ఇసుకాసురులకు బకాసురుల పోటు
ఇసుకాసురులకు బకాసురుల పోటు
Published Sun, Sep 11 2016 5:24 PM | Last Updated on Tue, Aug 28 2018 8:41 PM
* బాస్ కన్నుగప్పి అనుచరులు ఇసుక అక్రమ రవాణా
* శివారు ప్రాంతాల్లో రహస్యంగా డంపింగ్
* బిల్డర్ వాహనాల ద్వారా చెన్నై, బెంగళూరుకు..
* రీచ్‌ల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినా ఫలితం శూన్యం
దోచుకున్నోళ్లకు దోచుకున్నంత అన్నట్లుగా కృష్ణాతీరం వెంట ఇసుక అక్రమ రవాణా సాగుతోంది. బాస్ ఇసుక దోపిడీలో మేము ఓ రూపాయి తింటే తప్పేముందిలే అనుకుంటున్న అనుచరులు ఇసుక రీచ్‌ల్లో సొంత దందాకు తెరలేపారు. బాస్ పంపే వాహనాల్లో తమ అద్దె వాహనాలను కలిపేసి.. ఇసుకతో నింపేసి సొంత వ్యాపారం చేసుకుంటున్నారు. విషయం తెలుసుకుని బాస్‌లు అగ్గిమీదగుగ్గిలం అవుతున్నారు. కొన్నిచోట్ల రీచ్‌ల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి అనుచరుల కదలికలపై డేగకన్ను వేశారు. ఈ నేపథ్యంలో బాస్‌లు.. అనుచరుల మధ్య కోల్డ్‌వార్ కొనసాగుతోంది.
సాక్షి, అమరావతి బ్యూరో/ తుళ్లూరు రూరల్ : కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలోని కృష్ణానదీ తీరంలో విచ్చలవిడిగా తోడేస్తున్న ఇసుకను అధికార పార్టీ నేతలు కొందరు ఇతర ప్రాంతాలకు అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్న విషయం తెలిసిందే. రీచ్‌లలో అనుచరులను ఉంచి.. బాస్‌లు బయట వ్యాపార లావాదేవీలు నడుపుతూ పెద్ద మనుషులుగా చెలామణి అవుతుంటే... అనుచరులు సొంత ఆర్థిక ప్రయోజనాలను వెతుక్కున్నారు. రీచ్‌ల్లో నుంచే కొన్ని లారీల ద్వారా ఇసుకను రహస్య ప్రాంతాల్లో డంప్ చేస్తున్నారు. అక్కడి నుంచి నేరుగా వ్యాపారుల వాహనాలకు డంప్ చేసి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. అదెలా అంటారా?
కృష్ణా నదిలో అక్రమంగా తోడుతున్న ఇసుక కోసం అధికార పార్టీ పెద్దలు వారి సొంత వాహనాలు, మరికొన్ని తెలిసిన వారి లారీలు, టిప్పర్లను రీచ్ వద్దకు పంపుతారు. రీచ్‌ల వద్ద ఉన్న అనుచరులకు బాస్ ఫోన్ చేస్తాడు. ‘అరే.. వంద లారీలు, టిప్పర్లు పంపాను. వాటికి ఇసుక నింపి డబ్బులు తీసుకుని పంపేయ్’ అని చెబుతాడు. ‘అలాగేనన్నా’ అని ఫోన్‌పెట్టేసి.. వచ్చిన లారీలకు ఇసుక నింపి పంపేస్తాడు.
ఆ వాహనాల మాటున అనుచరుల అద్దె వాహనాలు ..
బాస్ వంద వాహనాలు పంపితే.. అనుచరుడు 25 నుంచి 50 వాహనాలు అద్దెకు తీసుకుని వాటికీ ఇసుకను నింపుతాడు. బాస్ వాహనాల మధ్య వీటి ద్వారా పట్టణాలకు దూరంగా రహస్య ప్రాంతాలకు ఇసుకను చేరవేస్తారు. అక్కడ అనుచరులు నేరుగా చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లోని బిల్డర్‌తో మాట్లాడతారు. ‘మీరు లారీ ఇసుక రూ.40 వేలకు కొనుగోలు చేస్తున్నారంటగా.. నేను రూ.30 వేలకే నాణ్యమైన ఇసుకను ఇస్తాను. అయితే వాహనాన్ని మీరే పంపాలి. మేము లారీకి ఇసుకను నింపి పంపుతాం’ అని చెబుతారు. రూ.10 వేలు తగ్గినా మంచిదే కదా? అని బిల్డర్ నేరుగా లారీని పంపి ఇసుకను కొనుగోలు చేసుకుంటున్నాడు. ఇలా కృష్ణా తీరం పొడవునా ఉన్న రీచ్‌లలో అనుచరులకు చెందిన వాహనాలు 25 శాతం నుంచి 50 శాతం మధ్యలో ఉంటున్నాయి. అనుచరులు చేస్తున్న మోసాన్ని గమనించిన బాస్‌లు రీచ్‌ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించారు. అయినా రోజులో ఒక రీచ్ నుంచి కనీసం వందకుపైగా లారీల ద్వారా అనుచరులు ఇసుకను తరలిస్తున్నారు. ఇటీవల ‘సాక్షి’లో వస్తున్న వరుస కథనాల్లో బారులు తీరిన వాహనాల ఫొటోలను చూసిన బాస్‌లు.. ముక్కున వేలేసుకున్నట్లు తెలిసింది. మన లెక్క ప్రకారం ఒక రీచ్ నుంచి 750 లారీల ఇసుకు డబ్బు వస్తుంటే.. అక్కడ వెయ్యి లారీలకుపైనే ఉన్నాయని గుర్తించిన అధికార పార్టీ నేతలు ఏం చేయాలని పునరాలోచనలో పడినట్లు సమాచారం.
Advertisement
Advertisement