muthukuru
-
ముత్తుకూరులో మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమం
-
కృష్ణపట్నం పోర్టు నుంచి విదేశాలకు బియ్యం ఎగుమతి
ముత్తుకూరు: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని ఆదాని కృష్ణపట్నం పోర్టు నుంచి విదేశాలకు బియ్యం ఎగుమతి చేపట్టారు. ‘ఎంవీ సారోస్ బీ’ అనే నౌక ద్వారా 10,900 టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేస్తున్నట్టు పోర్టు ఉన్నతోద్యోగి ఒకరు శనివారం చెప్పారు. ఈ మేరకు పోర్టులోని గిడ్డంగిలో సిద్ధం చేసిన బియ్యం బస్తాలను లారీల ద్వారా నౌకలోకి చేరవేస్తున్నారు. ఈ బియ్యం బస్తాలను ఈస్ట్ ఆఫ్రికా దేశంలోని మెడగాస్కర్ పోర్టుకు చేరవేస్తున్నామని చెప్పారు. శనివారం సాయంకాలం బియ్యం ఎగుమతికి మరో నౌక పోర్టులో లంగరు వేసింది. అందులో 13వేల టన్నుల బియ్యంను వెస్ట్ ఆఫ్రికాలోని బెనిన్ పోర్టుకు చేరవేస్తామని తెలిపారు. -
నెల్లూరు: కత్తులతో యువకుల హల్చల్!
సాక్షి, నెల్లూరు : నెల్లూరులో ఓ షార్ట్ ఫిల్మ్ ట్రూప్ హల్చల్ చేసింది. కొంతమంది యువకులు కత్తులతో బైక్‌పై చక్కర్లు కొడుతూ స్థానికులను బెంబేలెత్తించారు. షూటింగ్‌ను నిజమైన గొడవేమోనని భావించిన స్థానిక ప్రజలు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వారు హుటాహుటిన ముత్తుకూరు గేటు వద్దకు చేరుకున్నారు. షార్ట్‌ఫిల్మ్ షూట్‌కు అనుమతి లేదంటూ యువకులను అదుపులోకి తీసుకున్నారు. అయితే తాము కార్పొరేషన్ వద్ద పర్మిషన్ తీసుకున్నామని చెప్పడంతో మందలించి వదిలేశారు. -
పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి సర్వే
ముత్తుకూరు : పామాయిల్ ఫ్యాక్టరీలకు కేంద్రంగా ఉన్న పంటపాళెం పంచాయతీలో మరో ఫ్యాక్టరీ నిర్మాణానికి సర్వే శుక్రవారం మొదలైంది. కోళ్లమిట్ట రైల్వే గేటు వద్ద నిర్మించబోయే దీని పేరు ‘పంచ్’ పామాయిల్ ఫ్యాక్టరీ. ఈ పంచాయతీలో ఇప్పటికే 7 ఫ్యాక్టరీల ద్వారా పామాయిల్ ఉత్పత్తులు జరుగుతున్నాయి. సరయూవాలా చెంతనే జై సంతోషిమాతా పేరుతో 8వ ఫ్యాక్టరీ, త్రిపుల్ ఎఫ్ ఫ్యాక్టరీ సమీపంలో లోహియా పేరుతో 9వ ఫ్యాక్టరీ నిర్మాణం జరుగుతోంది. ప్రస్తుతం 10వ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం 30 ఎకరాల భూముల్ని సర్వే చేస్తున్నారు. ఫ్యాక్టరీలన్నీ ఇప్పటి వరకు రైల్వే లైన్‌కు దక్షిణం వైపు ఉండగా, తాజా ఫ్యాక్టరీ ఏర్పాటుకు సన్నాహాలు మొదలుపెట్టారు. -
హోరాహోరీగా క్రీడా పోటీలు
