నిందితుడిని చూపిస్తున్న ఎస్‌ఓటీ పోలీసులు
సాక్షి, సిటీబ్యూరో: నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్, ఆలిండియా యాంటీ కరెప్షన్ కమిషన్, అభయబీ4యూ ఛానల్స్ న్యూస్ ఇన్‌చార్జ్, సీఐడీ డీఎస్పీ... ఇన్ని అవతారాలు ఎత్తి భారీ మోసానికి కుట్న పన్నిన ఓ వ్యక్తిని సైబరాబాద్ ఈస్ట్ పరిధిలోని మల్కాజిగిరి ఎస్‌ఓటీ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడానికి చెందిన ఎంవీఎల్ నాగేశ్వరరావు మల్కాజిగిరిలోని శివపురికాలనీలో స్థిరపడ్డాడు. రూ.5 వేలు వెచ్చించి న్యూఢిల్లీలో నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్, ఆలిండియా యాంటీ కరెప్షన్ కమిషన్ పేర్లతో రెండు సంస్థల్ని ఎన్‌జీఓల పేరుతో రిజిస్టర్ చేయించాడు.
వీటి ద్వారా వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పించడం, అధికారుల అవినీతిపై ప్రచారం చేస్తామని దరఖాస్తుల్లో పేర్కొన్నారు. ఆ రెండు సంస్థలకూ తానే జాతీయ అధ్యక్షుడిగా ప్రచారం చేసుకున్న నాగేశ్వరరావు రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి పోస్టులు ఇస్తానంటూ రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలువురికి ఎర వేశాడు. సాధారణ సభ్యత్వానికి రూ.1500 ధర నిర్ణయించాడు. తన సంస్థల్లో రెండేళ్ల కాలపరిమితో ఉండే వివిధ హోదాల్లో పోస్టులు ఇవ్వడానికి రూ.30 వేల నుంచి రూ.2 లక్షల వరకు రేట్లు నిర్ణయించాడు. ఇలా రెండు రాష్ట్రాల్లోనూ సభ్యుల్ని నియమించడం ద్వారా ప్రతి రెండేళ్లకూ రూ.5 కోట్లు చొప్పున దండుకోవాలని పథకం వేశాడు.
అలాగే యాంటీ కరెప్షన్ కమిషన్ పేరుతో ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించి డబ్బు దండుకోవాలని కుట్రపన్నాడు. దీంతో పాటు ‘తెలుగు ప్రపంచం’ పేరుతో మరో సంస్థను రిజిస్టర్ చేయించిన నాగేశ్వరరావు రెండు రాష్ట్రాల్లోనూ దుకాణాలు, వ్యాపార సంస్థలకు తెలుగు బోర్డులు ఏర్పాటు చేసే బాధ్యతల్ని ప్రభుత్వాలు తనకు ఇచ్చాయని ప్రచారం చేసుకున్నాడు. అలానే అలిండియా కన్జ్యూమర్ రైట్స్ పేరుతో మాస పత్రికను ముద్రించాలని రిజిస్ట్రేషన్ కూడా చేయించాడు. తన వద్ద సభ్యులుగా, వివిధ హోదాల్లో చేరిన వారికి తన రెండు సంస్థల పేర్లతో ఉన్న స్టిక్కర్లను రూ.500 నుంచి రూ.వెయ్యి వరకు విక్రయించే వాడు.
అభయ ఛానల్ న్యూస్ ఇన్ చార్జీ బీ4యూ న్యూస్ ఛానల్ హెడ్‌గా, ఫిల్మ్ అండ్ టెలివిజన్ డెవలప్‌మెంట్ బోర్డ్ కోశాధికారిగా, సీఐడీలో డీఎస్పీగా... ఇలా వివిధ రకాలైన నకిలీ ఐడీ కార్డులు తయారు చేసుకున్న నాగేశ్వరరావు వీటిని వినియోగించి బెదిరించడం ప్రారంభించాడు. ఇతడి వ్యవహారాలపై విశ్వసనీయ సమాచారం అందుకున్న మల్కాజిగిరి ఎస్‌ఓటీ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.