనే 875 కార్డులను తొలగించింది. సిక్స్ స్టెప్స్ వ్యాల్యుడేషన్ అంటే .. రేషన్ కార్డులను అడ్డగోలుగా కోత కోసేందుకు ప్రభుత్వం ప్రజాసాధికార సర్వేలోని ఆరు నిబంధనలను అమలులోకి తీసుకొచ్చింది. వీటినే సిక్స్ స్టెప్స్ వ్యాల్యుడేషన్ అంటారు. – 5ఎకరాల మెట్ట, 2.50 ఎకరాల తరి భూమి ఉన్న రైతులు రేషన్ కార్డులకు దూరం కావాల్సిందే. – 350 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇల్లు ఉండి, ఆస్తి పన్ను చెల్లించే వారు రేషన్ కార్డులకు అనర్హులు. – ఆధార్ నంబరుతో కార్లు, ఇతర నాలుగు చక్రాల వాహనాలకు అనుసంధానం అయ్యి ఉంటే కార్డు కోల్పోవాల్సిందే. – విద్యుత్ బిల్లులు ప్రతి నెలా రూ.150 కంటే ఎక్కువ చెల్లిస్తున్న వారు అనర్హులు. – అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులతో సహా ప్రభుత్వ ఉద్యోగులు రేషన్ కార్డులకు అర్హులు కాదు. – అర్బన్ ప్రాంతాల్లో రూ.75 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.60 వేలు వార్షికాదాయం కలిగిన వారికి రేషన్ కార్డు దక్కదు. రుజువులు చూపిస్తే పునరుద్ధరణ: సుబ్రమణ్యం, జిల్లా పౌరసరఫరాల అధికారి (డీఎస్ఓ) సిక్స్ స్టెప్స్ వ్యాల్యుడేషన్ కింద ప్రభుత్వం రేషన్ కార్డులపై అనర్హత వేటు వేస్తోంది. వీరు దారిద్ర్య రేఖకు పైన ఉన్నవారుగా భావిస్తోంది. అనర్హతకు గురైన కార్డుదారులు తాము దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నట్లు నిరూపించుకోవాలి. ఉదాహరణకు.. ఫోర్‌వీలర్ ఉందనే కారణంతో కార్డుపై అనర్హత వేటు పడి ఉంటే.. అలాంటి వారు కారు లేదని నిరూపించుకోవాలి. ఇలా తగిన రుజువులు సమర్పిస్తే కార్డులను ప్రభుత్వం పునరుద్ధరిస్తోంది. సిక్స్ స్టెప్స్ వ్యాల్యుడేషన్ ద్వారా అనర్హత వేటు వేసే కార్యక్రమంతో జిల్లా యంత్రాంగానికి సంబంధం లేదు. -
సమాచార కమిషనర్ల నియామకం చెల్లదు
హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీం ధర్మాసనం సాక్షి, న్యూఢిల్లీ: నిబంధనలకు విరుద్ధంగా నియమితులైనందున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నలుగురు సమాచార కమిషనర్ల నియామకం చెల్లదని హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. సమాచార కమిషనర్లుగా డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు, లాం తాంతియాకుమారి, ఎస్.ఇంతియాజ్ అహ్మద్, ఎం.విజయనిర్మల నియామకం చెల్లదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఈ నలుగురు సుప్రీం కోర్టును ఆశ్రయించగా 2013 అక్టోబర్‌లో స్టే ఇచ్చిన సుప్రీం కోర్టు.. తాజాగా గురువారం జరిగిన తుది విచారణలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జె.ఎస్.