త్వరలో నామినేటెడ్ పదవులు
♦ అసెంబ్లీ సమావేశాల తర్వాత భర్తీ: మంత్రి హరీశ్‌రావు
♦ పార్టీ కమిటీల నియామకాలపైనా దృష్టి
♦ నారాయణఖేడ్‌లో పోటీ చేస్తాం
♦ వారంలో ఉప ఎన్నికల నోటిఫికేషన్ రావొచ్చని వెల్లడి
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే నామినేటెడ్ పదవులను భర్తీ చేసేందుకు టీఆర్‌ఎస్ సిద్ధమవుతోంది. ఇప్పటికే మార్కెట్ కమిటీల రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి చేయడంతో ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు తమ ప్రతిపాదనలను మంత్రి హరీశ్‌రావుకు అందజేస్తున్నారు. మార్కెట్ కమిటీల పాలక మండళ్ల భర్తీతోపాటు దేవాలయాల ధర్మకర్తల మండళ్లనూ భర్తీ చేయనున్నారు. ‘మార్కెట్ కమిటీలు, దేవాయల కమిటీలతో పాటు పార్టీ కమిటీల నియామకం కూడా చేపడతాం.
అసెంబ్లీ సమావేశాలు ముగిశాక సీఎం జిల్లా పర్యటనలకు కూడా వెళ్తారు..’ అని మంత్రి టి.హరీశ్‌రావు పేర్కొన్నారు. మంగళవారం అసెంబ్లీలో మంత్రి విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. నారాయణఖేడ్, వరంగల్ స్థానాలకు వారం రోజుల్లో ఉప ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నామన్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు సైతం కలిసే వస్తాయేమోనని అన్నారు. నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ పోటీ చేస్తుందని స్పష్టంచేశారు.
మాజీ ఎమ్మెల్యే పి.కిష్టారెడ్డి కుటుంబ సభ్యులనే ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా సహకరించాలని కాంగ్రెస్ చేసిన విజ్ఞప్తిని ప్రస్తావించగా ‘మన రాష్ట్రంలో ఏకగ్రీవంగా వదిలేసే సంప్రదాయం ఉందా? తిరుపతిలో, ఆళ్లగడ్డలో కాంగ్రెస్ పోటీ ఎందుకు పెట్టింది? జాతీయ పార్టీకి ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధానం, ఒక్కో సంప్రదాయం ఉంటుందా..’ అని హరీశ్ ప్రశ్నించారు. వచ్చే రెండు మూడు నెలలూ ఎన్నికల కాలమేనని వ్యాఖ్యానించారు. బుధవారంతో సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నారా అని ప్రశ్నించగా.. మంత్రి సూటిగా సమాధానమివ్వలేదు. మిషన్ కాకతీయ, సంక్షేమ పథకాలపై చర్చ ఉందని, సంక్షేమ పథకాలపై సీఎం కేసీఆర్ మాట్లాడతారని పేర్కొన్నారు. మంత్రివర్గ విస్తరణ, మార్పులు చేర్పులపై జరుగుతున్న ప్రచారం, వస్తున్న వార్తలను కొట్టిపారేశారు.