గోపాలపురంలో అనుమానాస్పద మృతి
-
పాడుబడిన బావిలో ఎముకలు, పుర్రె లభ్యం
-
వృద్ధురాలివిగా అనుమానిస్తున్న పోలీసులు
ముత్తుకూరు: కృష్ణపట్నం పంచాయతీ పరిధిలోని గోపాలపురంలో శిథిలగృహం ముందున్న పాడుబడిన బావిలో వృద్ధురాలివిగా అనుమానిస్తున్న పుర్రె , ఎముకలు ఆదివారం లభ్యమయ్యాయి. ఎస్సై విశ్వనాథరెడ్డి కథనం మేరకు..గోపాలపురంలో శిథిలగృహం పక్కనున్న ఇంట్లో కోడూరు చెంగమ్మ(65) అనే వృద్ధురాలు కదలలేని స్థితిలో నివాసం ఉంటోంది. పెన్షన్ నగదుతో జీవనం సాగిస్తోంది. ఆమెకు కుమార్ అనే కొడుకు ఉన్నాడు. రెండు, మూడు మాసాలుగా చెంగమ్మ, కొడుకు కుమార్ కనిపించడం లేదు. పాడుపడిన బావి నుంచి దుర్గంధం వస్తుండడంతో ఆదివారం ఉదయం ఇంటి యజమాని నాగేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రంగంలోకి దిగిన పోలీసులు బావి నుంచి చిరిగిపోయిన నైటీతో పాటు ఎముకలు, పుర్రె వెలుపలకు తీయించారు. ఇవి కనిపించకుండా పోయిన చెంగమ్మ మృతదేహం అవశేషాలుగా అనుమానిస్తున్నారు.
రూరల్ డీఎస్పీ పరిశీలన
నెల్లూరు రూరల్ డీఎస్పీ తిరుమలేశ్వరరెడ్డి ఘటన స్థలానికి చేరుకుని ఎముకలు, పుర్రెను పరిశీలించారు. కృష్ణపట్నం సర్పంచ్ మొలకమ్మ, వీఆర్వో సుబ్బయ్యతో పాటు స్థానికులను విచారించారు. మద్యం అలవాటు ఉన్న కుమార్ డబ్బు కోసం తల్లి చెంగమ్మను హత్య చేసి పాడుపడిన బావిలో పడేసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు. కుమార్‌ను విచారిస్తే పూర్తి వివరాలు వెలుగులోకి వస్తాయన్నారు. హత్యకేసు నమోదు చేసి ఎముకలు, పుర్రెను పరీక్ష నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపుతున్నట్లు ఎస్సై విశ్వనాథరెడ్డి తెలిపారు.