కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకురానున్న కొత్త జీఎస్‌టీతో రాష్ట్ర ఆదాయానికి భారీగా గండి పడుతుందని వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్ తాతారావు అన్నారు.
కొత్త జీఎస్‌టీతో రాష్ట్ర ఆదాయానికి గండి
Published Thu, Sep 29 2016 12:35 AM | Last Updated on Thu, Sep 27 2018 4:42 PM
– ఆధికారాలు కుదిస్తే ఒప్పుకోం
– టర్నోవర్ పరిధిని రూ.10కోట్లకు పెంచాలి
–ధర్నాలో డీసీ తాతారావు
కర్నూలు(రాజ్‌విహార్): కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకురానున్న కొత్త జీఎస్‌టీతో రాష్ట్ర ఆదాయానికి భారీగా గండి పడుతుందని వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్ తాతారావు అన్నారు. బుధవారం నగర శివారులోని ఇండస్ స్కూల్ నుంచి కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి మహా ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణంగా ఏ రాష్ట్రంలో ఉప్పత్తి అయిన వస్తువులపై ఆ రాష్ట్ర ప్రభుత్వాలే పన్నులు వసూలు చేసుకునే అధికారాలున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం కొత్త జీఎస్‌టీని తీసుకొస్తే పన్ను అధికారాలన్నీ కేంద్రం పరిధిలోకే వెళ్తాయన్నారు. ప్రస్తుతం 14.5 శాతం పన్ను వసూలు చేస్తున్నారని, కేంద్రం దీనికి 18 శాతం వసూలు చేసి రాష్ట్ర వాటా 9 శాతం ఇవ్వనుందని చెప్పారు. ఈలెక్కన 5.5శాతం మేరకు పన్ను ఆదాయాన్ని కోల్పోవలసి వస్తుందని పేర్కొన్నారు. కొత్త జీఎస్‌టీతో రూ. 1.50కోట్లలోపు టర్నోవర్ ఉంటే ఆ వ్యాపార సంస్థలపై అధికారాలు తమ పరిధిలో ఉంటాయని, ఆపై టర్నోవర్ ఉంటే కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వెళ్తాయని చెప్పారు. టర్నోవర్ పరిధిని రూ.10కోట్లకు పెంచాలని కోరారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్లు శ్రీవెంకటేశ్వర్, గీతా మాధూరి, సీటీఓలు నాగ్రేంద్ర ప్రసాద్, హుసేన్ సాహెబ్, రామాంజనేయ ప్రసాద్, సీటీ ఎన్‌జీఓస్ సంఘం ప్రతినిధులు వెంకటేశ్వర్లు, కమలాకర్, ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం జిల్లా కార్యదర్శి బంగీ శ్రీధర్ డీసీటీఓలు, ఏసీటీఓలు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement
Advertisement