సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ పాస్‌పోర్టుల జారీ విషయంలో కొత్త నిర్ణయం తీసుకుంది. ఇకపై పాస్‌పోర్టు చివరి పేజీలో చిరునామా వివరాలను పొందుపరచకుండా ఖాళీగా వదిలేయాలని నిర్ణయించింది. అది అమలులోకి వస్తే గనుక పాస్‌పోర్టులు ఇక అడ్రస్ ప్రూఫ్‌లుగా పనికి రావు. ఈ మేరకు విదేశాంగ శాఖ అధికారికంగా స్పందించకపోయినా.. సంబంధిత శాఖ అధికారుల నుంచి స్పష్టమైన సంకేతాలు అందుతున్నాయి.
త్వరలో ఈ నిర్ణయం అమలు చేయబోతున్నట్లు ఎంఏఈ అధికారి సురేంద్ర కుమార్(న్యాయ విభాగం) ఓ జాతీయ మీడియా ఛానెల్ తో చెప్పారు. వచ్చే దఫా నుంచి జారీ చేయబోయే పాస్‌పోర్టుల నుంచే ఈ నిర్ణయం అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. పాతవి గడువు ముగిసేవరకు వినియోగించుకోవచ్చని.. రెన్యువల్ సమయంలో వాటికి ఈ మార్పులు వర్తిస్తాయని ఆయన వెల్లడించారు.
ఇక పాస్‌పోర్టు విధానంలో మార్పులు రాబోతున్నాయన్న విషయాన్ని పుణే ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి జేడీ వైశంపయన్ కూడా దృవీకరించారు. ప్రస్తుతం పాస్‌పోర్టు మొదటి పేజీలో ఫోటోతో కూడిన వివరాలు.. చివరి పేజీలో చిరునామా వివరాలు పేర్కొంటున్న విషయం తెలిసిందే. ఇక పాస్‌పోర్టు రంగును కూడా మార్చే ఉద్దేశంలో కూడా ఎంఈఏ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వాధికారులు, అధికారిక పనుల మీద విదేశాలకు వెళ్లేవారికి తెలుపు రంగు, దౌత్యవేత్తలకు ఎరుపు, మిగతా వారికి నీలి రంగు పాస్‌పోర్టులు జారీ చేయనున్నారని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment