అమరరాజ గ్రోత్ కారిడర్‌లోని మంగళ్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా యాదమరి మండలం ముత్తరపల్లె గ్రామం వద్ద రూ.200ల కోట్లతో ఏర్పాటుచేసిన ప్లాస్టిక్ ఇంజెక్షన్ మోల్డింగ్ ఫెసిలిటీ పరిశ్రమను బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి చిత్తూరు ఎంపీ శివప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అమరరాజ గ్రూప్ చైర్మన్ గల్లా రామచంద్ర నాయుడు మాట్లాడుతూ అమరరాజ గ్రూపు తరపున 1985లో తిరుపతి కరకంబాడి వద్ద బ్యాటరీల ప్యాక్టరీని ప్రారంభించామన్నారు. ఇప్పటివరకు ఆరు ప్రాంతాల్లో 16 బ్రాంచ్‌లు ఏర్పాటుచేసి 14 వేల మందికి ఉపాధి కల్పించామన్నారు.
ప్రస్తుతం అమరరాజ గ్రూపులో మంగళ్ ఇండ స్ట్రీస్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ ఫ్యాక్టరీలు ఏర్పాటుచేస్తున్నట్లు వివరించారు. బ్యాటరీలకు అవసరమయే ప్లాస్టిక్ వస్తువులు అందంగా, నాణ్యంగా తయారు చేయడానికి 1991లో మొట్టమొదట చిత్తూరు జిల్లా పూతలపట్టు పేటమిట్ట గ్రామం వద్ద ప్రారంభించామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఫ్యాక్టరీలు స్థాపించి అక్కడ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని ఆ ప్రాంతాలు ఎన్నుకున్నట్లు తెలిపారు. తరువాత తిరుపతి కరకంబాడి వద్ద ప్రారంభించామన్నారు.
హైక్వాలిటీతో ప్లాస్టిక్ వస్తువులు తయారు చేస్తుండడంతో పలు దేశాల నుంచి పలు కంపెనీలు అడగడంతో పలు ఫ్యాక్టరీలు ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే బుధవారం యాదమరి మండలంలో ముత్తర పల్లె వద్ద రూ.200 కోట్లతో ప్రారంభించి అందులో 500 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు తెలియజేశారు. అందరి సహకారంతో మరిన్ని ప్యాక్టరీలు ప్రారంభించనున్నట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి గల్లా అరుణకుమారి, మంగళ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎండీ గల్లా పద్మావతి తదితరులు పాల్గొన్నారు.