రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు ప్రారంభం
రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు ప్రారంభం
Published Sun, Feb 19 2017 12:25 AM | Last Updated on Tue, Sep 5 2017 4:02 AM
కొవ్వూరు : పట్టణంలో రాష్ట్రస్థాయి ఇన్విటేషన్ వాలీబాల్ పోటీలను జిల్లా అదనపు సెషన్స్ జడ్జి వైవీఎస్‌జీబీ పార్ధసారథి శనివారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రారంభోత్సవ సభలో ఆయన మాట్లాడారు. గౌతమీ స్పోర్ట్స్ అండ్ కల్చలర్ అసోసియోషన్ పదేళ్లుగా పోటీలు నిర్వహించడం అభినందనీయం అన్నారు. రానున్న రోజుల్లో జాతీయస్థాయి పోటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. క్రీడాకారులు ఇటువంటి టోర్నమెంటులను సద్వినియోగ పరచుకుని జాతీయస్థాయిలో రాణించాలని సూచించారు. అసోసియోషన్ అధ్యక్షుడు పరిమి హరిచరణ్ మాట్లాడుతూ పదిహేనేళ్లుగా రాష్ట్రస్థాయి పోటీలతో పాటు వేసవి శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నామన్నారు. తమ అసోసియోషన్ వద్ద శిక్షణ పొందిన ఎంతో మంది క్రీడాకారులు జాతీయస్థాయిలో రాణిస్తున్నారన్నారు. ఆర్డీవో బి.శ్రీనివాసరావు మాట్లాడుతూ కొవ్వూరులో క్రీడలను ప్రోత్సహించే ఔత్సహికులుండడం అభినందనీయం అన్నారు. శాశ్వత క్రీడా సదుపాయాలు ఏడాదిలో సమకూరే అవకాశం ఉందన్నారు. కొవ్వూరులో స్టేడియం ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించామన్నారు. వచ్చే ఏడాదికి గ్రౌండ్ సమస్య తీరుతుందన్నారు. అసోసియోషన్ కార్యదర్శి సూరపనేని చిన్ని, వైస్ చైర్మన్ దుద్దుపూడి రాజారమేష్, బ్యాడ్మింటన్ అసోసియోషన్ కార్యదర్శి పొట్రు మురళీకృష్ణ, టీడీపీ జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడు పొట్రు శ్రీనివాసరావు, నాయకులు సూర్యదేవర రంజిత్, బొబ్బా సుబ్బారావు మాట్లాడారు. అనంతరం అతిథులు సర్వీసు చేసి పోటీలను ప్రారంభించారు. ప్రకాశం, కృష్ణ జిల్లా జట్లు తొలిమ్యాచ్‌లో తలపడ్డాయి. లీగ్ కం నాకౌట్ పద్ధతిలో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్టు జాతీయ చీఫ్ రిఫరీ డి.నేతాజీ తెలిపారు. నేషనల్ రిఫరీలు బి.శ్రీనివాసరావు, పి.సుబ్బారెడ్డి, రాష్ట్రస్థాయి రిఫరీలు ఆర్.సురేష్, ఎస్‌కే మస్తాన్ వలీ, కె.రామ్‌కుమార్ ఎంఫైర్లుగా వ్యవహరిస్తున్నారు. నాయకులు పరిమి రామకృష్ణ, పరిమి రాజేష్, పోలవరం ప్రాజెక్టు డీఈఈ ఎన్ పీ రాజేశ్వరరావు పాల్గొన్నారు.
Advertisement