వేగవంతంగా స్మార్ట్ పల్స్ సర్వే
నెల్లూరు(పొగతోట): స్మార్ట్ పల్స్ సర్వేను వేగవంతంగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ ఆదేశించారు. కలెక్టరేట్లోని గ్రీవెన్స్ హాల్లో వివిధ శాఖల అధికారులు, సూపర్‌వైజర్లు, ఎన్యూమరేటర్లతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేసి నెలాఖరులోపు సర్వేను పూర్తి చేయాలని సూచించారు. నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో 2.6 లక్షల మందికి సంబంధించిన సర్వేను పూర్తి చేయాల్సి ఉందని, సర్వేపై నిత్యం సీఎం టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించి సమాచారాన్ని తెలుసుకుంటున్నారన్నారు. సర్వేను పూర్తి చేయడంలో నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సర్వేలో ఈకేవైసీ సమాచారాన్ని సేకరించాలని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో 95 శాతం సర్వే పూర్తయిందని, పట్టణ ప్రాంతాల్లో వంద శాతం పూర్తి చేయాలని సూచించారు. సర్వే పూర్తయ్యేంత వరకే సూపర్‌వైజర్లు, ఎన్యూమరేటర్లను రిలీవ్ చేశామని, సంబంధిత శాఖ అధికారులు దృష్టిలో ఉంచుకొని సిబ్బందిని ఒత్తిడి పెట్టవద్దని తెలిపారు. కార్పొరేషన్ కమిషనర్ వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.
పోలింగ్ కేంద్రాల వివరాలు ఆన్‌లైన్లో..
పోలింగ్ కేంద్రాల వివరాలను ఆన్‌లైన్లో పొందుపర్చేలా చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. గోల్డెన్ జూబ్లీ హాల్లో తహశీల్దార్లు, డీటీలు, కంప్యూటర్ ఆపరేటర్లకు నిర్వహించిన శిక్షణలో ఆయన మాట్లాడారు. పోలింగ్ కేంద్రానికి వెళ్లే దారి, కేంద్రంలో సిబ్బంది ఉండే తీరు, పోలింగ్ ప్రక్రియ, తదితర వివరాలను మ్యాప్‌ల ద్వారా ఆన్‌లైన్లో పొందుపర్చాలని సూచించారు. ఫొటోలతో ఓటర్ల జాబితాలను నియోజకవర్గాల వారీగా సిద్ధం చేయాలన్నారు. జాబితాలను సిద్ధం చేసి పోలింగ్ కేంద్రాల వద్ద ప్రచురించాలని తెలిపారు. అనంతరం పోలింగ్ కేంద్రాల మ్యాప్‌ల అప్‌లోడింగ్‌పై శిక్షణ ఇచ్చారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయ ప్రాజెక్ట్ మేనేజర్ చిరంజీవి, వివిధ మండలాల తహశీల్దార్లు, డీటీలు, కంప్యూటర్ ఆపరేటర్లు పాల్గొన్నారు.