షటిల్లో ప్రొద్దుటూరుపై తిరుపతి విజయం ముత్తుకూరు: ముత్తుకూరు మత్స్యకళాశాలలో తలపెట్టిన ఐదురోజుల 'ఆక్వా ఫ్రోలిక్ 2016' క్రీడల పోటీలు మూడో రోజు శనివారం హోరాహోరీగా సాగాయి. ఇందులో భాగంగా షటిల్ బాలికల డబుల్స్‌లో ప్రొద్దుటూరు వెటర్నరీ జట్టుపై తిరుపతి వెటర్నరీ జట్టు విజయం సాధించింది. బాలికల సింగిల్స్‌లో తిరుపతి విద్యార్థిని వేదసంహిత గెలుపొందింది. బాలుర సింగిల్స్‌లో గన్నవరం, డబుల్స్‌లో తిరుపతి వెటర్నరీ విద్యార్థులు విజయం సాధించారు. టెన్నికాయిట్‌లో ముత్తుకూరు మత్స్యకళాశాల విద్యార్థినులు, బాలుర టేబుల్ టెన్నిస్‌లో తిరుపతి డెయిరీ టెక్నాలజీ, బాలికల విభాగంలో తిరుపతి వెటర్నరీ విద్యార్థినులు విజయం సాధించారు. అలాగే బాలుర జావెలిన్ త్రో పోటీలో మునిచంద్ర–తిరుపతి, వినోద్–తిరుపతి విద్యార్థులు మొదటి రెండు స్థానాలు కైవశం చేసుకున్నారు. బాలికల విభాగంలో ముత్తుకూరు మత్స్యకళాశాల విద్యార్థిని డీ ఆశ గెలుపొందారు. మూడు వేల మీటర్ల పరుగుపందెంలో గన్నవరం విద్యార్థి సాయితేజ, లాంగ్‌జంప్‌లో ఉదయ్ శివనాగ శంకర్లు ప్రథమ స్థానాలు సాధించారు. బాలికల షాట్‌ఫుట్ విభాగంలో గన్నవరం విద్యార్థిని యాస్మిన్ విజేతగా నిలిచింది. ఇదే విధంగా వక్తృత్వ, చిత్రలేఖనం పోటీలు కూడా జరిగాయి. అసోసియేట్ డీన్ కృష్ణప్రసాద్, క్రీడల హెడ్ జయచంద్ర, స్టూడెంట్స్ ఎఫైర్స్ ఇన్చార్జ్ ప్రభంజన్కుమార్రెడ్డి ఈ పోటీలను పర్యవేక్షించారు. -
క్రీడల్లో ఎస్వీవీయూ ప్రతిష్ట పెంచాలి
ముత్తుకూరు : ‘ఆక్వా ఫ్రోలిక్ 2016’ క్రీడల పోటీల్లో శ్రీవెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ ప్రతిష్ట మరింత పెంచాలని ఫిషరీస్ డీన్ డాక్టర్ టీవీ రమణ, స్టూడెంట్స్ అఫైర్స్ డీన్ ప్రొఫెసర్ కే సర్జనరావులు అన్నారు. ఎస్వీవీయూ ఆధ్వర్యంలో 8వ అంతర్ కళాశాలల గేమ్స్, స్పోర్ట్స్, కల్చరల్ మీట్ గురువారం ముత్తుకూరులోని మత్స్యకళాశాలలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా క్రీడా జ్యోతి వెలిగించి, బాణసంచా వేడుకల మధ్య పోటీలను మొదలుపెట్టారు. ఐదు కళాశాలల విద్యార్థులు క్రీడా పతాకాలు చేతబూని మార్చ్ఫాస్ట్ చేశారు. మత్స్యకళాశాల రజతోత్సవాల సందర్భంగా ఎస్వీవీయూ పరిధిలోని తిరుపతి, గన్నవరం, ప్రొద్దుటూరు వెటర్నరీ కళాశాలలు, తిరుపతిలోని డెయిరీ, ముత్తకూరులోని మత్స్య కళాశాలకు చెందిన 450 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నైనాసెహ్వాల్, సింధు, హారిక, హరికృష్ణల వలే కీర్తి బావుటా ఎగురవేయాలన్నారు. ఈ వేడుకల్లో కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ కేఎస్ కృష్ణప్రసాద్, ఏఆర్ఎస్ హెడ్ సూర్యనారాయణ, ఎస్వీవీయూ స్పోర్ట్స్ హెడ్ జయచంద్ర, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. వర్షాల వల్ల పోటీలకు అంతరాయం: బంగాళాఖాతంలో ఏర్పడ్డ ‘నాడా’ తుపాను ప్రభావంతో గురువారం మధ్యాహ్నం నుంచి వర్షం మొదలైంది. దీంతో అట్టహాసంగా మొదలైన క్రీడల పోటీలకు అంతరాయం ఏర్పడింది. శుక్రవారం కూడా వర్షాలు కురిస్తే ఇండోర్ క్రీడల పోటీలు మాత్రమే నిర్వహిస్తామని కళాశాల వర్గాలు వెల్లడించాయి. -
