ఎస్కేయూకు అరుదైన గుర్తింపు
- రాష్ట్రంలో 3వ ర్యాంకు
–జాతీయ స్థాయిలో 96వ ర్యాంకు,
ఎస్కేయూ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంకు అరుదైన గుర్తింపు దక్కింది. కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ శాస్త్రి భవన్‌లో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ప్రేమ్ వర్క్ (ఎన్‌ఐఆర్‌ఎఫ్) ర్యాంకులను సోమవారం ప్రకటించారు. ఎస్కేయూకు జాతీయ స్థాయిలో 96వ ర్యాంకు, రాష్ట్రంలో 3వ ర్యాంకు దక్కింది. ఎస్వీ యూనివర్సిటీ, ఆంధ్రా వర్సిటీల తరువాత స్ధానం ఎస్కేయూ దక్కించుకోవడం గమనార్హం.
ఉన్నత ప్రమాణాలు గల అధ్యాపకులు..
ఉన్నత విద్య ప్రమాణాలు గల అధ్యాపకులు ఎస్కేయూలో పనిచేస్తున్నట్లు ఎన్‌ఐఆర్‌ఎఫ్ ప్రకటించింది. పీహెచ్‌డీ అవార్డు గల 130 మంది అసిస్టెంట్, అసోసియేట్, ప్రొఫెసర్లు పనిచేస్తున్నారు. మొత్తం 171 మంది అధ్యాపకులు ఉన్నారు. ఇందులో 36 మంది మహిళా అధ్యాపకులు ఉన్నారు. 2015–16 విద్యాసంవత్సరంలో డిగ్రీ పూర్తిచేసిన 31 మంది, పీజీ పూర్తిచేసిన 26 మంది విద్యార్థులు , పీహెచ్‌డీ పూర్తి చేసిన 89 మంది విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్య అవకాశం కలిగింది. 2015–16 విద్యాసంవత్సరంలో 182 మంది ఎస్సీ, ఎస్టీ , ఓబీసీ కేటగిరి విద్యార్థులు పీహెచ్‌డీ పూర్తిచేశారు. 187 అంతర్జాతీయ జర్నల్స్, 37 సైటేషన్స్ ఎస్కేయూ అధ్యాపకులు కలిగి ఉన్నారని ఎన్‌ఐఆర్‌ఎఫ్ తన అధికార వెబ్‌సైట్‌లో పేర్కొంది.
సైన్స్ విభాగాల పురోగతితోనే గుర్తింపు..
ఎస్కేయూలో కెమిస్ట్రి, ఫిజిక్స్, బోటనీ, జువాలజీ, బయెటెక్నాలజీ, బయోకెమిస్ట్రి,, సెరికల్చర్ విభాగాల్లో జరుగుతున్న పరిశోధనల ఫలితంగానే జాతీయ స్థాయి గుర్తింపు రావడానికి ఆస్కారం ఏర్పడింది. కెమిస్ట్రి, విభాగంలో అంతర్జాతీయ జర్నల్స్, సైటేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఫిజిక్స్‌లో ప్రతిష్టాత్మక ఇస్రో ప్రాజెక్టును నిర్వహిస్తున్నారు. 10 సంవత్సరాలుగా విశేషమైన ఫలితాలను ఈ ప్రాజెక్టులు పొందుతున్నాయి. బయోటెక్నాలజీలో డాక్టర్ డి.మురళీధర్ రావు పరిశోధనలకు పేటెంట్ దక్కింది. బోటనీ విభాగంలో అరుదైన మొక్కజాతి మనుగడపై విశేష పరిశోధనలు జరుగుతున్నాయి. బయెకెమిస్ట్రి,లో రామన్‌రీసెర్చ్ ఫెలోషిప్‌కు డాక్టర్ నరేంద్ర మద్దు ఎంపికయ్యారు. సీఎస్‌ఐఆర్, డీబీటీ తదితర ప్రాజెక్టుల ద్వారా ఆవిష్కరణలు జరుగుతున్నాయి.
------------------------------
నాణ్యమైన పరిశోధనలతోనే గుర్తింపు..
ప్రామాణికమైన, నాణ్యమైన పరిశోధనలతోనే ఎస్కేయూకు జాతీయ స్థాయి గుర్తింపు వచ్చింది. జాతీయ స్థాయిలో నాణ్యమైన విద్యను అందించే వర్సిటీలో 100లోపు మార్క్ చేరుకోగలిగాం.
– కే.రాజగోపాల్, వీసీ, ఎస్కేయూ.
---------------------------
సమష్టి సహకారంతోనే:
బోధన, బోధనేతర, సాధారణ విద్యార్థులు, పరిశోధక విద్యార్థుల సమష్టి సహకారంతోనే జాతీయ స్థాయి గుర్తింపు వచ్చింది. భవిష్యత్తులో ఉన్నత విద్య, పరిశోధన, విస్తరణ, తదితర అంశాల్లో గణనీయమైన ప్రగతి సాధించడానికి కృషి చేస్తాం. తొలిసారిగా రాష్ట్రంలో మూడవ స్థానం రావడం గర్వకారణం .
– కే.సుధాకర్ బాబు, రిజిస్ట్రార్, ఎస్కేయూ.