వలంటీర్లతో చట్టాలపై అవగాహన
-
సీనియర్ సివిల్ జడ్జి సత్యవాణి
ముత్తుకూరు : వలంటీర్ల ద్వారా పేదలకు చట్టాలపై అవగాహన కల్పించే కార్యక్రమం చేపట్టామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి సీ సత్యవాణి వెల్లడించారు. ముత్తుకూరులో శుక్రవారం జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సులో న్యాయమూర్తి మాట్లాడుతూ ప్రభుత్వ శాఖల్లో పేదల సమస్యలు ప్రస్తావించే అధికారం వలంటీర్లకు ఉంటుందన్నారు. ప్రభుత్వానికి సంబంధించిన ఏ శాఖనైనా ప్రశ్నించే అధికారం న్యాయ సేవాధికార సంస్థకు ఉందన్నారు. చట్టాలు ఉల్లంఘించడం, వ్యతిరేకించడం వంటి చర్యలు ఇబ్బందులకు గురి చేస్తుందనేది గుర్తుంచుకోవాలన్నారు. జిల్లా కేంద్రంలో ప్రతి రోజూ లోక్ అదాలత్ జరుగుతుందన్నారు. మొబైల్ లోక్ అదాలత్ ద్వారా కేసులు త్వరితగతిన పరిష్కరించుకోవచ్చన్నారు. చిన్న కేసుల పరిష్కారానికి మొబైల్ లోక్‌అదాలత్‌ను వినియోగించుకోవాలని సూచించారు. లోక్ అదాలత్ సభ్యులు డీఎస్ కామేశ్వరి, డిప్యూటీ తహశీల్దార్ శ్రీనివాసరావు, ఆర్‌ఐ ప్రదీప్, ఏఎస్‌ఐ శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముత్తుకూరులో గతంలో మరుగుదొడ్లు నిర్మించుకున్న పేదలకు బిల్లుల చెల్లింపు జరగలేదని మైనార్టీ మోర్చా నేత అబ్దుల్‌షఫీఉల్లా బాధితులతో కలిసి న్యాయమూర్తికి వినతిపత్రం అందజేశారు.