గోపాలపురంలో అనుమానాస్పద మృతి
పాడుబడిన బావిలో ఎముకలు, పుర్రె లభ్యం వృద్ధురాలివిగా అనుమానిస్తున్న పోలీసులు ముత్తుకూరు: కృష్ణపట్నం పంచాయతీ పరిధిలోని గోపాలపురంలో శిథిలగృహం ముందున్న పాడుబడిన బావిలో వృద్ధురాలివిగా అనుమానిస్తున్న పుర్రె , ఎముకలు ఆదివారం లభ్యమయ్యాయి. ఎస్సై విశ్వనాథరెడ్డి కథనం మేరకు..గోపాలపురంలో శిథిలగృహం పక్కనున్న ఇంట్లో కోడూరు చెంగమ్మ(65) అనే వృద్ధురాలు కదలలేని స్థితిలో నివాసం ఉంటోంది. పెన్షన్ నగదుతో జీవనం సాగిస్తోంది. ఆమెకు కుమార్ అనే కొడుకు ఉన్నాడు. రెండు, మూడు మాసాలుగా చెంగమ్మ, కొడుకు కుమార్ కనిపించడం లేదు. పాడుపడిన బావి నుంచి దుర్గంధం వస్తుండడంతో ఆదివారం ఉదయం ఇంటి యజమాని నాగేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రంగంలోకి దిగిన పోలీసులు బావి నుంచి చిరిగిపోయిన నైటీతో పాటు ఎముకలు, పుర్రె వెలుపలకు తీయించారు. ఇవి కనిపించకుండా పోయిన చెంగమ్మ మృతదేహం అవశేషాలుగా అనుమానిస్తున్నారు. రూరల్ డీఎస్పీ పరిశీలన నెల్లూరు రూరల్ డీఎస్పీ తిరుమలేశ్వరరెడ్డి ఘటన స్థలానికి చేరుకుని ఎముకలు, పుర్రెను పరిశీలించారు. కృష్ణపట్నం సర్పంచ్ మొలకమ్మ, వీఆర్వో సుబ్బయ్యతో పాటు స్థానికులను విచారించారు. మద్యం అలవాటు ఉన్న కుమార్ డబ్బు కోసం తల్లి చెంగమ్మను హత్య చేసి పాడుపడిన బావిలో పడేసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు. కుమార్‌ను విచారిస్తే పూర్తి వివరాలు వెలుగులోకి వస్తాయన్నారు. హత్యకేసు నమోదు చేసి ఎముకలు, పుర్రెను పరీక్ష నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపుతున్నట్లు ఎస్సై విశ్వనాథరెడ్డి తెలిపారు. -
కాలువలో ఆక్వా ఔట్లెట్ల కూల్చివేత
పెద్ద ఎత్తున రైతుల మోహరింపు ముత్తుకూరు : మండలంలోని ఈదులవారిపాళెం నుంచి పంటపాళెం చెరువుకు సాగునీరు అందించే న్యూ చానల్లో ఆక్వా గుంతల నుంచి పైపులతో అమర్చిన ఔట్లెట్లను బుధవారం యంత్రంతో కూల్చివేశారు. దీనితో కాలువ కట్టపై రైతులు పెద్ద సంఖ్యలో మోహరించారు. ఈ కాలువ కింద 3,000 ఎకరాలు సాగు అవుతోంది. రొయ్యల గుంతల నుంచి వ్యర్ధ జలాలు, అధిక సెలెనిటి కలిగిన ఉప్పు నీటిని ఔట్లెట్ల ద్వారా కాలువలోకి విడుదల చేస్తున్నారు. ఫలితంగా