రాష్ట్రం విత్తన భాండాగారం కావాలి
- విత్తన కంపెనీలకు ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు
- 95 నియోజకవర్గాల్లో ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకోండి
- రైతులకు మేలు రకమైన సాగు పద్ధతులు నేర్పించండి
- తెలంగాణలో విత్తన ఉత్పత్తి మరింత పెరగాలి
- వ్యవసాయ వర్సిటీకి పూర్వ వైభవం తెస్తాం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణను విత్తన భాండాగారంగా మార్చే ప్రక్రియలో విత్తన కంపెనీలు భాగస్వాములు కావాలని సీఎం కె.చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సోమవారం విత్తన ఉత్పత్తి కంపెనీల ప్రతినిధులతో సీఎం సమావేశమయ్యారు. వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, ముఖ్య కార్యదర్శి పార్థసారథి, కమిషనర్ ప్రియదర్శిని, పలువురు విత్తన కంపెనీల ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. తొలి దశలో తెలంగాణలోని 95 గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కో గ్రామాన్ని, ఒక్కో విత్తన కంపెనీ దత్తత తీసుకోవాలని సీఎం కోరారు. కంపెనీ దత్తత తీసుకున్న గ్రామాల్లో రైతులను విత్తన ఉత్పత్తికి ప్రోత్సహించి, మేలు రకమైన సాగు పద్ధతులు నేర్పాలన్నారు. సీఎం ప్రతిపాదనకు విత్తన కంపెనీలు సానుకూలంగా స్పందించాయి. త్వరలో సమావేశమై గ్రామాలను దత్తత తీసుకునే అంశంలో తుది నిర్ణయం తీసుకొంటా మని కంపెనీల ప్రతినిధులు తెలిపారు. రాష్ట్రం లో విభిన్న స్వభావం కలిగిన నేలలు, సమశీతోష్ణ వాతావరణం, మంచి వర్షపాతం ఉన్నా యని, ఈ పరిస్థితులు విత్తన ఉత్పత్తికి ఎంతో దోహదం చేస్తాయని సీఎం చెప్పారు. ‘‘ఇలాం టి ప్రత్యేక పరిస్థితులున్నందునే ఇక్రిశాట్‌తో పాటు దాదాపు 364 విత్తన కంపెనీలు రాష్ట్రంలో ఉన్నాయి. భారత దేశ విత్తన రాజధానిగా పేరుంది. దేశానికి అవసరమయ్యే 80 శాతం విత్తనాలు తెలంగాణలో తయారవుతున్నాయి. 2.90 లక్షల ఎకరాల్లో విత్తన ఉత్పత్తి జరుగుతోంది. ఈ పరిస్థితిని మరింత సానుకూలంగా మలుచుకొని విత్తన ఉత్పత్తి మరింతగా జరగాలి. అది రైతులకు ఉపయోగపడాలి. దేశానికి అవసరమైన, మనం ఉత్పత్తి చేయాల్సిన విత్తనాలు, ఏ ప్రాంతంలో ఏ రకమైన విత్తనాలు పండించాలనే అంశాలపై అవగాహనకు రావాలి. రైతులను చైతన్య పరిచి విత్తన ఉత్పత్తిని ప్రోత్సహించాలి’’ అని సీఎం అన్నారు.
పరిశోధనలు ప్రోత్సహిస్తాం...
రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చడానికి ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకుంటోందని సీఎం అన్నారు. నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని, వ్యవసాయ శాఖలో క్షేత్రస్థాయిలో అధికారులను నియమిస్తున్నామన్నారు. ప్రతీ 5వేల ఎకరాలకు ఒక ఏఈవో ఉండేలా చర్యలు చేపడతామన్నారు. వ్యవసాయ అధికారులను ఆగ్రానమిస్టులుగా తీర్చిదిద్దుతున్నామన్నారు. వ్యవసాయ వర్సిటీకి పూర్వవైభవం తెచ్చి, పరిశోధనలు ప్రోత్సహిస్తామన్నారు. రైతులు వీలైన సాగు పద్ధతులు పాటించేలా అవగాహన పెంచుతామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గిడ్డంగుల సంఖ్య పెంచుతామన్నారు. ఇప్పటికే వ్యవసాయశాఖ పలు ప్రాంతాలను క్రాప్ కాలనీలుగా వర్గీకరణ చేసిందన్నారు. ఇది మరింత లోతుగా సాగాలన్నారు.
వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తలు, విత్తన కంపెనీలు కలిసికట్టుగా ఈ అధ్యయనం చేయాలని సూచించారు. సమైక్య పాలనలో కుదేలయిన వ్యవసాయరంగాన్ని లాభసాటిగా మార్చడానికి వ్యవసాయాధికారులు మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలని సీఎం సూచించారు. అధికారులు రైతులకు అందుబాటులో ఉండాలని, ఏ పంటలు వేస్తే మేలు జరుగుతుందో చెప్పాలన్నారు. మార్కెటింగ్‌పై అవగాహన కల్పించాలన్నారు. వ్యవసాయశాఖ అధికారులు సమావేశం ఏర్పాటు చేసుకొని రాష్ట్రం, జిల్లాలకు అవసరమైన కార్యాచరణ తయారు చేయాలని ఆదేశించారు. కాగా రాష్ట్రాన్ని విత్తన భాండాగారంగా తీర్చిదిద్దాలం టే విత్తన సాగుకు ముందుకు వచ్చే రైతులకు కొంత నగదును ప్రోత్సాహకంగా ఇవ్వాలని విత్తన కంపెనీల రైతులు సీఎంకు సూచిం చిగా... అందుకు కేసీఆర్ సానుకూలంగా స్పం దించినట్లు సమాచారం. విత్తనోత్పత్తికి తీసుకోవాల్సిన చర్యలపై మరోసారి చర్చించేందుకు సీఎం బుధవారం 40 పెద్ద విత్తన కంపెనీలతో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిసింది.
విత్తన ఉత్పత్తితో అధిక ఆదాయం
ఇక విత్తన ఉత్పత్తి చేసే రైతుకు సాధారణ పంట కంటే అధిక ఆదాయం వస్తుందని మంత్రి పోచారం తెలిపారు. రైతులు పండిం చిన విత్తనాలను కంపెనీలు నిర్ణీత ధరకు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. రైతువారీ బీమా, కనీస మద్దతు ధర, ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయడం వంటి విషయాలపై త్వరలో ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించినట్లు తెలిపారు. రుణమాఫీలో మిగిలిన సగాన్ని ఒకేసారి త్వరలోనే బ్యాంకులకు చెల్లిస్తామని చెబుతున్నా ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. ఏపీలో రుణమాఫీనే జరగలేదని గుర్తుచేశారు. విత్తన ఉత్పత్తి సంస్థల ప్రతిని ధులు హరీష్‌రెడ్డి, ఏఎస్‌ఎన్ రెడ్డి, నిరంజన్, సుదర్శన్, శ్యాంసుందర్‌రావు, రమణారావు, శ్రీపతిరెడ్డి, ఇంద్రసేనారెడ్డి తదితరులు భేటీలో పాల్గొన్నారు.