నత్తనడక..
గుంటూరు రైల్వే డివిజనులో గుంటూరు– తెనాలి డబ్లింగ్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. 2014 అక్టోబరు నెలలో డబ్లింగ్ విద్యుద్దీకరణ పనులను రైల్వే వికాస్ నిగమ్ లిమిటెడ్ సంస్థ ప్రారంభించింది.
* గుంటూరు– తెనాలి రైల్వేట్రాకు డబ్లింగ్ పనులు ఆలస్యం
* భూసేకరణలో తీవ్ర జాప్యం
గుంటూరు (నగరంపాలెం): గుంటూరు రైల్వే డివిజనులో గుంటూరు–తెనాలి డబ్లింగ్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. 2014 అక్టోబరు నెలలో డబ్లింగ్ విద్యుద్దీకరణ పనులను రైల్వే వికాస్ నిగమ్ లిమిటెడ్ సంస్థ ప్రారంభించింది. ప్రాథమికంగా రూ.144 కోట్లతో ప్రారంభించిన పనులకు భూసేకరణ తీవ్ర అడ్డంకిగా మారింది. తెనాలి నుంచి గుంటూరు రైల్వేస్టేçÙన్ వరకు 25 కి.మీ. పొడవున్న ట్రాక్‌కు తెనాలి, గుంటూరు రెవెన్యూ డివిజనులో, నగరపాలక సంస్థ పరిధి మొత్తంలో సుమారు 20 ఎకరాల స్థలం సేకరించాల్సి ఉంది.
రైల్వేట్రాకు ఏర్పాటుకు సంగం జాగర్లమూడి వద్ద బకింగ్‌హామ్ కెనాల్ వద్ద, బుడంపాడు వద్ద గుంటూరు చానల్‌పై రెండు పెద్ద వంతెనలు, గుంటూరు డొంకరోడ్డులో మూడు వంతెనల వద్ద ఆర్‌యూబీ, 40 చిన్న వంతెనలు నిర్మించనున్నారు. ఇప్పటికి తెనాలి రైల్వేస్టేçÙన్ నుంచి నాలుగు కిలోమీటర్ల వరకు ఎర్త్ వర్కు, 30 వరకు చిన్న వంతెనల నిర్మాణం పూర్తి కావచ్చాయి. భూసేకరణ సమస్య కారణంగా అక్కడక్కడ కొద్దిగా ఎర్త్ పనులు చేశారు. కేంద్ర జల రవాణా సూచనల మేరకు డీపీఆర్‌లో ఉన్నదానికంటే బకింగ్‌హోమ్ కెనాల్ వద్ద ఏర్పాటు చేసే వంతెన 2.5 అడుగుల ఎత్తుపెంచాల్సి రావడంతో ట్రాక్ ఎలైన్‌మెంట్ మారి మరో నాలుగు కిలోమీటర్ల పొడవునా అదనంగా భూసేకరణ చెయ్యాల్సి వచ్చింది. బుడంపాడు, బకింగ్ హామ్ కెనాల్ వద్ద పెద్దవంతెనలు పిల్లర్ల దశకు చేరుకున్నాయి.
ఆర్‌యూబీ పనులు ప్రారంభం..
నగరంలో మూడు వంతెనల వద్ద ఆర్‌యూబీ నిర్మాణానికి అడ్డుగా ఉన్న నగరపాలకసంస్థ కాల్వను పక్కకు మార్చే పనులు రెండురోజుల క్రితం ప్రారంభమయ్యాయి. సర్వేయర్లు, రెవెన్యూ డివిజన్ అధికారులు ఇప్పటివరకు రాజధాని పనులు, కృష్ణా పుష్కరాల పనులలో మునిగిపోవడంతో భూసేకరణ పనులు సక్రమంగా కొనసాగలేదు. డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు ప్రకారం స్థలాల గుర్తింపు, మార్కింగ్, స్థల యజమానులకు ప్రకటన ఇవ్వడానికే రెండు సంవత్సరాల కాలం పట్టింది. మొదటి దశలో తెనాలి రెవెన్యూ డివిజను పరిధిలోని సుమారు ఆరు ఎకరాలకు మాత్రమే పరిహారం చెక్కులు సిద్ధం చేసినా పంపిణీ జరగలేదు. ఇక అదనంగా నాలుగు కిలోమీటర్లు భూసేకరణ చేయాల్సిన ప్రాంతంలో మార్కింగ్ మాత్రమే జరిగింది. పూర్తిస్థాయిలో భూమి అప్పగిస్తేనే పనులు వేగవంతం అయ్యే అవకాశం ఉందని పనులు నిర్వహిస్తున్న కాంట్రాక్టర్లు అభిప్రాయపడుతున్నారు.