వరిపైరు దెబ్బతినడమే కాకుండా దిగుబడి తగ్గిపోతోంది. కలుషిత జలాలను తాగి పశువులు అనారోగ్యానికి గురౌతున్నాయి. దీనితో పంటపాళెం సాగునీటి సంఘం అధ్యక్షుడు దువ్వూరు నిరంజన్‌రెడ్డి ఆధ్వర్యంలో రైతులు రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదులు చేశారు. ఫలితంగా రబీ వరి సాగుకు సాగునీరు విడుదల మొదలయ్యే దశలో ఇటీవల ఔట్లెట్లు తొలగించాలని ఆక్వా రైతులకు నోటీసులు జారీ చేశారు. అయితే ఎటువంటి స్పందన లేకపోవడంతో నీటి సంఘం «అధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, కృష్ణపట్నం సొసైటీ అధ్యక్షుడు దువ్వూరు విశ్వమోహన్‌రెడ్డి, దొరువులపాళెం ఎంపీటీసీ సభ్యుడు పర్రిరత్నయ్య, ఇరిగేషన్ ఏఈ ప్రసాద్, ఆర్ఐ జ్యోతిల సమక్షంలో వేలాడే విద్యుత్ తీగలను కట్ చేసి, కాలువలో అమర్చిన 15 ఔట్లెట్ల పైపులను, కాపలాదారుల పూరిపాకలను కూల్చివేశారు. కాలువ కట్టను వెడల్పు చేశారు. తరలివచ్చిన ఆక్వా రైతులు విద్యుత్ తీగలు తొలగించడం, ఔట్లెట్లు కూల్చివేయడంతో ఆక్వా రైతులు కాలువ వద్దకు చేరారు. మాజీ నీటి సంఘం అ«ధ్యక్షుడు దామవరపు రామచంద్రారెడ్డి ద్వారా ఔట్లెట్ల తొలగింపు నిలిపివేయాలని ఆయకట్టు రైతులను కోరారు. దీనికి రైతు నాయకులు స్పందిస్తూ, నోటీసులు ఇచ్చినా ఫలితం లేకపోవడంతో వరిపంటను దెబ్బతీసే వ్యర్ధ జలాల ఔట్లెట్లను మాత్రమే తొలగిస్తున్నామన్నారు. మురుగునీటి తరలింపునకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. -
వలంటీర్లతో చట్టాలపై అవగాహన
సీనియర్ సివిల్ జడ్జి సత్యవాణి ముత్తుకూరు : వలంటీర్ల ద్వారా పేదలకు చట్టాలపై అవగాహన కల్పించే కార్యక్రమం చేపట్టామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి సీ సత్యవాణి వెల్లడించారు. ముత్తుకూరులో శుక్రవారం జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సులో న్యాయమూర్తి మాట్లాడుతూ ప్రభుత్వ శాఖల్లో పేదల సమస్యలు ప్రస్తావించే అధికారం వలంటీర్లకు ఉంటుందన్నారు. ప్రభుత్వానికి సంబంధించిన ఏ శాఖనైనా ప్రశ్నించే అధికారం న్యాయ సేవాధికార సంస్థకు ఉందన్నారు. చట్టాలు ఉల్లంఘించడం, వ్యతిరేకించడం వంటి చర్యలు ఇబ్బందులకు గురి చేస్తుందనేది గుర్తుంచుకోవాలన్నారు. జిల్లా కేంద్రంలో ప్రతి రోజూ లోక్ అదాలత్ జరుగుతుందన్నారు. మొబైల్ లోక్ అదాలత్ ద్వారా కేసులు త్వరితగతిన పరిష్కరించుకోవచ్చన్నారు. చిన్న కేసుల పరిష్కారానికి మొబైల్ లోక్‌అదాలత్‌ను వినియోగించుకోవాలని సూచించారు. లోక్ అదాలత్ సభ్యులు డీఎస్ కామేశ్వరి, డిప్యూటీ తహశీల్దార్ శ్రీనివాసరావు, ఆర్ఐ ప్రదీప్, ఏఎస్ఐ శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముత్తుకూరులో గతంలో మరుగుదొడ్లు నిర్మించుకున్న పేదలకు బిల్లుల చెల్లింపు జరగలేదని మైనార్టీ మోర్చా నేత అబ్దుల్‌షఫీఉల్లా బాధితులతో కలిసి న్యాయమూర్తికి వినతిపత్రం అందజేశారు. -
