క్రీడల్లో ఎస్‌వీవీయూ ప్రతిష్ట పెంచాలి
క్రీడల్లో ఎస్‌వీవీయూ ప్రతిష్ట పెంచాలి
Published Thu, Dec 1 2016 11:41 PM | Last Updated on Mon, Sep 4 2017 9:38 PM
ముత్తుకూరు : ‘ఆక్వా ఫ్రోలిక్ 2016’ క్రీడల పోటీల్లో శ్రీవెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ ప్రతిష్ట మరింత పెంచాలని ఫిషరీస్ డీన్ డాక్టర్ టీవీ రమణ, స్టూడెంట్స్ అఫైర్స్ డీన్ ప్రొఫెసర్ కే సర్జనరావులు అన్నారు. ఎస్‌వీవీయూ ఆధ్వర్యంలో 8వ అంతర్ కళాశాలల గేమ్స్, స్పోర్ట్స్, కల్చరల్ మీట్ గురువారం ముత్తుకూరులోని మత్స్యకళాశాలలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా క్రీడా జ్యోతి వెలిగించి, బాణసంచా వేడుకల మధ్య పోటీలను మొదలుపెట్టారు. ఐదు కళాశాలల విద్యార్థులు క్రీడా పతాకాలు చేతబూని మార్చ్‌ఫాస్ట్ చేశారు. మత్స్యకళాశాల రజతోత్సవాల సందర్భంగా ఎస్‌వీవీయూ పరిధిలోని తిరుపతి, గన్నవరం, ప్రొద్దుటూరు వెటర్నరీ కళాశాలలు, తిరుపతిలోని డెయిరీ, ముత్తకూరులోని మత్స్య కళాశాలకు చెందిన 450 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నైనాసెహ్వాల్, సింధు, హారిక, హరికృష్ణల వలే కీర్తి బావుటా ఎగురవేయాలన్నారు. ఈ వేడుకల్లో కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ కేఎస్ కృష్ణప్రసాద్, ఏఆర్‌ఎస్ హెడ్ సూర్యనారాయణ, ఎస్‌వీవీయూ స్పోర్ట్స్ హెడ్ జయచంద్ర, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.
వర్షాల వల్ల పోటీలకు అంతరాయం:
బంగాళాఖాతంలో ఏర్పడ్డ ‘నాడా’ తుపాను ప్రభావంతో గురువారం మధ్యాహ్నం నుంచి వర్షం మొదలైంది. దీంతో అట్టహాసంగా మొదలైన క్రీడల పోటీలకు అంతరాయం ఏర్పడింది. శుక్రవారం కూడా వర్షాలు కురిస్తే ఇండోర్ క్రీడల పోటీలు మాత్రమే నిర్వహిస్తామని కళాశాల వర్గాలు వెల్లడించాయి.
Advertisement
Advertisement