ప్రభుత్వం సహకరించినా దక్కని ప్రాణాలు
► పాపం అంజయ్య..!
► ఇంప్లాంట్ వ్యాధితో మృతి
నిడమనూరు : జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి చొరవతో సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.16లక్షలు వైద్యం కోసం విడుదల చేసినా ఆ యువకుడి ప్రాణాలు నిలబడలేదు. మండలంలోని గారకుంటపాలెంకు చెందిన చింతపల్లి అంజయ్య(20) మూడు నెలలుగా ఇంప్లాంట్ ఎనిమా వ్యాధితో బాధపడుతూ బుధవారం మధ్యాహ్నం మృతి చెందాడు.
అసలేం జరిగిందంటే...
చింతపల్లి అంజయ్యది నిరుపేద కుటుంబం. అతనికి ఇంప్లాంట్ వ్యాధి సోకింది. జబ్బు నయం కావాలంటే అక్షరాల పదహారు లక్షల రూపాయలు ఖర్చవుతుందన్నారు. ఆ కుటుంబానికి అంత ఆర్థిక స్తోమత లేకపోవడంతో టీఆర్‌ఎస్ నాయకులు జొన్నటగడ్డ వెంకట్‌రెడ్డి, ఎంపీటీసీ నర్సింహగౌడ్ జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డికి పరిస్థితి వివరించారు. స్పందించి మంత్రి.. ముఖ్యమంత్రికి సిఫారసు చేసి సీఎం రిలీఫ్ ఫ్‌ండ్ నుంచి వైద్యఖర్చుల కోసం రూ.16లక్షలు మంజూరు చేయించారు. హైదరాబాద్‌లోని కిమ్స్‌లో ఈనెల 2వ తేదీన చికిత్స మొదలు పెట్టారు. వైద్యులు రెండు వారాల పాటు శస్త్ర చికిత్సలు చేశారు. అయినా అంజయ్య ఆరోగ్య పరిస్థితిలో మార్పు రాలేదు. పైగా పరిస్థితి విషమించడంతో వైద్యులు అతన్ని ఇంటికి తీసుకెళ్లమని సూచించారు. దీంతో అంజయ్యను కుటుంబ సభ్యులు ఈనెల 16న స్వగ్రామానికి తీసుకువచ్చారు.
మంత్రి చేసిన సాయానికి కృతజ్ఞతగా..
తన వైద్యఖర్చుల కోసం రూ.16 లక్షలు ఇప్పించిన మంత్రి జగదీశ్‌రెడ్డి సహాయానికి కృతజ్ఞతగా ఈనెల18న మంత్రి పుట్టిన రోజున అంజయ్య కేక్ కట్ చేశాడు. మూడు రోజులకే అంజయ్య మృతి చెందడంతో గ్రామంలో విషాదం అలుముకుంది.