అమరావతి : దక్షిణాది రాష్ట్రాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు 'మెక్‌డోనాల్డ్' ప్రకటించింది. ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల్లో 242గా ఉన్న రెస్టారెంట్ల సంఖ్యను వచ్చే రెండేళ్లలో రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మెక్‌డోనాల్డ్ ఇండియా బిజినెస్ ఆపరేషన్స్ డైరెక్టర్ (సౌత్) గెరాల్డ్ డయాస్ తెలిపారు. కేవలం రెస్టారెంట్ల సంఖ్యను పెంచుకోవడమే కాకుండా ఇక్కడివారి రుచులకు అనుగుణంగా మెనూ తయారు చేస్తున్నట్లు తెలిపారు.
ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాలవారు స్పైసీ ఫుడ్‌ను ఇష్టపడతారని, వీరి కోసం ప్రత్యేక మెనూ తయారుచేసినట్లు తెలిపారు. విజయవాడలో తొలి మెక్‌డోనాల్డ్ రెస్టారెంట్‌ను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. శాకాహారుల కోసం ప్రతీ రెస్టారెంట్లోనూ ప్రత్యేక కిచెన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గత నెలలో నెల్లూరులో మొదటి రెస్టారెంట్‌ను ఏర్పాటు చేశామని, త్వరలోనే గుంటూరు, విశాఖపట్నంలో రెస్టారెంట్లను ప్రారంభించే యోచనలో ఉన్నట్లు తెలిపారు.
విజయవాడలోని రెస్టారెంట్‌కు వచ్చిన స్పందన చూసిన తర్వాత విస్తరణపై దృష్టి సారించనున్నట్లు తెలిపారు. తెలంగాణాలో మెక్‌డోనాల్డ్ ప్రస్తుతం 21 రెస్టారెంట్లను కలిగి ఉంది. మొత్తం ఇండియా వ్యాపారంలో 40 శాతం కేవలం దక్షిణాది రాష్ట్రాల నుంచే సమకూరుతుండటంతో ఈ రాష్ట్రాలపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
దక్షిణాది వంటకాలతో మెక్‌డోనాల్డ్స్
Published Thu, Sep 29 2016 7:09 PM | Last Updated on Mon, Sep 4 2017 3:31 PM
Advertisement
Advertisement