తప్పిన పెను ప్రమాదం
తప్పిన పెను ప్రమాదం
Published Sun, Dec 4 2016 9:12 AM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM
–ప్రమాదవశాత్తు ప్రైవేట్ బస్సులో మంటలు
–టోల్‌గేట్ వద్ద ఘటన
– సురక్షితంగా బయటపడిన ప్రయాణికులు
కృష్ణగిరి: బెంగళూరుకు చెందిన ప్రైవేట్ బస్సు ప్రమాదవశాత్తు కాలిబూడిదైంది. జాతీయ రహదారిలోని అమకతాడు టోల్‌గేట్ వద్ద ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. అదృష్టవశాత్తు ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. వివరాల్లోకి వెళితే.. ఎస్‌ఆర్‌ఎస్ ట్రావెల్స్‌కు చెందిన కేఏ01 ఏబీ 6198 నంబర్ గల ప్రైవేట్ బస్సు హైదరబాదు నుంచి బెంగళూరుకు బయలుదేరింది. తెల్లవారుజామున 3.10గంటలకు కృష్ణగిరి మండల పరిధిలోని టోల్‌గేట్ వద్దకు చేరుకుంది. అక్కడ ఉన్న టోల్‌గేటు సిబ్బంది, స్థానిక పోలీసులు బస్సులో నుంచి పొగ రావడం గమనించి వెంటనే డ్రైవర్‌కు తెలియజేశారు. ఆయన వెంటనే వారి సహకారంతో బస్సులోని 20మంది ప్రయాణికులను కిందకు దించారు. వారు దిగి అలా పక్కకు వెళ్లగానే పెద్ద మంటలు వ్యాపించి బస్సు పూర్తిగా కాలిపోయింది. డోన్ అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మంటలు ఆర్పివేశారు. బస్సు ఇంజన్ హీట్ అయి మంటలు రేగినట్లు డ్రైవర్ తెలిపారు. ప్రమాద విషయం తెలుసుకున్న డోన్ సీఐ శ్రీనివాసులు, కృష్ణగిరి ఎస్‌ఐ సోమ్లానాయక్, జిల్లా అగ్నిమాపక అధికారి భూపాల్‌రెడ్డి ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. డ్రైవర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు తెలిపారు.
మంటలను గమనించకుంటే..
టోల్‌గేట్ దగ్గర స్థానికులు మంటలను గమనించడంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడగలిగారు. టోల్‌గేటు దాటిన తర్వాత మార్గమధ్యంలో మంటలు వ్యాపించి ఉంటే పరిస్థితి మరోవిధంగా ఉండేది. ప్రయాణికులకు ప్రాణాపాయం జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉండేది. తమ అదృష్టం బాగుందని టోల్‌గేట్ సిబ్బందికి, స్థానిక పోలీసులకు ప్రయాణికులు కృతజ్ఞతలు తెలిపారు. తర్వాత పోలీసులు వారిని బెంగుళూరు వైపు వెళ్లే మరో బస్సులో ఎక్కించి పంపారు.
Advertisement
Advertisement