ఖేహర్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌ను తోసిపుచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 06.02.2013న ఈ నలుగురు సమాచార కమిషనర్ల నియామకానికి సంబంధించి జీవోనంబరు 75ను ప్రభుత్వం విడుదల చేసింది. అయితే ఈ నియామకాన్ని సవాలు చేస్తూ హోం శాఖ మాజీ కార్యదర్శి పద్మనాభయ్య, మాజీ ఐఎఫ్ఎస్ అధికారి పద్మనాభరెడ్డి, రావు చెలికాని 25 మార్చి 2013న హైకోర్టులో ఒక ప్రజాహిత వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. అఫిడవిట్లు మాత్రమే.. ఆధారాలు లేవు ‘‘31 జనవరి 2012న ఈ నియామకాలకు సంబంధించి ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత, ఉప ముఖ్యమంత్రితో కూడిన కమిటీ సమా వేశమై సమాచార కమిషనర్లుగా నియమించేం దుకు 8 పేర్లతో గవర్నర్‌కు ప్రతిపాదన పంపింది. ఈ 8 పేర్లలో నలుగురి పేర్లను గవర్నర్ ఆమోదించారు. సి.మధుకర్‌రాజు, ఎస్.ప్రభాకర్‌రెడ్డి, పి.విజయ్‌బాబు, ఎం.రతన్ŒS ల పేర్లను ఆమోదించిన గవర్నర్... డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు, తాంతియాకుమారి, ఎస్.ఇంతియాజ్ అహ్మద్, ఎం.విజయనిర్మల పేర్లను తిరస్కరించారు. కమిటీ రెండోసారి సమావేశమై ఈ నిర్ణయాన్ని పునః సమీక్షించకుండా అవే పేర్లను తిరిగి పంపించింది. ఈ నేపథ్యంలో 2013 ఫిబ్రవరి 6న వీరి నియామకంపై ప్రభుత్వం జీవో వెలువరించింది.. అయితే ఈ నలుగురు తమ తమ రాజకీయ పార్టీలకు రాజీనామా చేసినట్టు ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం అఫిడవిట్లో తమకు ఏ పార్టీతో సంబంధం లేదని పేర్కొన్నారు. అలాగే బార్ కౌన్సిల్ నుంచి ఐదేళ్ల పాటు సభ్యత్వ సస్పెన్షన్ లేఖ తెచ్చుకోలేదు. ఈ కారణాల రీత్యా వీరి నియామకాలను రద్దు చేయాలి..’’ అని వారు పిటిషన్లో కోరారు. -
సస్పెండ్ చేసే అధికారం మండల శాఖలకు లేదు
టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రవీందర్రావు హన్మకొండ : టీఆర్ఎస్ నేతల విషయం లో మండల శాఖలు తీసుకునే సస్పెన్షన్ల నిర్ణయాలు చెల్లవని పార్టీ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్రావు తెలిపారు. టీఆర్ఎస్ నియమావళి ప్రకారం నాయకులను పార్టీ నుంచి సస్పెండ్ చేసే అధికారం మండల శాఖలకు లేదని స్పష్టం చేశారు. పార్టీ నేతలపై ఆరోపణలు, వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఈ సమాచారాన్ని టీఆర్ఎస్ జిల్లా శాఖకు తెలియజేయాలని... అన్నింటినీ పరిశీలించి జిల్లా స్థాయిలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఇలా కాకుండా మండల స్థాయిలో పార్టీ అధ్యక్షులు తీసుకుంటున్న సస్పెన్షన్ నిర్ణయాలు చెల్లుబాటుకావని పేర్కొన్నారు. టీఆర్ఎస్ జిల్లా శాఖతో సంబంధం లేకుండా సస్పెన్షన్ నిర్ణయాలు తీసుకుంటే తీవ్రంగా పరిగణిస్తామని మండల పార్టీ అధ్యక్షులను ఈ సందర్భంగా ఆయ న హెచ్చరించారు. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం జఫర్‌గఢ్ మండల టీఆర్ఎస్ శాఖ గాదెపాక అయోధ్యను, రఘునాథపల్లి మండల శాఖ బానోతు భిక్షపతిని, లింగాలఘనపురం మండల శాఖ ఏదునూరి వీరయ్యను సస్పెండ్ చేసినట్లు ఇటీవల ప్రకటించాయని... ఈ నిర్ణయాలు చెల్లుబాటు కావని ఆయన తెలిపారు. ఈ ముగ్గురు నేతలు టీఆర్ఎస్ సభ్యులుగానే ఉంటారని శనివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో రవీందర్రావు వివరించారు.