హోరాహోరీగా క్రీడా పోటీలు
-
షటిల్‌లో ప్రొద్దుటూరుపై తిరుపతి విజయం
ముత్తుకూరు:
ముత్తుకూరు మత్స్యకళాశాలలో తలపెట్టిన ఐదురోజుల 'ఆక్వా ఫ్రోలిక్ 2016' క్రీడల పోటీలు మూడో రోజు శనివారం హోరాహోరీగా సాగాయి. ఇందులో భాగంగా షటిల్ బాలికల డబుల్స్‌లో ప్రొద్దుటూరు వెటర్నరీ జట్టుపై తిరుపతి వెటర్నరీ జట్టు విజయం సాధించింది. బాలికల సింగిల్స్‌లో తిరుపతి విద్యార్థిని వేదసంహిత గెలుపొందింది. బాలుర సింగిల్స్‌లో గన్నవరం, డబుల్స్‌లో తిరుపతి వెటర్నరీ విద్యార్థులు విజయం సాధించారు. టెన్నికాయిట్‌లో ముత్తుకూరు మత్స్యకళాశాల విద్యార్థినులు, బాలుర టేబుల్ టెన్నిస్‌లో తిరుపతి డెయిరీ టెక్నాలజీ, బాలికల విభాగంలో తిరుపతి వెటర్నరీ విద్యార్థినులు విజయం సాధించారు. అలాగే బాలుర జావెలిన్ త్రో పోటీలో మునిచంద్ర–తిరుపతి, వినోద్–తిరుపతి విద్యార్థులు మొదటి రెండు స్థానాలు కైవశం చేసుకున్నారు. బాలికల విభాగంలో ముత్తుకూరు మత్స్యకళాశాల విద్యార్థిని డీ ఆశ గెలుపొందారు. మూడు వేల మీటర్ల పరుగుపందెంలో గన్నవరం విద్యార్థి సాయితేజ, లాంగ్‌జంప్‌లో ఉదయ్ శివనాగ శంకర్‌లు ప్రథమ స్థానాలు సాధించారు. బాలికల షాట్‌ఫుట్ విభాగంలో గన్నవరం విద్యార్థిని యాస్మిన్ విజేతగా నిలిచింది. ఇదే విధంగా వక్తృత్వ, చిత్రలేఖనం పోటీలు కూడా జరిగాయి. అసోసియేట్ డీన్ కృష్ణప్రసాద్, క్రీడల హెడ్ జయచంద్ర, స్టూడెంట్స్ ఎఫైర్స్ ఇన్‌చార్జ్ ప్రభంజన్‌కుమార్‌రెడ్డి ఈ పోటీలను పర్యవేక్షించారు.