జగన్ మాటకు కట్టుబడి పనిచేస్తాం
- శిల్పా విజయానికి కృషి
- వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యుడు రాజగోపాల్‌రెడ్డి
నంద్యాల: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి మాటకు కట్టుబడి ఉంటామని, ఆయన ముఖ్యమంత్రి కావడమే లక్ష్యంగా పని చేస్తామని పార్టీ కేంద్ర కార్యనిర్వాహక కమిటీ(సీఈసీ) సభ్యుడు మలికిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. పార్టీ సీఈసీ సభ్యుడిగా నియమితులైన ఆయనను పార్టీ నేతలు, కార్యకర్తలు ఆదివారం అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదవులు ఆశించకుండా నిర్వార్థంగా పార్టీకి సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన బాధ్యతలను శక్తివంచన లేకుండా నిర్వహించినట్లు తెలిపారు. పార్టీ వల్ల తనకు గుర్తింపు వచ్చిందని, పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా బాధ్యతాయుతంగా పని చేస్తామన్నారు. ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి శిల్పామోహన్‌రెడ్డికి పూర్తిగా సహకరించి ఆయన విజయానికి కృషి చేస్తానని తెలిపారు.
అభివృద్ధి ఇప్పుడే గుర్తొచ్చిందా?
టీడీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతున్నా గుర్తుకురాని అభివృద్ధి ఆ పార్టీ నేతలకు ఇప్పుడే గుర్తొచ్చిందని రాజగోపాల్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఉప ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టడానికే లేనిపోని హామీలు గుప్పిస్తున్నారని ఆరోపించారు. అయితే ఇలాంటి వాటిని ప్రజలు గమనిస్తున్నారని, ఎన్నికల్లో తగిన విధంగా బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ నేతలు మాధవరెడ్డి, ఖాద్రి, అల్లాబకాష్, సంజీవరెడ్డి, ప్రసాదరెడ్డి, వివేకానందరెడ్డి, వేణు, యూసుఫ్, రవూఫ్, యశ్వంతరెడ్డి, వెంకటేశ్వర్లు యాదవ్, అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు.