విశాఖపట్నం : హాస్టల్‌లో చదువుకుంటున్న విద్యార్థి అనారోగ్యంతో మృతి చెందిన... వార్డెన్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా గుట్టు చప్పుడు కాకుండా మృతదేహాన్ని తరలిస్తుండటాన్ని గిరిజన విద్యార్థి సంఘం నాయకులు గమనించారు. దీంతో మృతదేహాన్ని వారు అడ్డుకొని ధర్నాకు దిగారు. విశాఖ జిల్లా డుంబ్రిగూడ మండలానికి చెందిన గిరిజన విద్యార్థి రాజు (21) విశాఖలోని గిరిజన వసతిగృహంలో ఉంటూ కృష్ణా డిగ్రీ కళాశాలలో బీఏ రెండో సంవత్సరం చదువుతున్నాడు.
ఈక్రమంలో పచ్చకామెర్లతో.. నిన్న రాత్రి మృతి చెందాడు. ఆ విషయాన్ని అతడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా హాస్టల్ డిప్యూటీ వార్డెన్ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్తుంది. ఆ విషయం తెలుసుకున్న గిరిజన విద్యార్థి సంఘం, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు అరకులో మృతదేహాన్ని అడ్డుకొన్నారు. రహదారిపై వారు ధర్నాకు దిగారు. సమాచారం ఇవ్వకుండా మృతదేహాన్ని తరలిస్తున్న డిప్యూటీ వార్డెన్‌ను విధుల నుంచి బహిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీంతో అరకులోని ప్రధాన రహదారి పై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
ఇది ఇలా ఉంటే... గిరిజన హాస్టల్ లో వసతులు సరిగ్గా లేవంటూ విద్యార్థులు శుక్రవారం విశాఖపట్నం కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగారు. హాస్టల్ వార్డెన్ పై సస్పెన్షన్ వేటు వేయాలని వారు డిమాండ్ చేశారు.