మత్స్యకళాశాల అభివృద్ధికి రూ.3.63 కోట్లు
జనవరిలో రజతోత్సవాలు ముత్తుకూరు : ముత్తుకూరులోని మత్స్యకళాశాల స్థాయి పెంచేందుకు శ్రీవెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ నడుంకట్టింది. ఇందులో భాగంగా కళాశాల మొదటి అంతస్తు నిర్మాణానికి రూ.3.63 కోట్లు మంజూరు చేసింది. మొదటి విడతగా రూ.1.20 కోట్లు విడుదల చేసింది. అలాగే సంఖ్య పెరుగుతున్న విద్యార్థినుల హాస్టల్ మొదటి అంతస్తు నిర్మాణానికి రూ.1.50 కోట్లు మంజూరయ్యాయి. రూ.81 లక్షలతో నిర్మించిన మినీ ఆడిటోరియంను జనవరిలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాణం పూర్తయిన ఈ ఆడిటోరియానికి అదనపు హంగులు సమకూర్చేందుకు రూ.45 లక్షలతో ప్రతిపాదనలు పంపారు. మరో వైపు వెంకటాచలం మండలంలోని తిరుమలమ్మపాళెంలో ఉన్న ఫామ్ చుట్టూ ప్రహరీగోడ నిర్మించేందుకు రూ.45 లక్షలు మంజూరైంది. ఎగువమిట్టలోని క్షేత్రంలో గిడ్డంగి నిర్మించేందుకు రూ.20 లక్షలు మంజూరు చేశారు. విద్యార్థుల మెస్, డైనింగ్ గది నిర్మాణానికి రూ.25 లక్షలు మంజూరైంది. ఇద్దరు డీన్లు రాక నేడు ఎస్వీవీయూ నుంచి సోమవారం మత్స్యకళాశాలకు ఇద్దరు డీన్లు వస్తున్నట్టు అసోసియేట్ డీన్ కృష్ణప్రసాద్ చెప్పారు. స్టూడెంట్ అఫైర్స్ డీన్ డాక్టర్ మూర్తి, ఫిషరీస్ డీన్ డాక్టర్ రమణ తదితరులు వస్తున్నారన్నారు. 2017 జనవరిలో కళాశాల రజతోత్సవ వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇందుకోసం కమిటీలు కూడా నియమించామన్నారు. -
రెండు ఆటోలు ఢీ : యువకుడి మృతి
కడప : ఎదురెదురుగా వస్తున్న రెండు ఆటోలు ఢీకొని ఒక యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన వైఎస్సార్ జిల్లా అట్లూరు మండలం ముత్తుకూరు గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. ముత్తుకూరు గ్రామంలో జరుగుతున్న ఓ శుభకార్యానికి వచ్చి వెళ్తున్న ఆటో అదే కార్యక్రమానికి వస్తున్న మరో ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో.. ఆటో ముందు భాగంలో డ్రైవర్ పక్కన కూర్చున్న మహబూబ్‌పాషా (21) అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. దాంతో స్థానికులు వెంటనే స్పందించి అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో మృతి చెందాడు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.