అవినీతిలో స్టేట్ నంబర్‌వన్
కడప కార్పొరేషన్:
అవినీతిలో రాష్ట్రం నంబర్‌వన్‌గా నిలిచిందని శాసనమండలి ప్రతిపక్షనేత సీ. రామచంద్రయ్య విమర్శించారు. బుధవారం ఇక్కడి ఇందిరాభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వవైఖరిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి స్వయంగా
చేయించుకొన్న సర్వేలో 87 శాతం మంది ప్రజలు బాగుందని చెప్పినట్లు ప్రకటించుకోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఈ సర్వేలోనే రెవెన్యూలో అవినీతి పెరిగిందని పేర్కొనడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రికి ఒక రకమైన సర్వే, మంత్రులకు మరో రకమైన సర్వేలు చేయించుకుంటూ ఆత్మవంచన చేసుకొని తృప్తి పడుతున్నారని విమర్శించారు. కేబినెట్‌లో మంత్రులను తొలగించడానికే ఈ ఎత్తుగడ వేశారన్నారు. ప్రధాని నరేంద్రమోడీ చేయించిన సర్వేలో రాష్ట్రం అవినీతిలో నంబర్ వన్‌గా నిలిచిందని, పనితీరులో సీఎం చంద్రబాబు 13వ స్థానంలో నిలిచారన్నారు. ఇవేవీ ఆయన పైకి చెప్పుకోవడం లేదని ఎద్దేవా చేశారు.
పార్లమెంటు, అసెంబ్లీలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ జేబు సంస్థలుగా వాడుకొంటున్నాయని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పార్లమెంటులో ఏ బిల్లు అయినా చర్చకు రావాలంటే రాష్ట్రపతి అనుమతి కావాలని, గత ఏడాది ఆగష్టులో ప్రత్యేక హోదాపై ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. పార్లమెంటు వ్యవహారాల అధికారులు, రాష్ట్రపతి అందరూ కూడా అది ఆర్థిక బిల్లు కాదనే సిఫారసు చేశారన్నారు. ఇప్పుడు ఉన్నట్టుండి అరుణ్‌జైట్లీ ఇది ఆర్థిక బిల్లు అని చెప్పడం వింతగా ఉందన్నారు. పార్లమెంటుకు సంబంధించిన వీడియోను ఎంపీ వెబ్‌సైట్‌లో ఉంచాడని, అతన్ని అరెస్ట్ చేయాలని బీజేపీ కావాలనే రాద్దాంతం చేసిందన్నారు. ప్రత్యేక హోదాపై ప్రైవేటు బిల్లుపై ఓటింగ్ జరక్కుండా చేసేందుకే ఇలా చేశారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి సీఎం చంద్రబాబు శల్య సార«థ్యం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటివరకూ 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చారని, ఒక్క రాష్ట్రానికైనా చట్టం చేసి ఇచ్చారేమో చెప్పాలని ప్రశ్నించారు. విభజన సమయంలో ప్రత్యేక హోదా పదేళ్లుకావాలని అడిగిన వెంకయ్యనాయుడు చట్టం చేయాలని అనాడే ఎందుకు అడగలేకపోయారని నిలదీశారు. ముఖ్యమంత్రే అవినీతిపరుడైతే రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. విజయవాడలోని స్వరాజ్‌మైదానాన్ని చైనా కంపెనీకి అప్పగించారని, వారు అది కట్టుకోవడానికి నిధులు తెచ్చుకొంటే అది పెట్టుబడిగా చూపిస్తున్నారని తెలిపారు. ఈ రెండేళ్లలో రాష్ట్రానికి ఎన్ని పెట్టుబడులు వచ్చాయో సీఎం చెప్పాలన్నారు. సీఎం వైఖరి వల్ల కేంద్ర బడ్జెట్లో, రైల్వేస్‌లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని, వైఎస్‌ఆర్ జిల్లా ఇప్పటికే బలైపోయిందని, త్వరలో రాష్ట్ర ప్రజలు కూడా బలికాబోతున్నారని జోస్యం చెప్పారు. కడపలో ఉక్కుఫ్యాక్టరీని స్థాపిస్తే లాభదాయకమని ఒక ప్రయివేటు సంస్థ భావించి పెట్టుబడులు పెట్టిందని, బ్యాంకు అధికారులు కూడా అది నిజమని నమ్మి రుణం ఇచ్చారన్నారు. అయితే ప్రభుత్వం తరుపున ఏర్పాటు చేస్తే లాభదాయం కాదని అధికారులు నివేధిక ఇవ్వడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ప్రత్యేక హోదా సాధించకపోతే సీఎం చరిత్ర హీనుడిగా మిగిలిపోతారని హెచ్చరించారు. ఈ సమావేశంలో పీసీసీ కార్యదర్శి నీలిశ్రీనివాసరావు, డీసీసీ అధ్యక్షుడు నజీర్ అహ్మద్, నగర అధ్యక్షుడు బండి జకరయ్య, ఎస్‌ఏ సత్తార్, శాంతయ్య పాల్గొన్నారు.